
ఇదేనా మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే..?
తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరఫు న్యాయవాదికి సుప్రీం ప్రశ్న
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ.. తీర్పు రిజర్వ్
8 వారాల లోపు తీర్పు వెలువరించాలని కోరిన పిటిషనర్ల తరఫు న్యాయవాది
అంగీకరించిన జస్టిస్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి 14 నెలలు అవుతోంది. ఇది సరిపోదూ అన్నట్లు ఇంకా మరింత సమయం అడుగుతున్నారు?. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు 2028 జనవరి వరకు వేచి చూడాల్సిందేనా?. ఇదేనా మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే?’అంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది అభిõÙక్ మనుసింఘ్వీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని న్యాయవాదులు మర్చిపోతే ఎలా? అంటూ చురకలు వేసింది. బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై పలువురు ఇతర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ, రిట్ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు విన్పించారు. ఎస్‌ఎల్పిపై సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్ పిటిషన్‌పై దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావులు వాదనలు వినిపించారు. సింఘ్వీ సుదీర్ఘ వాదనలను విన్న తర్వాత ధర్మాసనం తీర్పును ఎనిమిది వారాలకు రిజర్వ్ చేసింది.
స్పీకర్‌కు తుపాకీ గురిపెట్టి నిర్ణయం తీసుకోమనలేం..
ఈ ఫిరాయింపులపై స్పీకర్, స్పీకర్ కార్యాలయం స్పందించేందుకు మరికొంత సమయం కావాలంటూ సింఘ్వీ ఆరంభంలోనే అభ్యరి్థంచారు. ‘స్పీకర్ తలకు తుపాకీ గురిపెట్టి నిర్ణయం తీసుకోమనలేం..’అని ఆయన అన్నారు. దీనికి జస్టిస్ గవాయి స్పందిస్తూ.. ‘ప్రతిరోజూ ముఖ్యమైనదే అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కోర్టుపై ఉందనే విషయాన్ని గుర్తించండి.
రెస్పాండెంట్ల వాదనలో వైరుధ్యాలను కూడా కోర్టు ఎత్తి చూపింది. మీ దృష్టిలో రీజనబుల్ సమయం అంటే ఎంతో ఇప్పటికైనా చెబుతారా..?’అంటూ ధర్మాసనం నిలదీసింది. దీంతో ‘సహేతుకమైన కాలం‘అనేది స్పీకర్ నిర్ణయించాలని, ఆరు నెలల సమయం సరిపోతుందని సింఘ్వీ అన్నారు.
ఇబ్బందికరంగా న్యాయవాదుల తీరు: ధర్మాసనం
అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి నాలుగు వారాల్లో ఒక షెడ్యూల్ నిర్ణయించాలని స్పీకర్‌ను సింగిల్ బెంచ్ ఆదేశించిన విషయం మర్చిపోవద్దని జస్టిస్ గవాయి అన్నారు. ‘కోర్టు జోక్యం చేసుకునే వరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ కాలేదు’అని ఆర్యమా సుందరం చెప్పారు. ‘సహేతుక సమయం’లో స్పీకర్ నిర్ణ యం తీసుకుంటారని మరోసారి సింఘ్వీ చెబుతుండగా.. జస్టిస్ గవాయి అడ్డుకున్నారు. ‘ఇప్పటికే 14 నెలలు గడిచాయి. ఇంకా ఆరు నెలల సమయం అడుగుతున్నారు.
అంటే 2028వ సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి ఎన్నికలు వచ్చే వరకు ఉండాల్సిందే అంటారా? ఇదేనా మీరు చెప్పే, మీ దృష్టిలో ఉన్న రీజనబుల్ టైం’అంటూ ఘాటుగా స్పందించారు. ‘ప్రత్యేకంగా ఇటువంటి కేసుల్లో న్యాయవాదులు వ్యవహరిస్తున్న తీరు న్యాయస్థానాలకు ఇబ్బందికరంగా ఉంటోంది..’అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
రెండు వైపులా వాదనలను విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. 8 వారాల వరకు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ఆర్యమా సుందరం.. 8 వారాల్లోపే తీర్పు వెలువరించాలని అభ్యర్ధించారు. ఆ విధంగానే 8 వారాల్లోపు తీర్పును వెలువరిస్తామని ధర్మాసనం హామీ ఇచ్చింది.