అపస్మారక స్థితిలో పడిఉన్న రామచంద్రుడు (ఇన్‌సెట్) రామచంద్రుడు (ఫైల్)
రాజుపాళెం/ ప్రొద్దుటూరు టౌన్ : వైఎస్సార్ జిల్లా రాజుపాళెం మండలం కొర్రపాడు గ్రామంలోని బీసీ కాలనీలో ఉన్న కాశిరెడ్డినాయన ఆలయం వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో లైన్‌ఇన్‌స్పెక్టర్ బండారు రామచంద్రుడు(52) మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రాజుపాళెం మండలం వెల్లాల సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు రామచంద్రుడు (52) లైన్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా ఆలయం వద్ద ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి వాహనంతో పాటు రామచంద్రుడు గుంతలో పడ్డారు. విషయాన్ని గమనించిన రాజుపాళెం ఏఈ హరికృష్ణ, సిబ్బంది, గ్రామస్తులు కలిసి గాయాలతో పడిఉన్న రామచంద్రుడిని బయటకు తీసి చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో నంద్యాల వద్ద మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈయనకు భార్య కృష్ణవేణితో పాటు ఇద్దరు కుమారులు రామకృష్ణ, నందకృష్ణ ఉన్నారు. వారిద్దరు ఇంజినీరింగ్ చదువుతున్నారు. మృతదేహానికి పరామర్శ: జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చిన లైన్‌ఇన్‌స్పెక్టర్ రామచంద్రుడు మృతదేహాన్ని బుధవారం రాత్రి ప్రొద్దుటూరు డివిజన్ ట్రాన్స్‌కో డీఈ విజయన్, రాజుపాళెం ఏఈ హరికృష్ణ, ఏడీలు, ఏఈలు, సిబ్బంది సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్ని విధాలా కుటుంబ సభ్యులను ఆదుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment