వైద్య విద్యార్థిని దుర్మరణం | MBBS Student Sravani Deceased in Bike Accident Kurnool | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థిని దుర్మరణం

Published Tue, Mar 17 2020 12:49 PM | Last Updated on Tue, Mar 17 2020 12:49 PM

MBBS Student Sravani Deceased in Bike Accident Kurnool - Sakshi

ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని బి. శ్రావణి , ప్రమాదానికి గురైన స్కూటీ

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు వైద్య కళాశాలలో చదువుతున్న మెడికో సాయంత్రం ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. కర్నూలు స్పెషల్‌ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కాశయ్య స్థానిక రేడియో స్టేషన్‌ సమీపంలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఆ దంపతులకు పెళ్లయిన పదేళ్లకు కుమార్తె బి. శ్రావణి జన్మించింది. దీంతో ఎంతో అల్లారుముద్దుగా ఆమెను పెంచుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా శ్రావణి చదువులో రాణించారు. ఎంసెట్‌లో ర్యాంక్‌ సాధించి కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు సాధించారు. ప్రస్తుతం ఆమె ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. సోమవారం సాయంత్రం  కళాశాల నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా బళ్లారి చౌరస్తా దాటిన తర్వాత హనుమాన్‌ కాటా సమీపంలో వెనుక నుంచి ఏపీ 21టిఈ 6489 నెంబరు గల లారీ ఢీకొంది. ప్రమాదంలో శ్రావణి తీవ్రంగా గాయపడగా.. వెంటనే స్థానికులు  సమీపంలోని ప్రైవేట్‌ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెద్దాస్పత్రికి తరలించారు. 

జిల్లా ఎస్పీ, వైద్యులు, విద్యార్థుల సంతాపం
ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని బి. శ్రావణి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలుసుకున్న తోటి విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొద్ది నిమిషాల ముందు తమతో ఎంతో ఉల్లాసంగా మాట్లాడిన ఆమె విగతజీవురాలై కనిపించడంతో కన్నీరు మున్నీరయ్యారు. కొద్దిసేపటికే జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సైతం మార్చురీకి  చేరుకుని శ్రావణి మృతదేహాన్ని సందర్శించారు. ఆమె తల్లిదండ్రులను ఓదార్చి సంతాపం ప్రకటించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనువు చాలించడంతో కాశయ్య తట్టుకోలేకపోయారు. అతని ఓదార్చడం సహ ఉద్యోగులకు వీలుకాలేదు. కాశయ్య కుటుంబం మొన్నటి వరకు పోలీస్‌క్వార్టర్స్‌లో నివాసం ఉండేది. ఇటీవలే వారు రేడియోస్టేషన్‌ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో చేరారు. శ్రావణికి సైతం వారం క్రితమే కొత్త స్కూటీని తండ్రి కొనిచ్చారు. ఈ విషయాలను తలచుకుని మార్చురీకి చేరుకున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. శ్రావణి మృతదేహాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి. చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్, వైద్యులు సందర్శించి సంతాపం ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement