మృతురాలు ముత్యాల ఉమా(ఫైల్)
అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కుమార్తెను వధువుగా చూసి మురిసిపోవాలకున్న ఆ తల్లిదండ్రుల ఆశ తీరలేదు.. కాళ్ల పారణితో బుగ్గన చుక్క పెట్టుకుని మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలకున్న ఆ యువతి కాంక్ష నెరవేరలేదు.. నచ్చిన మెచ్చిలిపై తలంబ్రాలు పోసి జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకున్న ఆ యువకుడి కల ఫలించలేదు. శుభలేఖలు రావాల్సిన ఆ ఇంట్లో నుంచి చావు కబురు వినిపించింది. పెళ్లి బాజాలు మోగాల్సిన చోట మరణ మృదంగం మోగింది. పచ్చని పెళ్లిపందిరి, బంధుమిత్రులతో సందడిగా మారాల్సిన ఆ ఇంటి ప్రాంగణం శోక సంద్రంలో మునిగిపోయింది. వాయువేగంతో దూసుకొచ్చిన మృత్యువు మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిని చిదిమేసింది. యువకుల నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఆ యువతి కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటన సోమవారం రాత్రి విజయవాడ లబ్బీపేట ఎంజీరోడ్డులో చోటుచేసుకుంది.
కృష్ణలంక(విజయవాడ తూర్పు): మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా బ్రెయిడ్ డెడ్ అయ్యి కన్నవారికి కడుపుకోత మిగిల్చిన ఘటన సోమవారం రాత్రి లబ్బిపేట ఎంజీరోడ్డులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముత్యాల రాము కుండలు విక్రయిస్తూ భార్య, కొడుకు, కూతురుతో కలసి జగ్గయ్యపేట రంగుబజార్‌లో నివాసముంటున్నాడు. అతని కూతురు ముత్యాల ఉమా(26) డిగ్రీ పూర్తిచేసుకుని తండ్రికి ఆర్థికంగా సహాయ పడేందుకు నాలుగేళ్లుగా నగరంలోని ఎంజీరోడ్డులోనున్న కాల్‌సెంటర్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తూ లబ్బీపేటలోని లేడిస్ హస్టల్‌లో నివాసముంటుంది. ఇటీవలే కుటుంబ సభ్యులు ఒంగోలులోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసే తమ సమీప బంధువు రాయల వివేక్‌కుమార్‌తో ఉమాకు నిశ్ఛితార్థం చేసి ఏప్రిల్ 8న వివాహం నిశ్చయించారు. సోమవారం రాత్రి 8గంటల సమయంలో లబ్బీపేట ఎంజీరోడ్డులోని ఏటీఎం సెంటర్‌కు వెళ్లి నగదు డ్రాచేసుకుని రోడ్డు దాటుతుండగా ఏపీ05ఈఎస్6895 నెంబర్ కలిగిన వాహనంపై ముగ్గురు యువకులు బెంజిసర్కిల్ నుంచి బస్‌స్టేషన్ వైపు మితిమీరిన వేగంతో దూసుకువచ్చి ఆమెను బలంగా ఢీకొట్టారు. దీంతో యువతి ఎగిరి దూరంగా పడిపోవడంతో తల వెనుక గాయమై తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది.
ఈ సమయంలో ఆమెతోపాటు పనిచేసే తోటి ఉద్యోగులు చూసి ఆమెను దగ్గరలోని రమేష్ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు.కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఆమెను పెళ్లిచేసుకోబోయే యువకుడు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. బ్రెయిన్ డెడ్‌అయినట్లు డాక్టర్‌లు చెప్పడంతో వారు బోరున విలపిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేశారు. వాహనం నడిపిన జయంత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment