కార్తీక్‌రెడ్డి మృతదేహాన్ని చూసి విలపిస్తున్న కుటుంబ సభ్యులు
‘ఆరేళ్ల’ ఆశయం అప్పుడే చెదిరిపోయింది.. అ, ఆ..లతో ఆరంభమై.. అచ్చులు, హల్లులతో ఆగకుండా దిద్దిన అక్షరమే దిద్దుతూ.. అడుగులో అడుగు వేస్తూ.. తరగతులు ఎన్నో మారుతూ .. తలరాతను మార్చుకుందామని ఎన్నో మెట్లు ఎక్కుతూ.. ఉన్నతంగా చదివి ఉన్నత శిఖరం వైపు అక్షర‘బాట’ పట్టిన ‘బాల’విజ్ఞాని ఎక్కాల్సిన మెట్లు కుప్పకూలి.. అప్పుడే వందేళ్లు నిండాయి.. మొదటి ‘గురువు’ నాన్నచేయి పట్టుకొని బడికెళ్తుంటే మృత్యుశకటం మీదకొచ్చి ఆశ..శ్వాసను కాలరాస్తే.. ఆ ఇంట విషాదం అలుముకుంది. పూలకుంట గ్రామ శోకసంద్రమైంది.
సాక్షి, ఎస్కేయూ: పాఠశాలలో అడ్మిషన్ పొందడానికి వెళ్తున్న తండ్రీ కొడుకును రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం పూలకుంటకు చెందిన కాటప్పగారి నరసింహారెడ్డి (40), సంధ్యారాణి దంపతులు. సంధ్యారాణి తన పుట్టినిల్లు అయిన బుక్కపట్నం మండలం మారాలకు వెళ్లింది. ఇంటి వద్ద నరసింహారెడ్డి, కుమారుడు కార్తీక్‌రెడ్డి (6) ఉన్నారు. సోమవారం ఉదయం సమతాగ్రాంలోని రాధా స్కూల్‌లో ఒకటో తరగతిలో చేర్పించడానికి కుమారుడిని తీసుకుని నరసింహారెడ్డి బైక్‌లో బయల్దేరాడు. ఆకుతోటపల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో తండ్రీకుమారుడు నరసింహారెడ్డి, కార్తీక్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఐచర్ వాహన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదంజరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే పూలకుంట గ్రామస్తులు, ఎస్కేయూ విద్యార్థులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దేవుడా ఎంత పని చేశావయ్యా అంటూ గ్రామస్తులు విలపించారు. నరసింహారెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇటుకలపల్లి ఏఎస్‌ఐ నాగన్న తెలిపారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో తండ్రీ కుమారుల మృతదేహాలను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సందర్శించి, నివాళులర్పించారు.
అమ్మ ఊరికి వెళ్లకుంటే...
పూలకుంటలో ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో స్కూల్‌లో అడ్మిషన్ కోసం నరసింహారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డిని వెంట తీసుకెళ్లాడు. ‘అమ్మ ఊర్లో ఉండి ఉంటే బతికి ఉండేవాడివి కద బిడ్డా’ అంటూ బంధువులు రోదించిన తీరు కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment