హార్దిక్‌ పాండ్యా విధ్వంసం.. విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు | Ind vs Ban: Hardik Pandya Scripts History Breaks Virat Kohli T20I Record | Sakshi

హార్దిక్‌ పాండ్యా విధ్వంసం.. విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు

Oct 7 2024 2:16 PM | Updated on Oct 7 2024 2:48 PM

Ind vs Ban: Hardik Pandya Scripts History Breaks Virat Kohli T20I Record

హార్దిక్‌ పాండ్యా (PC: BCCI)

బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన ఆల్‌రౌండ్‌ ‍ప్రతిభతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లా విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. సిక్సర్‌ బాది టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చాడు.

విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు బద్దలు
ఈ క్రమంలో ఛేజింగ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. టీమిండియా తరఫున అత్యధిక సార్లు సిక్సర్‌తో మ్యాచ్‌ ఫినిష్‌ చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. కాగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా ఆదివారం గ్వాలియర్‌ వేదికగా తొలి మ్యాచ్‌ ఆడింది. టాస్‌ గెలిచిన సూర్యకుమార్‌ సేన తొలుత బౌలింగ్‌ చేసింది.

ఈ క్రమంలో.. బ్యాటర్లు విఫలం కావడంతో 19.5 ఓవర్లలో 127 పరుగులకే బంగ్లా ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్, వరుణ్‌ చక్రవర్తి మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్‌ పాండ్యా, మయాంక్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

ధనాధన్‌ దంచికొట్టారు
ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఓపెనర్లు సంజూ శాంసన్‌(19 బంతుల్లో 29), అభిషేక్‌ శర్మ(ఏడు బంతుల్లో 16) వేగంగా ఆడగా.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(14 బంతుల్లో 29)  ధనాధన్‌ దంచికొట్టాడు.

ఇక నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్‌ రెడ్డి 16(నాటౌట్‌) పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఐదో నంబర్‌ బ్యాటర్‌ హార్దిక్‌ పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. బంతిని చూడకుండానే వికెట్‌ కీపర్‌ తల మీదుగా పాండ్యా ఆడిన ర్యాంప్‌ షాట్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌.. సిక్సర్‌తో ముగింపు
ఈ క్రమంలో పాండ్యా కేవలం 16 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 39 పరుగులతో 243కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. పన్నెండవ ఓవర్‌ ఐదో బంతికి.. టస్కిన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు.

కాగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఛేజింగ్‌లో హార్దిక్‌ పాండ్యా టీమిండియా తరఫున ఇలా మ్యాచ్‌ ఫినిష్‌ చేయడం ఐదోసారి. అంతకు ముందు విరాట్‌ కోహ్లి నాలుగుసార్లు ఈ ఘనత సాధించాడు. 

అర్ష్‌దీప్‌ సింగ్‌ను అధిగమించి
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్న హార్దిక్‌ పాండ్యా.. భారత్‌ తరఫున 87 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అర్ష్‌దీప్‌ సింగ్‌(86)ను అధిగమించి.. టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ 96 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు.

చదవండి: నేను అలా బౌలింగ్‌ చేయడానికి కారణం వారే: మయాంక్‌ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement