
ట్రాలర్ కిందకు వెళ్లిపోయిన ద్విచక్ర వాహనం, ప్రమాదంలో దుర్మరణం పాలైన కృష్ణకుమారి (ఫైల్)
మృతురాలు గర్భిణి
అక్కిరెడ్డిపాలెం(గాజువాక): కాకినాడలో జరిగే ఓ శుభకార్యం కోసం వెళ్తున్న ఓ గర్భిణి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. భార్యను బస్సెక్కించడానికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్న క్రమంలో భార్యాభర్తలను ట్రాలర్ లారీ ఢీకొట్టింది. ఆటోనగర్ సిగ్నల్ పాయింట్ వద్ద బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో భార్య తీవ్ర గాయాలపాలై కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించగా.. భర్త స్వల్పగాయాలతో బయటపడ్డాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 59వ వార్డు తుంగ్లాంలో చంద్రశేఖర్, బోసు కృష్ణకుమారి(24)లు నివాసముంటున్నారు. చంద్రశేఖర్ ఆటోనగర్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. వీరికి రెండేళ్ల కిందట వివాహమైంది. కాకినాడలో ఓ శుభకార్యానికి భార్యను పంపే క్రమంలో ఆమెను బుధవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై చంద్రశేఖర్ తీసుకువెళ్తున్నాడు.
ఆటోనగర్ నుంచి బీహెచ్‌పీవీ వైపు మలుపు తిరుగుతుండగా వారి వెనుక నుంచి ఐరన్ రాడ్ల లోడుతో వస్తున్న ట్రాలర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణకుమారి చీర లారీలో చిక్కుకుపోయింది. దీంతో సుమారు 200 మీటర్ల మేర ఆమెతో పాటు బైక్‌ను కూడా ఈడ్చుకుంటూ లారీ వెళ్లిపోయింది. కొన ఊపిరితో ఉన్న భార్యను కాపాడుకోవడం కోసం చంద్రశేఖర్ పడిన తపన అందర్ని కంటతడి పెట్టించింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాఫిక్ మొబైల్ వ్యాన్‌లో క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ కృష్ణకుమారి చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు కాకినాడవాసి. వీరికి పిల్లలు లేరు. ప్రస్తుతం ఈమె గర్భవతి అని, ఓ శుభకార్యానికి హాజరవ్వడంతో పాటు, ఆరోగ్య పరీక్షలు కూడా కాకినాడలో చేయించుకోవడానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.