శశివర్దన్‌రెడ్డి (ఫైల్)
అనంతపురం, నల్లచెరువు: ‘అయ్యో..ఎంత పని చేస్తివి దేవుడా.. ఒక్కగానొక్క కుమారుడిని ఉన్నత స్థానంలో చూడాలనుకుంటిమే..ఇంతలోనే ఎంత పని చేస్తివయ్యా’ అంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. మండలంలోని అల్లుగుండు సమీపాన మదరసా వద్ద జాతీయ రహదారిపై బైక్ బోల్తాపడి ఓ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు..తనకల్లు మండలం పెద్దకడపలవారిపల్లికి చెందిన గౌడుచెరువు శ్రీనివాసులురెడ్డి, చంద్రకళ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్ల్లల చదువు కోసం శ్రీనివాసులురెడ్డి బెంగళూరులోనే ఉంటూ ఫ్యాక్టరీలలో పని చేసేవారు. కుమారుడు శశివర్దన్‌రెడ్డి(19) బెంగళూరులో బీబీఏ సెకండియర్ చదువుతున్నాడు.
బుధవారం బెంగళూరు నుంచి ముత్యాచెరువులోని బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. అల్లుగుండు సమీపాన మదరసా వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. శశివర్దన్‌రెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న సాయికుమార్ స్పల్పగాయాలతో బయటపడ్డాడు. వెంటనే శశివర్దన్‌రెడ్డిని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment