ఘటనా స్థలిలో యువతి మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
రామవరప్పాడు (గన్నవరం): ఇయర్ ఫోన్స్‌లో సహోద్యోగితో మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన నిడమానూరు ఫ్లై ఓవర్‌పై సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. సింగ్‌నగర్, వాంబే కాలనీకి చెందిన కాటూరి లక్ష్మి (22), జాక్సన్ భార్యభర్తలు. లక్ష్మి తండ్రి ఆటో డ్రైవర్ కాగా అతనికి ముగ్గురు కుమారైలు. గన్నవరంలోని హిందూస్తాన్ ప్రయివేట్ లిమిటెడ్‌లో లక్ష్మి కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తోంది. నిత్యం వాంబేకాలనీ నుంచి గన్నవరానికి తన యాక్టివా స్కూటీపై రాకపోకలు సాగిస్తూ విధులకు హాజరవుతుంది.
రోజు మాదిరిగానే విధులు పూర్తి చేసుకుని సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత కావాల్సిన నిత్యావసర వస్తువులు తీసుకుని ఇంటికి బయలు దేరింది. నిడమానూరు ఫ్లై ఓవర్ వద్దకు వచ్చేసరికి గుర్తుతెలియని భారీ వాహనం ఢీ కొనడంతో వెనక చక్రాల కింద పడిపోయింది. వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తల నుజ్జు నుజ్జు అవ్వడంతో లక్ష్మి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. కాగా, ఆమెకు రెండేళ్ల క్రితం జాక్సన్‌తో వివాహం కాగా, ఆరు నెలల నుంచి భార్యాభర్తలు వేరుగా ఉంటున్నారు.
బోరున విలపించిన తల్లిదండ్రులు..
విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. అదే సమయంలో లక్ష్మి సహోద్యోగి అక్కడే ఉండటంతో ఇయర్ ఫోన్స్‌లో నీతోనే మాట్లాడుతూ ఈ ప్రమాదం కొని తెచ్చుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో లక్ష్మి కాపురంలో నిప్పులు పోశావని, ఇప్పుడు ఆమె చావుకు కూడా కారణమయ్యావని ఆరోపించారు. సమాచారం అందుకున్న పటమట ఎస్సై సుధాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ ఎస్సై పురుషోత్తం తన సిబ్బందితో కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment