మహేష్ (ఫైల్) పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న మహేష్ కుటుంబసభ్యులు, స్నేహితులు
రాంగోపాల్‌పేట్: ఓ మహిళను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో పోలీస్ కేసు అవుతుందేమోననే భయంతో ఓ యువకుడు హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళ్‌హాట్‌కు చెందిన విశాంబర్ బిర్‌దార్ చిన్న కుమారుడు బి.మహేష్ (26) 7 నెలలుగా సికింద్రాబాద్‌లోని ఓ జ్యువెలరీ షోరూమ్‌లో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 23న సాయంత్రం విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్నాడు. బైబిల్ హౌస్ సిగ్నల్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వైపు వెళుతుండగా బోట్స్ క్లబ్ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఓ మహిళను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మహేష్‌ను గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు వివరాలు తీసుకుని మరుసటి రోజు తిరిగి రావాలని పంపించారు. ప్రమాదం జరిగిన సమయంలో మహేష్ మొబైల్ ఫోన్ అక్కడే పడిపోవడంతో అదే రోజు రాత్రి కిశోర్ అనే వ్యక్తి మహేష్ స్నేహితుడైన గంగా సాగర్‌కు ఫోన్ చేసి అక్కడ జరిగిన ప్రమాదం గురించి చెప్పాడు. మహేష్ కూడా గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నాడు. విషయం తెలుసుకున్న మహేష్ తండ్రి మహేష్ కోసం ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రికి వెళ్లి వాకబు చేసినా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన అదే రోజు గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. అయితే మంగళవారం ఉదయం నెక్లెస్‌రోడ్‌లోని సంజీవయ్య పార్కు సమీపంలోని హుస్సేన్ సాగర్‌లో మహేష్ శవమై తేలాడు. అతడి దగ్గర లభించిన ఆధారాలతో మహేష్‌గా పోలీసులు గుర్తించారు. తాను చేసిన ప్రమాదంతో ఏమైనా జరుగుతుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వేధింపులే ఉసురు తీశాయి
బన్సీలాల్‌పేట్: హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన మహేష్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మంగళవారం రాత్రి మృతుడి కుటుంబికులు, స్నేహితులు గాంధీనగర్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మృతుడి సోదరుడు విక్రమ్, స్నేహితులు విలేకరులతో మాట్లాడారు. మహేష్ మరణానికి పోలీసుల వేధింపులు కారణమని ఆరోపించారు. ప్రమాదం జరిగిన సమయంలో తమ సోదరుడి సెల్‌ను ఎవరో బలవంతంగా లాక్కుని తాను కానిస్టేబుల్‌ను అంటూ మాట్లాడిన తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. మహేష్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. మహేష్ మరణంపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
మాకెలాంటి సంబంధమూ లేదు..
హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న మహేష్ మరణంతో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని గాంధీనగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు స్పష్టంచేశారు. ఈ నెల 23న సాయంత్రం ఆర్పీ రోడ్డు నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే రహదారిలో మహేష్ తన ద్విచక్ర వాహనంపై వెళుతూ హైదర్‌బస్తీ ప్రాంతానికి చెందిన సుభాషిణి అనే మహిళను ఢీకొట్టాడని చెప్పారు. డయల్ 100 నుంచి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు. వాహనం ఢీకొన్న మహిళ అపస్మారక స్థితికి చేరుకోడంతో ఉస్మానియా ఆస్పత్రికి చికిత్ప కోసం తరలించి మహేష్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. విచారణ అనంతరం మహేష్‌ను ఇంటికి పంపించినట్లు చెప్పారు. లాక్‌డౌన్ కర్ఫ్యూ నేపథ్యంలో తమ కానిస్టేబుల్ వాహనంపై ఇంటికి పంపిస్తామని చెప్పినా మహేష్ వినిపించుకోకుండా కాలినడకన వెళ్లిపోయాడని వివరించారు. మహేష్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోడానికి తమకు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే చట్టపరంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ విషయాన్ని మహేష్ తండ్రి విశ్వంభరం, చిన్నాన్న రాజేందర్ కుటుంబ సభ్యులకు కూడా వివరించినట్లు చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలో మహేష్ ఈ నెల 23 రా>త్రి సుమారు 8 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కనుగొన్నామని సీఐ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment