108 రాకపోవడంతో ఘటనా స్థలానికి వచ్చి సేవలందిస్తున్న చినమేరంగి
జియ్యమ్మవలస మండలంలోని గవరమ్మపేట, చింతలబెలగాం మధ్యనున్న ప్రమాదకర మలుపు వద్ద సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేశారు. రెండు గంటల పాటు వేచిచూసినా వాహనం రాకపోవడంతో స్థానికుల కళ్లముందే దివంగత మాజీ ఎమ్మెల్యే మరిశర్ల వెంకటరామినాయుడు కుమారుడు మరిశర్ల వెంకటఅప్పల సూర్యప్రకాశరావు నాయుడుప్రాణం విడిచారు.
విజయనగరం, జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట, చింతలబెలగాం మధ్యనున్న ప్రమాదకర మలుపు వద్ద సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలం లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మలుపు వద్ద ఏమరుపాటుగా ఉండడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. చినమేరంగి ఎస్సై పొదిలాపు నారాయణరావు అం దించిన వివరాలు ఇలా ఉన్నాయి. గరుగుబిల్లి మండలం రావివలస గ్రామానికి చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే మరిశర్ల వెంకటరామినాయుడు కుమారుడు మరిశర్ల వెంకటఅప్పల సూర్యప్రకాశరావు నాయుడుతో పాటు లఖనాపు రం గ్రామానికి చెందిన శివ్వాల పకీరునాయుడు మాజీ మంత్రిని కలిసేందుకు పార్వతీపురం నుంచి కురుపాం బయలుదేరారు. సరిగ్గా గవరమ్మపేట – చింతలబెలగాం గ్రామాల మధ్య ఉన్న మలుపు వద్దకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కనే చెట్టును ఢీకొనడంతో వెంకట సూర్యప్రకాశరావునాయుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పకీరునాయుడుకు కాలు విరిగిపోయింది.
108కు ఫోన్ చేసిన ఎమ్మెల్సీ
ప్రమాదవార్త తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరాజు, స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అప్పటికి ప్రాణాలతో ఉన్న సూర్యప్రకాశరావును ఆస్పత్రికి తరలించేందుకు ఎమ్మెల్సీ శత్రుచర్ల, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరాజు 108కు ఫోన్ చేయగా... సుమారు రెండు గంటల వరకు రాలేదు. ఈలోగా చినమేరంగి సీహెచ్‌సీకి డాక్టర్ కమలకుమారికి ఫోన్ చేయగా, ఆమె వచ్చి పరీక్షించారు. అయితే అప్పటికే సూర్యప్రకాశరావు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన పకీరునాయుడును ఆస్పత్రికి తరలించారు. 108 సకాలంలో వచ్చి ఉంటే సూర్యప్రకాశరావు బతికి ఉండేవాడని పలువురు తెలిపారు.
మిన్నంటిన రోదనలు
జియ్యమ్మవలస/గరుగుబిల్లి : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరిశర్ల వెంకట ప్రకాశరావునాయుడు దివంగత మాజీ ఎమ్మెల్యే వెంకటరామినాయుడు మూడో కుమారుడు. ఇతడికి భార్య కమలతో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు. ఇందులో ఒక అమ్మాయికి వివాహం జరిగింది. ఇంటి పెద్దదిక్కు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన మృతి పట్ల మాజీ సర్పంచ్ సింహాచలంనాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శివున్నాయుడు, మాజీ ఎంపీపీ కోట జోగినాయుడు, గౌరమ్మలు, మాజీ సర్పంచ్ బలరాంనాయుడు, డీసీసీబీ చైర్మన్ మరిశర్ల తులసి సంతాపం తెలిపారు. సూర్యప్రకాశరావు మృతదేహానికి పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేపట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment