దేవేంద్ర ఫడ్నవీస్‌ అనే నేను.. | BJP Devendra Fadnavis Take Oath As CM Of Maharashtra Updates | Sakshi
Sakshi News home page

దేవేంద్ర ఫడ్నవీస్‌ అనే నేను..

Published Thu, Dec 5 2024 11:01 AM | Last Updated on Fri, Dec 6 2024 6:03 AM

BJP Devendra Fadnavis Take Oath As CM Of Maharashtra Updates

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం  

ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌  

హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, సీఎంలు, సినీ ప్రముఖులు  

ఫలితాలు వచ్చాక 15 రోజులకు కొలువుదీరిన ప్రభుత్వం  

ముంబై: మహారాష్ట్రలో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్కంఠకు తెరదించుతూ ఉప ముఖ్యమంత్రులుగా శివసేన (షిండే) నేత ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీ(అజిత్‌ పవార్‌) నాయకుడు అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు. వారితో గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. 

ముంబై ఆజాద్‌ మైదాన్‌లో గురువారం సాయంత్రం అశేష జనవాహిని సమక్షంలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎంలు మినహా మంత్రులెవరూ ప్రమాణం చేయలేదు. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌ ప్రమాణం చేయడం ఇది మూడోసారి. వచ్చే వారం మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు మహాయుతి వర్గాలు తెలిపాయి. 

మహారాష్ట్రలో నవంబర్‌ 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా, 15 రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి పదవిపై ప్రతిష్టంభన తొలగకపోవడం, కీలక శాఖలపై మిత్రపక్షాలు పట్టుబట్టడంతో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరిగింది. బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకొని మిత్రపక్షాలను ఒప్పించడంతో కథ సుఖాంతమైంది. మరోసారి ముఖ్యమంత్రి పదవి ఆశించిన ఏక్‌నాథ్‌ షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. ఫడ్నవీస్‌ సీఎంగా ప్రమాణం చేయడం పట్ల ఆయన భార్య, గాయకురాలు అమృత ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక అద్భుతమైన రోజు అని చెప్పారు. ఫడ్నవీస్‌పై బాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు.  

హాజరైన ప్రముఖులు  
కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జె.పి.నడ్డా, రాజ్‌నాథ్‌æ, గడ్కరీ, శివరాజ్‌ చౌహాన్, నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్వినీ వైష్ణవ్, ఎస్‌.జైశంకర్‌ హాజరయ్యారు. 

ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్‌(ఉత్తరప్రదేశ్‌), పుష్కర్‌సింగ్‌ ధామీ(ఉత్తరాఖండ్‌), నాయబ్‌సింగ్‌ సైనీ(హరియాణా), భూపేంద్ర పటేల్‌(గుజరాత్‌), ప్రమోద్‌ సావంత్‌(గోవా), హిమంతబిశ్వ శర్మ(అస్సాం), విష్ణుదేవ్‌ సాయి(ఛత్తీస్‌గఢ్‌), భజన్‌లాల్‌ శర్మ(రాజస్తాన్‌), మోహన్‌ యాదవ్‌(మధ్యప్రదేశ్‌), మోహన్‌చరణ్‌ మాఝీ(ఒడిశా), పెమా ఖండూ(అరుణాచల్‌ప్రదేశ్‌), ఎన్‌.బీరేన్‌సింగ్‌(మణిపూర్‌), మాణిక్‌ సాహా(త్రిపుర), నితీశ్‌ కుమార్‌(బిహార్‌), కాన్రాడ్‌ సంగ్మా(మేఘాలయా), నిఫియూ రియో(నాగాలాండ్‌), ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌(సిక్కిం), ఎన్‌.రంగస్వామి(పుదుచ్చేరి), ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు.

 ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముకేశ్‌ అంబానీ, అనిల్‌ అంబానీ, నోయల్‌ టాటా, కుమార మంగళం బిర్లా, బాలీవుడ్‌ సినీ ప్రముఖులు షారుక్‌ ఖాన్‌ సల్మాన్‌ ఖాన్, మాధురీ దీక్షిత్, విద్యా బాలన్, క్రికెట్‌ దిగ్గజం టెండూల్కర్‌తోపాటు వివిధ దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు. శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్‌ శరద్‌ పవార్, మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే, మహా నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రేను ఆహా్వనించినప్పటికీ హాజరు కాలేదు. కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలకు ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో అభినందనలు తెలియజేశారు.  

 

స్థిరమైన ప్రభుత్వం అందిస్తాం
రాబోయే ఐదేళ్లపాటు స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని సీఎం  ఫడ్నవీస్‌ చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన నేతృత్వంలో రాజకీయాల్లో ఇకపై స్పష్టమైన మార్పును చూస్తారని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు తమకు భారీ మెజార్టీ కట్టబెట్టారని, వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. సామాజిక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తామని వివరించారు. ఈ నెల 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయని, 9న స్పీకర్‌ను ఎన్నుకుంటామని ఫడ్నవీస్‌ వెల్లడించారు.  

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌

బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్‌   
మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం సాయంత్రం వారు రాష్ట్ర సచివాలయం ‘మంత్రాలయ’కు చేరుకొని సంబంధిత ద్రస్తాలపై సంతకాలు చేశారు. అధికార బాధ్యతలు చేపట్టారు. ఓ రోగికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఫడ్నవీస్‌ సీఎం హోదాలో తొలి కేబినెట్‌ సమావేశం నిర్వహించారు.  

 

షిండే రాజకీయ ప్రసంగం  
ప్రమాణ స్వీకార వేదికపై రాజకీయ ప్రసంగాలు చేయడం సంప్రదాయ విరుద్ధం. కానీ,  షిండే మాత్రం ఆ సంప్రదాయాన్ని లెక్కచేయలేదు. గవర్నర్‌ రాధాకృష్ణన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం ప్రారంభించగానే, ఫార్మాట్‌లోని ‘నేను’ అని చదివి వెంటనే రాజకీయ ప్రసంగం మొదలుపెట్టారు. మోదీ, బాల్‌ ఠాక్రే, రాష్ట్ర ప్రజలను పొగడడం ప్రారంభించారు.  గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకొని షిండేను అప్రమత్తం చేశారు. దాంతో ఆయన ఫార్మాట్‌ ప్రకారం ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ పత్రాన్ని చదివారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement