
చిన్నమండెం: మండల పరిధిలోని మల్లూరు క్రాస్ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని మల్లికార్జున(27), రెడ్డిశేఖర్(26)లు అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్‌ఐ రామాంజినేయుడు తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రాయచోటిలో బేల్దారి పనులు ముగించుకొని ద్విచక్రవాహనంలో భార్య సంధ్యతో కలసి మల్లికార్జున తన సొంత ఊరు పెద్దమండెం మండలం కుంటకిందపల్లెకు బయలుదేరారు.
అలాగే చిన్నమండెం మండలం దేవగుడిపల్లెకు చెందిన రెడ్డిశేఖర్ సొంత పనుల నిమిత్తం తన ద్విచక్రవాహనంలో రాయచోటికి వస్తున్నాడు. వీరు మల్లూరు క్రాస్ సమీపానికి రాగానే ఎదురెదురుగా వస్తున్న రెండు స్కూటర్లు ఢీకొయి. ప్రమాదంలో మల్లికార్జున, రెడ్డిశేఖర్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సంధ్యను 108 సాయంతో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ రామాంజినేయుడు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment