
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన జగదీష్, పవన్ కుమార్
సంక్రాంతి పండుగను సరదాగా జరుపుకోవాలనుకున్నఆ యువకుల ఆశలు ఆవిరయ్యాయి. పిండి వంటలుచేసుకునేందుకు మిషన్‌లో బియ్యపు పిండిని ఆడించుకుని వెళ్తున్న వారి బైకును మరో బైకు ఢీకొనడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
రాయచోటి టౌన్ : రాయచోటి రింగ్ రోడ్డు బిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి రూరల్ పరిధిలోని ఇందుకూరుపల్లెకు చెందిన పల్లె జగదీష్ (15), పవన్ కుమార్ (18) సోమవారం సాయంత్రం ఇందుకూరుపల్లె నుంచి రాయచోటికి వచ్చారు. అత్తిరాసలకోసం బియ్యం పిండిని మిషన్ ద్వారా తయారు చేసుకొని రాత్రి 7గంటల సమయంలో ఇంటికి బయలుదేరారు. చెన్నముక్కపల్లె సమీపంలోని మాండవ్యనదిపై నిర్మించిన బిడ్జి దగ్గరకు వెళ్లగానే కడప రోడ్డు వైపు నుంచి వచ్చిన మరో బైకు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. వీరి బైకును ఢీకొన్న మరో ద్విచక్రవాహనదారుడికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన ప్రమాదంపై విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ మహమ్మద్ రఫీ తెలిపారు.
సంక్రాంతి పండుగ కోసం వచ్చి...
జగదీష్ స్వగ్రామం శిబ్యాల గ్రామం బలిజపల్లె ( పగడాలవాండ్లపల్లె). ఇతని తల్లిదండ్రులు ఇద్దరు జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. తమ కుమారుడిని మంచి ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో తిరుపతిలోని కార్పొరేట్ స్కూల్లో 10వ తరగతి చదివిస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి సెలవులు కావడంతో ఇందుకూరుపల్లెలోని అమ్మమ్మ గారి ఇంటికి సోమవారం ఉదయమే వచ్చాడు. తన మనవడు రాకరాక వచ్చాడని పిండివంటలు వండిపెట్టాలనే కోరికతో అమ్మమ్మ బియ్యం పిండి కొట్టించుకురమ్మని చెప్పి రాయచోటికి పంపింది. అతనితో పాటు అదే గ్రామానికి చెందిన పవన్‌కుమార్ కూడా వెళ్లాడు. బియ్యం ఆడించుకొని ఇంటికి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment