కేఎంసీలో ర్యాగింగ్ కలకలం
కేఎంసీలో ర్యాగింగ్ కలకలం
Published Wed, Sep 20 2017 12:03 AM | Last Updated on Wed, Sep 20 2017 11:51 AM
–అర్ధరాత్రి జూనియర్లను గదుల్లోకి పిలుస్తున్న సీనియర్లు
–రాత్రి 10 నుంచి 2 గంటల వరకు ర్యాగింగ్?
–ర్యాగింగ్ సెల్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థులు
–విచారణకు ఆదేశించిన ప్రిన్సిపల్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో మళ్లీ ర్యాగింగ్ భూతం బుసలుకొడుతోంది. 8 ఏళ్ల క్రితం జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో ముగ్గురు విద్యార్థులకు జైలుశిక్ష పడింది. వారిని కళాశాల నుంచి సైతం డీబార్ చేశారు. ఆ తర్వాత కళాశాలలో ర్యాగింగ్ నిరోధానికి అధికారులు చర్యలు తీసుకోవడంతో కాస్త సద్దుమణిగింది. ఇటీవల కాలంలో ర్యాగింగ్ భూతం మళ్లీ పడగవిప్పుతోంది. అర్ధరాత్రి వేళ జూనియర్లను సీనియర్లు గదుల్లోకి పిలిచి ర్యాగింగ్ చేస్తున్నట్లు ర్యాగింగ్ సెల్‌కు విద్యార్థులు మంగళవారం ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.నగరంలోని రాజ్‌విహార్ వద్ద ఉన్న మెన్స్ మెడికల్ హాస్టల్‌లో ర్యాగింగ్ జరుగుతున్నట్లు పలువురు జూనియర్లు మంగళవారం ర్యాగింగ్ నిరోధక సెల్‌కు ఫిర్యాదు చేశారు. తమను అర్ధరాత్రి వేళ సీనియర్లు వారి గదుల్లోకి పిలిచి ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి 10 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు గదుల్లో బట్టలు విప్పదీసి నిల్చోబెట్టడం, బాత్‌రూమ్‌లు క్లీన్ చేయించడం, బట్టలు ఉతికించడం వంటివి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ విచారణకు హాస్టల్ వార్డెన్ డాక్టర్ రంగనాథ్‌ను ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయమై బుధవారం ఆయన విచారణ చేసే అవకాశం ఉంది. కాగా.. 2008–09 విద్యాసంవత్సరంలోనూ ర్యాగింగ్ చేయడంతో ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేసి జైలుకు పంపించి, వారిని కళాశాల నుంచి డిస్మిస్ చేశారు. ఆ తర్వాత సీనియర్ ప్రొఫెసర్లతో ర్యాగింగ్ నిరోదక కమిటీలు వేసి, సెల్‌లు, ఫిర్యాదుబాక్స్‌లు ఏర్పాటు చేశారు. అయినా మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేయడం మానడం లేదు. పలు విధాలుగా తమను ర్యాగింగ్ చేస్తున్నట్లు ప్రొఫెసర్లకు జూనియర్లు విన్నవించినా ఫలితం ఉండటం లేదన్న విమర్శలున్నాయి. ర్యాగింగ్ విషయమై ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్‌ను వివరణ కోరగా.. ర్యాగింగ్ జరుగుతున్నట్లు కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారని, ఈ విషయమై విచారణ జరుపుతున్నామని తెలిపారు.
Advertisement
Advertisement