మృతి చెందిన శరణమ్మ(ఫైల్)
అనంతపురం , ఆత్మకూరు: ఓవర్ టేక్ ఒక ప్రాణాన్ని బలిగొంది. వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పడంతో వెనుక కూర్చున్న మహిళ ఎగిరి రోడ్డుపై పడింది. ఆ వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు టైరు ఆమెపై వెళ్లడంతో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. శరణమ్మ (43) అనే మహిళ తన కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంలో కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వైపు వస్తున్నారు. మండల కేంద్రం ఆత్మకూరు స్టేట్ బ్యాంకు వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్‌చేయబోయాడు. అయితే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉండటంతో బ్రేక్ వేశాడు. కుదుపునకు బైక్‌లో వెనుక కూర్చున్న శరణమ్మ ఎగిరి రోడ్డుపై పడింది.
ఆమె కుమారుడు రోడ్డు పక్కన పడిపోయాడు. వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు టైరు శరణమ్మ ఛాతీభాగంపై వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో 108 వాహనంలో అనంతపురం తరలిస్తుండగా మార్గం మధ్యలోనే శరణమ్మ ప్రాణం విడిచింది. మృతురాలి వద్ద లభించిన ఆధార్ కార్డులో వివరాల ప్రకారం ఆమె అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి అని, బ్యాంకు పాస్‌పుస్తకంలో కంబదూరు మండలం కొత్తపల్లికి చెందినదిగా ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాగర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment