కంబాలకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యం
వైఎస్‌ఆర్ జిల్లా, పెనగలూరు: భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు భర్త పెద్దకర్మ రోజునే కుమారుడు కడుపుకోత మిగిల్చిన విషాదకర సంఘటన బుధవారం పెనగలూరు మండలం తిరుణంపల్లిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తిరుణంపల్లికి చెందిన పళ్లాల పెంచలయ్య అనారోగ్యంతో ఈనెల 6వ తేదీ మృతి చెందాడు. తండ్రి మృతి వార్త విన్న కుమారుడు ప్రసాద్(21) కువైట్ నుంచి తండ్రి మృతదేహాన్ని చూసేందుకు వచ్చాడు. బుధవారం రోజున తండ్రి పెద్దకర్మ ప్రారంభమవుతుందనుకున్న సమయంలో ప్రసాద్ తన మేనమామలైన పోలయ్య, గుర్రయ్యలతో కలిసి సరుకుల కోసం పెనగలూరుకు బయలుదేరాడు. ఇదే మార్గంలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన టాటా ఏస్ వాహనం (ఎపీ04టియు8337) పెనగలూరు వైపు నుంచి బెస్తపల్లి వైపు వెళుతోంది. ఇదే సమయంలో కంబాలకుంట మలుపు వద్ద రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ద్విచక్రవాహనం ట్యాంక్ పూర్తిగా పగిలిపోయింది. ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కాగా పోలయ్య, గురవయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురిని 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించడంతో తిరుపతికి సిఫార్సు చేశారు. తిరుపతికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో కోడూరు సమీపంలో ప్రసాద్ మృతి చెందాడు. మృతదేహాన్ని రాజంపేట ఆసుపత్రికి తరలించి మిగిలిన ఇద్దరిని తిరుపతికి తీసుకెళ్లారు. మృతుడి అన్న నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హేమీబాయ్ తెలిపారు.
తిరుణంపల్లిలో విషాద ఛాయలు..
ఒక వైపు కుటుంబ పెద్ద పెద్దకర్మ జరుగుతుండగా అదే సమయంలో కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన గ్రామస్తులందరిని కంట తడిపెట్టించింది. అటు భర్తను.. ఇటు కుమారుడిని కోల్పోయిన ఆ తల్లి వేదన వర్ణనాతీతంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment