ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. అందుకే వరుణ్‌ చేతికి బంతి! | Bitter Pill To Swallow: Shreyas Iyer On Decision To Give Varun Chakravarthy Last Over Against Buttler - Sakshi

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. మాకు దొరికిన విలువైన ఆస్తి అతడు!

Apr 17 2024 9:48 AM | Updated on Apr 17 2024 10:43 AM

Bitter Pill To Swallow: Shreyas On Give Varun Chakravarthy Last Over Against Buttler - Sakshi

‍కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (PC: BCCI)

రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్‌ ఆద్యంతం తమను భావోద్వేగాల డోలికలో ఊగిసలాడేలా చేసిందని.. కానీ తమకు ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు.

ఏదేమైనా ఈ ఓటమిని అంగీకరించక తప్పదన్న శ్రేయస్‌.. టోర్నీ మధ్యలో ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఒక రకంగా మంచిదైందని పేర్కొన్నాడు. లోపాలు సరిచేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగే వీలుంటుందన్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో అద్బుతంగా రాణించిన సునిల్‌ నరైన్‌ గురించి ప్రస్తావిస్తూ.. కేకేఆర్‌కు దొరికిన అత్యంత విలువైన ఆస్తి నరైన్‌ అని ప్రశంసించాడు. అదే విధంగా ఆఖరి ఓవర్లో బంతిని కావాలనే వరుణ్‌ చక్రవర్తికి ఇచ్చానన్న శ్రేయస్‌ అయ్యర్‌.. ఫలితం రాబట్టలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు.

అందుకే వరుణ్‌ చేతికి బంతి
జోస్‌ బట్లర్‌ను నిలువరించేందుకు తాము అనుసరించి వ్యూహాలు ఫలించలేదని పేర్కొన్నాడు. కచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓడిపోవడం బాధగా ఉందని శ్రేయస్‌ అయ్యర్‌ అసంతృప్తిని వెళ్లగక్కాడు.   

అయితే ఓటమినే తలచుకుంటూ కూర్చోలేమని.. తదుపరి మ్యాచ్‌ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతామని శ్రేయస్‌ అయ్యర్‌ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా ఐపీఎల్‌-2024లో భాగంగా సొంతమైదానంలో కేకేఆర్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. 

ఈడెన్‌ గార్డెన్స్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కోల్‌కతా రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఇది రెండో ఓటమి. 

నరైన్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ వృథా
ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ సునిల్‌ నరైన్‌ 56 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో 109 పరుగులు సాధించాడు. అదే విధంగా.. రెండు వికెట్లు కూడా పడగొట్టాడు ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌. అయితే, రాయల్స్‌ స్టార్‌ జోస్‌ బట్లర్‌ అజేయ శతకం కారణంగా నరైన్‌సుడిగాలి ఇన్నింగ్స్‌ వృథాగా పోయింది.

వాళ్లిద్దరి వల్లే ఓటమి
224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్‌ ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 128 పరుగులకే పరిమితమైన వేళ బట్లర​, రోవ్‌మన్‌ పావెల్‌తో కలిసి దూకుడుగా ఆడాడు. పావెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌(13 బంతుల్లో 26)తో ఆకట్టుకోగా.. సెంచరీ వీరుడు బట్లర్‌(60 బంతుల్లో 107) ఆఖరి ఓవర్‌లో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఆఖరి బంతికి సింగిల్‌ తీసి రాజస్తాన్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. 

అలా నమ్మశక్యంకాని రీతిలో కేకేఆర్‌ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కేకేఆర్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ పైవిధంగా స్పందించాడు. బట్లర్‌, రోవ్‌మన్‌ పావెల్‌ అద్భుతంగా ఆడారని వారిద్దరికి క్రెడిట్‌ ఇచ్చాడు.

చదవండి: ఐపీఎల్‌ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement