kurnool medical college
-
Kurnool Medical College: మల్టీ యుటిలిటీ సెంటర్ నిర్మాణానికి అవగాహన ఒప్పందం
మంగళగిరి(గుంటూరు జిల్లా): కర్నూలు మెడికల్ కాలేజీ ప్రాంగణంలో రూ.15 కోట్లతో నిర్మించే మల్టీ యుటిలిటీ సెంటర్‌కు మంగళగిరిలోని APIIC టవర్స్ 6 వ అంతస్తులో సోమవారం నాడు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి MT కృష్ణబాబు ఛాంబర్లో అవగాహనా ఒప్పందాన్ని ( MOU ) కుదుర్చుకున్నారు. కర్నూలు మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ ( KMC) కార్యదర్శి డి.ద్వారకనాథ రెడ్డి , కోశాధికారి డాక్టర్ మహేష్ కుమార్ మార్డ మల్టీ యుటిలిటీ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయింపు కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) డాక్టర్ నరసింహంతో కలిసి MOUపై సంతకాలు చేశారు. ఈ ప్రతిపాదిత బహుళ-వినియోగ కేంద్రానికి రూ. 15 కోట్ల మేర ఖర్చవుతుందని మరియు అదనపు విరాళాలతో మరింత అభివృద్ధి చేసేందుకు పూనుకుంటామని కెఎంసిజి ట్రస్టు ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. మల్టీ-యుటిలిటీ సెంటర్లో ఒకేసారి 300 మందికి వసతి కల్పించడానికి వర్చువల్ కాన్ఫరెన్స్ హాల్, డిజిటల్ లైబ్రరీ మరియు ఇతర ఆధునిక విద్యా మౌలిక సదుపాయాలు ఉంటాయని, ప్రపంచ బోధనా వాతావరణంలో తమ వృత్తిని రూపొందించుకోవడంలో విద్యార్థులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజ్ అలూమిని ఆఫ్ నార్త్ అమెరికా మరియు కర్నూలు మెడికల్ కాలేజ్ అలూమిని అసోసియేషన్ లు కలిసి కర్నూల్ మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ ( KMCGT)గా ఏర్పడింది. ఈ ప్రాజెక్టును చేపట్టినందుకు KMCGT ప్రతినిధుల్ని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎం.టి కృష్ణ బాబు ఈ సందర్భంగా అభినందించారు . అలాగే ఇతర అలూమిని అసోసియేషన్లు మరియు ట్రస్టులు కూడా సమాజానికి సేవ చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వైద్య సంస్థలోని విద్యార్థులు, సిబ్బంది మరియు రోగులకు సహాయక సౌకర్యాల్ని అందించేందుకు KMC గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ కృషి చేస్తోందని, కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు కళాశాల పోర్టల్‌ల ద్వారా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు (కర్నూల్ మెడికల్ కాలేజ్ ఉత్తర అమెరికా పూర్వ విద్యార్థులు & భారతదేశం మరియు ప్రపంచంలోని ఇతర విద్యార్థులు) కలిసి వచ్చారని ప్రతినిధులు తెలిపారు. రాబోయే మల్టీ యుటిలిటీ సెంటర్ వైద్య విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ మరియు పెవిలియన్ కోసం ఉపయోగపడుతుంది. పై అంతస్తులో వర్చువల్ కాన్ఫరెన్స్ హాల్, డిజిటల్ లైబ్రరీ మొదలైనవాటిని.ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు ప్రపంచ బోధనా వాతావరణంలో వారి కెరీర్‌ను రూపొందించుకునేందుకు ఈ సెంటర్ అన్ని విధాలా ఉపయోగపడుతుంది. కర్నూలు మెడికల్ కాలేజీ ఆవరణలో కేటాయించిన స్థలంలో అంతర్జాతీయ నాణ్యత, సామర్థ్య ప్రమాణాలతో మల్టీ యుటిలిటీ సెంటర్ కు సంబంధించి KMC గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య PPP విధానంలో చేపడతాయి. బహుళ-వినియోగ కేంద్రంలోKMC గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ గ్రౌండ్, మొదటి మరియు రెండవ అంతస్తుల్ని నిర్మిస్తుంది. ఈ సెంటర్ ను నిర్మించేందుకు KMC గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్, APMSIDC కలిసి పనిచేస్తాయి. వర్చువల్ కాన్ఫరెన్స్ హాల్, డిజిటల్ లైబ్రరీ మరియు కౌన్సెలింగ్ సెంటర్ రూపంలో ప్లేస్మెంట్లు పొందడానికి మరియు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి KMC ట్రస్టు గ్రాడ్యుయేట్లకు తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన పరికరాలు, ఆడియో-విజువల్ ఎయిడ్స్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ లైబ్రరీ కోసం పుస్తకాల సబ్స్క్రిప్షన్ల సేకరణ, ఇన్‌స్టాలేషన్‌కు బాధ్యత వహిస్తుంది. క్రీడా కార్యకలాపాలలో విద్యార్థులను మరింత గా ప్రోత్సహించేందుకు కూడా ఈ ట్రస్ట్ ఎంతగానో కృషి చేస్తుంది. -
విధులకు రాని వైద్యులకు నోటీసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో విధులకు రాని వైద్యుల విషయం చర్చనీయాంశంగా మారింది. వారంలో రెండు మూడు రోజులే వచ్చి మిగతా రోజులకు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నవారు ప్రతి ప్రభుత్వాస్పత్రిలో ఉన్నట్టు తేలింది. దీనిపై ఆరా తీస్తున్న కొద్దీ విస్మయపరిచే అంశాలు వెల్లడవుతున్నాయి. తాజాగా కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో 20 మంది వైద్యులకు నోటీసులు ఇచ్చారు. బయోమెట్రిక్ హాజరు లేకుండా రిజిస్టర్లో సంతకాలు చేసి విధులకు వచ్చినట్టు కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరిలో బయోకెమిస్ట్రీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ విభాగాల ప్రొఫెసర్లు కూడా ఉండటం గమనార్హం. విధులకు రాకుండా రిజిస్టర్లలో సంతకాలు సృష్టిస్తున్నవారు 48 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కర్నూలు కలెక్టర్ మెమో జారీ చేశారు. నెల్లూరు, విశాఖపట్నం, గుంటూరు, కడప తదితర కాలేజీల్లో బయోమెట్రిక్ వేయకుండా విధులకు వచ్చినట్టు చూపిస్తున్నవారి విషయం రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుల దృష్టికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాన్యువల్ (రిజిస్టర్) సంతకాలు కుదరవని, బయోమెట్రిక్ హాజరు ఉంటేనే వేతనం ఇవ్వాలని డీఎంఈ ఆదేశించారు. ఇప్పటికీ చాలా చోట్ల కొంతమంది వైద్యులు బయోమెట్రిక్ హాజరు కోసం నమోదు కూడా చేయించుకోలేదు. దీనిపై చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. చాలామంది వైద్యులు ఎలాంటి సమాచారమూ లేకుండా విధులకు గైర్హాజరవుతున్నారు. -
కర్నూల్ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ కోర్సులు
కర్నూలు: కర్నూల్ మెడికల్ కాలేజీలో కొత్తగా 5 సూపర్ స్పెషాలిటీ కోర్సులు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. సూపర్ స్పెషాలిటీ కోర్సులు ప్రారంభానికి కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డిని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అభినందించారు. కాగా, కోర్సుల అనుమతి లభించడంలో సహకరించినందుకు ఎంపి సంజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు యూరాలజీ, నెఫ్రాలజీ, పెడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ తదితర విభాగాల్లో స్పెషాలిటీ కోర్సులకు అనుమతి లభించిందని ఎంపీ తెలిపారు. -
రాష్ట్రంలో తొలిసారిగా కరోనాపై అధ్యయనం
కర్నూలు (హాస్పిటల్): కరోనా వైరస్‌పై కర్నూలు మెడికల్ కాలేజీ (కేఎంసీ) మైక్రో బయాలజీ విభాగంలో బయో ఇన్ఫర్మాటిక్ అధ్యయనం చేశారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ)తో కర్నూలు ప్రాంతం నుంచి 90 మంది కరోనా బాధితుల శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్(ఎన్జీఎస్) చేశారు. ఈ వివరాలను బుధవారం కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.చంద్రశేఖర్‌తో కలిసి మైక్రోబయాలజీ స్పెషలిస్టు డాక్టర్ పి.రోజారాణి విలేకరులకు వివరించారు. ► చైనాలోని వూహాన్లో మొదలైన కోవిడ్–19 వైరస్‌తో పోలిస్తే కర్నూలులో ఉన్న వైరస్ కొద్దిగా మార్పులు చేసుకుంది. ► కర్నూలు ప్రాంతంలో 90 శాంపిల్స్ సేకరించి అధ్యయనం చేశారు. ఇందులో 88% మందిలో ఏ2ఏ అనే జన్యువు రూపంలో, 12% మందిలో ఎల్/ఏ3ఎల్ అనే రూపంలో ఉన్నట్లు తేలింది. ► అధ్యయన నివేదికలను ఐజీఐబీ సీనియర్ సైంటిస్ట్ వినోద్ స్కారియాకు పంపారు. ► ఇలాంటి అధ్యయనం వల్ల కోవిడ్–19 ఎలా మార్పులు చెందుతోంది, దానికి ఎలాంటి వ్యాక్సిన్ తయారు చేయాలి, వైరస్‌ను గుర్తించేందుకు ఎలాంటి ప్రోబ్స్ కావాలి, ఆర్టీ పీసీఆర్ కిట్స్‌ను వేటిని ఉపయోగించాలో తెలుస్తుంది. ► ఈ అధ్యయనానికి మైక్రోబయాలజీ హెచ్‌వోడీ డాక్టర్ సురేఖ, డాక్టర్ విజయలక్ష్మి సహకరించారు. ► జాతీయ స్థాయిలో ఆరు ప్రతిష్టాత్మక సంస్థలు ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. ఏపీ నుంచి మొదటి అధ్యయనం ఇదే. -
వైద్య విద్యార్థిని దుర్మరణం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు వైద్య కళాశాలలో చదువుతున్న మెడికో సాయంత్రం ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. కర్నూలు స్పెషల్ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కాశయ్య స్థానిక రేడియో స్టేషన్ సమీపంలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఆ దంపతులకు పెళ్లయిన పదేళ్లకు కుమార్తె బి. శ్రావణి జన్మించింది. దీంతో ఎంతో అల్లారుముద్దుగా ఆమెను పెంచుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా శ్రావణి చదువులో రాణించారు. ఎంసెట్‌లో ర్యాంక్ సాధించి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ప్రస్తుతం ఆమె ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. సోమవారం సాయంత్రం కళాశాల నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా బళ్లారి చౌరస్తా దాటిన తర్వాత హనుమాన్ కాటా సమీపంలో వెనుక నుంచి ఏపీ 21టిఈ 6489 నెంబరు గల లారీ ఢీకొంది. ప్రమాదంలో శ్రావణి తీవ్రంగా గాయపడగా.. వెంటనే స్థానికులు సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెద్దాస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ, వైద్యులు, విద్యార్థుల సంతాపం ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని బి. శ్రావణి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలుసుకున్న తోటి విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొద్ది నిమిషాల ముందు తమతో ఎంతో ఉల్లాసంగా మాట్లాడిన ఆమె విగతజీవురాలై కనిపించడంతో కన్నీరు మున్నీరయ్యారు. కొద్దిసేపటికే జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సైతం మార్చురీకి చేరుకుని శ్రావణి మృతదేహాన్ని సందర్శించారు. ఆమె తల్లిదండ్రులను ఓదార్చి సంతాపం ప్రకటించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనువు చాలించడంతో కాశయ్య తట్టుకోలేకపోయారు. అతని ఓదార్చడం సహ ఉద్యోగులకు వీలుకాలేదు. కాశయ్య కుటుంబం మొన్నటి వరకు పోలీస్క్వార్టర్స్లో నివాసం ఉండేది. ఇటీవలే వారు రేడియోస్టేషన్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో చేరారు. శ్రావణికి సైతం వారం క్రితమే కొత్త స్కూటీని తండ్రి కొనిచ్చారు. ఈ విషయాలను తలచుకుని మార్చురీకి చేరుకున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. శ్రావణి మృతదేహాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, వైద్యులు సందర్శించి సంతాపం ప్రకటించారు. -
అసలేం జరిగింది?
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాలలో వైద్యవిద్యార్థి హర్షప్రణీత్‌రెడ్డి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. అతను ఉండే హాస్టల్ గదిలో చెల్లాచెదురుగా పడిన వస్తువులను చూస్తే ఎవరికైనా ఈ అనుమానాలు తలెత్తడం ఖాయం. గురువారం హర్షప్రణీత్‌రెడ్డి గదిలోకి వెళ్లి లోపల గడియ పెట్టుకోకముందు జరిగిన ఘటనలను పోలీసులు ఆరా తీస్తున్నారు. హర్ష ఆ రోజు ఎవరికి ఎక్కువసార్లు ఫోన్ చేశాడు? చనిపోవడానికి ముందు ఎవరితో మాట్లాడాడు? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ మేరకు అతని సెల్ఫోన్లో డేటాను పరిశీలిస్తున్నారు. ఆ విద్యార్థి ఎక్కువగా చాటింగ్ చేసేవాడని, ఎప్పటికప్పుడు మెసేజ్‌లను డిలిట్ చేసేవాడని చెబుతున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. డిలిట్ చేసిన మెసేజ్‌లను తెలుసుకునేందుకు, కాల్ డేటాను తెప్పించేందుకు చర్యలు ప్రారంభించారు. హర్ష మృతిచెందిన గదిలో ఇనుప మంచం పూర్తిగా వంగిపోయి ఉంది. దానిపైన ఉండే పరుపు చెల్లాచెదురుగా పడి ఉంది. ఫ్యాన్‌కు సైతం రెండు, మూడు టవళ్లు వేలాడుతూ ఉన్నాయి. దీన్ని బట్టి అతని మృతికి ముందే గదిలో ఏదైనా గొడవ జరిగిందా? అన్న అనుమానాలు నివృత్తి కావాల్సి ఉంది. మొత్తంగా హర్ష సెల్‌ఫోన్ డేటా, మెసేజ్‌ల వివరాలు తెలిస్తే గానీ మృతికి గల కారణాలు తెలిసే పరిస్థితి లేదని పలువురు వైద్యులు అన్నారు. -
కర్నూలు మెడికల్ కాలేజీలో విషాదం
సాక్షి, కర్నూలు : కర్నూల్ మెడికల్ కాలేజీ హాస్టల్లో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ మొదటి సంత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ఆర్ జిల్లా కడప అరవింద్ నగర్‌కు చెందిన హర్ష ప్రణీత్ రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నాడు. గురువారం రాత్రి 11.30 నిమిషాలకు తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొన్నాడు. అయితే కొద్ది సేపటికి సహచర విద్యార్ధులు వచ్చి డోర్ కొట్టగా హర్ష స్పందించక పోవడంతో అనుమానం వచ్చి బద్దలు కొట్టారు. చలనం లేకుండా పడివున్న మిత్రుడిని హాస్పిటల్‌కు తరలించి కళాశాల యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే హర్ష మరణించినట్లు వైద్యులు తెలిపారు. హర్ష ప్రణీత్ మృతిపై తండ్రి రామాంజుల రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు శరీరంపై రక్తపు మరకలు ఉన్నాయని, ఎవరో కొట్టి చంపారని ఆరోపించారు. గతంలో చాలాసార్లు కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నట్లు తనతో చెప్పాడని, కానీ ఇవన్నీ మామూలే అని నచ్చచెప్పి బాగా చదువుకోమని చెప్పానని ఆయన అన్నారు. పరీక్షలకు భయపడి ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని, ర్యాగింగ్ చేసి తన కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని కన్నీరు మున్నీరు అయ్యారు. గారాబంగా పెంచుకున్న కుమారుడు చనిపోతే కాలేజీ యాజమాన్యం, సిబ్బంది కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు. అయితే హర్ష మరణంపై కాలేజీ యాజమాన్యం స్పందించింది. త్వరలో జరగనున్న మొదటి సంవత్సర పరీక్షల ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలిపారు. కాలేజీలో ర్యాగింగ్ లేదని, దానిని అడ్డుకోవడానికి కఠిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇది ర్యాగింగ్ చేసే సమయం కూడా కాదన్నారు. హర్ష మరణంపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ చేరుకొని విచారిస్తున్నారు. మృతుడి తండ్రి నుంచి ఇంకా ఫిర్యాదు అందలేదని, అందిన వెంటనే విచారణ చేపడతామని చెప్పారు. అయితే కాలేజీలో ర్యాగింలేదని యాజమాన్యం చెబుతున్నా.. ఇతర విద్యార్థులు మాత్రం కాలేజీలో ర్యాగింగ్ ఉందని వెల్లడించడం విశేషం. -
కేఎంసీలో ర్యాగింగ్ కలకలం
–అర్ధరాత్రి జూనియర్లను గదుల్లోకి పిలుస్తున్న సీనియర్లు –రాత్రి 10 నుంచి 2 గంటల వరకు ర్యాగింగ్? –ర్యాగింగ్ సెల్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థులు –విచారణకు ఆదేశించిన ప్రిన్సిపల్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో మళ్లీ ర్యాగింగ్ భూతం బుసలుకొడుతోంది. 8 ఏళ్ల క్రితం జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో ముగ్గురు విద్యార్థులకు జైలుశిక్ష పడింది. వారిని కళాశాల నుంచి సైతం డీబార్ చేశారు. ఆ తర్వాత కళాశాలలో ర్యాగింగ్ నిరోధానికి అధికారులు చర్యలు తీసుకోవడంతో కాస్త సద్దుమణిగింది. ఇటీవల కాలంలో ర్యాగింగ్ భూతం మళ్లీ పడగవిప్పుతోంది. అర్ధరాత్రి వేళ జూనియర్లను సీనియర్లు గదుల్లోకి పిలిచి ర్యాగింగ్ చేస్తున్నట్లు ర్యాగింగ్ సెల్‌కు విద్యార్థులు మంగళవారం ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.నగరంలోని రాజ్‌విహార్ వద్ద ఉన్న మెన్స్ మెడికల్ హాస్టల్లో ర్యాగింగ్ జరుగుతున్నట్లు పలువురు జూనియర్లు మంగళవారం ర్యాగింగ్ నిరోధక సెల్‌కు ఫిర్యాదు చేశారు. తమను అర్ధరాత్రి వేళ సీనియర్లు వారి గదుల్లోకి పిలిచి ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి 10 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు గదుల్లో బట్టలు విప్పదీసి నిల్చోబెట్టడం, బాత్రూమ్లు క్లీన్ చేయించడం, బట్టలు ఉతికించడం వంటివి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ విచారణకు హాస్టల్ వార్డెన్ డాక్టర్ రంగనాథ్‌ను ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయమై బుధవారం ఆయన విచారణ చేసే అవకాశం ఉంది. కాగా.. 2008–09 విద్యాసంవత్సరంలోనూ ర్యాగింగ్ చేయడంతో ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేసి జైలుకు పంపించి, వారిని కళాశాల నుంచి డిస్మిస్ చేశారు. ఆ తర్వాత సీనియర్ ప్రొఫెసర్లతో ర్యాగింగ్ నిరోదక కమిటీలు వేసి, సెల్లు, ఫిర్యాదుబాక్స్లు ఏర్పాటు చేశారు. అయినా మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేయడం మానడం లేదు. పలు విధాలుగా తమను ర్యాగింగ్ చేస్తున్నట్లు ప్రొఫెసర్లకు జూనియర్లు విన్నవించినా ఫలితం ఉండటం లేదన్న విమర్శలున్నాయి. ర్యాగింగ్ విషయమై ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్‌ను వివరణ కోరగా.. ర్యాగింగ్ జరుగుతున్నట్లు కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారని, ఈ విషయమై విచారణ జరుపుతున్నామని తెలిపారు.