
ప్రమాదంలో మృతి చెందిన రూబీన్, తీవ్రంగా గాయపడిన అస్మా
కర్నూలు ,మహానంది: స్నేహితురాలి తండ్రి మృతి చెందాడన్న విషయం తెలుసుకుని ఆమెను పరామర్శించేందుకు అక్కా చెల్లెళ్లు స్కూటీపై బయలుదేరారు. అయితే..
వీరిని కూడా విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదంలో చెల్లెలు మృతి చెందగా.. అక్కకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం మహానంది మండలం బోయిలకుంట్ల మెట్ట వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణానికి చెందిన అస్మా, రూబీన్(23) అక్కాచెల్లెళ్లు. వీరికి గాజులపల్లెలో అలియా అనే స్నేహితురాలు ఉంది. అలియా తండ్రి పఠాన్‌రఫి గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో స్నేహితురాలిని పరామర్శించేందుకు అక్కాచెల్లెళ్లు మంగళవారం స్కూటీపై బయలుదేరారు. మార్గమధ్యంలో ఎదురుగా ఇద్దరు యువకులు బైక్‌పై వస్తూ వారి స్కూటీని ఢీకొట్టారు. దీంతో అక్కాచెల్లెళ్లిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
అక్కడే ఉన్న ప్రైవేటు ఉద్యోగి ప్రసాద్ వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. మహానంది ఎస్‌ఐ తులసీనాగప్రసాద్ కూడా వెంటనే అక్కడికి చేరుకోవడం, రోడ్‌సేఫ్టీ పోలీసుల వాహనం సైతం రావడంతో ఇద్దరినీ రెండు వాహనాల్లో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచన మేరకు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రూబీన్ మృతిచెందింది. అస్మా పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రూబీన్ భర్త షేక్ షహీన్‌బాష నంద్యాల కూరగాయల మార్కెట్‌లో కమీషన్ వ్యాపారం చేస్తుంటాడు. వీరికి మూడు నెలల బాబు ఉన్నాడు. ఆ చిన్నారికి తల్లి దూరం కావడం ఆ కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. భార్య మృతదేహం వద్ద షహీన్ బాష రాత్రి వరకు అక్కడే కూర్చుని రోదిస్తున్న తీరు చూపరులకు సైతం కంటతడి పెట్టించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు మహానంది ఎస్‌ఐ తులసీనాగప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment