chinnamandem
-
బైక్‌లోకి దూరిన పాము.. బండి స్టార్ట్ చేయగానే బుసలు కొట్టుకుంటూ..
సాక్షి, వైఎస్సార్ కడప: సాధారణంగా పాములు ఏ తుప్పల్లోనో పొలం గట్టులపైనో కనిపిస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇళ్లలో, బాత్ రూం, షూలలో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ బైకులో పాము కలకలం రేపింది. చిన్నమండెం మండలం బోనమల ఎంపీటీసీ వెంకటప్పనాయుడు పని నిమిత్తం బైక్‌లో మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చాడు. వాహనాన్ని ఆవరణలో నిలబెట్టి లోపలికి వెళ్లాడు. బయటకు వచ్చిన ఆయనతో స్థానికులు బైక్‌లో పాము దూరిందని ఆయనకు తెలియజేశారు. సీటు తీసి పరిశీలించగా పాము కనిపించలేదు. వాహనాన్ని స్టార్ట్ చేసి పక్కన వేచి ఉండగా శబ్దానికి బైక్‌లో నుంచి పాము బుసలు కొట్టుకుంటూ బయటకు వచ్చింది. దీంతో స్థానికులు దానిని కొట్టి చంపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
చిన్నమండెం: మండల పరిధిలోని మల్లూరు క్రాస్ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని మల్లికార్జున(27), రెడ్డిశేఖర్(26)లు అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ రామాంజినేయుడు తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రాయచోటిలో బేల్దారి పనులు ముగించుకొని ద్విచక్రవాహనంలో భార్య సంధ్యతో కలసి మల్లికార్జున తన సొంత ఊరు పెద్దమండెం మండలం కుంటకిందపల్లెకు బయలుదేరారు. అలాగే చిన్నమండెం మండలం దేవగుడిపల్లెకు చెందిన రెడ్డిశేఖర్ సొంత పనుల నిమిత్తం తన ద్విచక్రవాహనంలో రాయచోటికి వస్తున్నాడు. వీరు మల్లూరు క్రాస్ సమీపానికి రాగానే ఎదురెదురుగా వస్తున్న రెండు స్కూటర్లు ఢీకొయి. ప్రమాదంలో మల్లికార్జున, రెడ్డిశేఖర్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సంధ్యను 108 సాయంతో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్ఐ రామాంజినేయుడు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నమండెం మండలం కేశాపురం వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, ఒకరు గాయపడ్డారు. మృతులు హర్షవర్థన్, బుజ్జి, భూదేవి సంఘటనా స్థలంలోనే చనిపోయారు. కాగా గాయపడిన క్షతగాత్రుడిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మరణించాడు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కడపకు చెందిన వీరంతా బెంగళూరు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కువైట్‌లో చాకిబండ వాసి మృతి
చిన్నమండెం(రాయచోటి రూరల్): చిన్నమండెం మండల పరిధిలోని చాకిబండ గ్రామం బలిజపల్లెకు చెందిన పి. నాగరాజ(38) శనివారం కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు అతని సమీప బంధువులు పేర్కొన్నారు. జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లి, నిత్యం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వస్తున్న వ్యక్తి ఆకస్మికంగా రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, భార్య లక్ష్మీ కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం స్వగ్రామం బలిజపల్లెలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృతి చెందడంతో భార్య, పిల్లలు దీపక(8), రిషిక(4), శ్రీహాన్(2)లు ఆదరణ కోల్పోయారు. ప్రభుత్వం సాయం అందించి కుటుంబానికి అండగా ఉండలాని పలువురు కోరుతున్నారు. -
లారీని తప్పించ బోయి..చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
చిన్నమండెం(రాయచోటి రూరల్): కడప–బెంగళూరు ప్రధాన రహదారిలో చిన్నమండెం మండలం ముండ్లవారిపల్లె సమీపంలో మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొన్న సంఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు(ఏపీ 28 జడ్ 2875) రాయచోటి నుంచి కలిచెర్లకు వెళుతూ, ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో ప్రయాణికులు 8 మంది, కండక్టర్ వేణుగోపాల్‌లు స్వల్పంగా గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని చిన్నమండెం పోలీసులు పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్ వీపీ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు ముందు భాగం అద్దం పూర్తిగా పగిలిపోయింది. -
చెట్టును ఢీకొన్న బస్సు: 10 మందికి గాయాలు
కడప : వైఎస్ఆర్ జిల్లా చినమండెం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. బెంగళూరు నుంచి కడప వస్తున్న బస్సు చినమండెం సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.