ఏడాదిలోగా 3 పీఎస్‌ఎల్వీ ప్రయోగాలు
స్వదేశీ టెక్నాలజీకి పెద్దపీట షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: అంతరిక్ష ప్రయోగాల్లో మరింత స్వావలంబనకు మరో ముందడుగు. ఉపగ్రహ వాహక నౌకల్లో ఇంధనాన్ని నింపేందుకు ఉపయోగించే కీలకమైన వ్యవస్థను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం దీనికి కారణం. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్, శ్రీహరికోట) డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ మంగళవారం ఈ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ (పీఎల్‌సీ)ను ఈసీఐఎల్ సీఎండీ సుధాకర్ నుంచి లాంఛనంగా అందుకున్నారు.
ఈ సందర్భంగా ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈసీఐఎల్ కేవలం రెండేళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో పీఎల్‌సీ కంట్రోలర్లను తయారు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ‘ఎంప్రాజికాన్ 5000’గా పిలుస్తున్న ఈ వ్యసవ్థను జూన్‌లో జరిగే పీఎస్‌ఎల్వీ సీ-28 ప్రయోగంలో తొలిసారి ఉపయోగించే అవకాశముందని చెప్పారు.
అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత కీలకమైన వ్యవస్థలన్నింటిలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానాన్ని వాడేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగానే ఈసీఐఎల్‌తో కలసి రూ.3 కోట్ల వ్యయంతో ఈ వ్యవస్థను తయారు చేశామని చెప్పారు. ఉపగ్రహ వాహకనౌకల్లో 97 శాతం వరకూ స్వదేశీ టెక్నాలజీకాగా భూగత వ్యవస్థల్లో మాత్రం 30-40 శాతం దిగుమతులున్నాయని చెప్పారు. ఈ దిగుమతులను కూడా క్రమేపీ తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.
ఇస్రో ఈ ఏడాది కనీసం నాలుగు ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుందని, వీటిల్లో మూడు పీఎస్‌ఎల్వీవి కాగా... స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో జరిపే జీఎస్‌ఎల్వీ ఐదవదని ప్రసాద్ తెలిపారు. జూన్‌లో మూడు యునెటైడ్ కింగ్‌డమ్ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ సీ-28 ప్రయోగం ఉంటుందని ఆయన చెప్పారు. ఆ తరువాత ఆగస్టులో ఎస్‌బ్యాండ్ కమ్యూనికేషన్ల కోసం జీశాట్-6 ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్వీ ద్వారా ప్రయోగిస్తామన్నారు. వీటితోపాటు ఈ ఏడాది చివరిలోగా రెండు నావిగేషన్ శాటిలైట్లు (ఐఆర్‌ఎన్‌ఎస్ 1ఈ, 1ఎఫ్)లను ప్రవేశపెడుతున్నామన్నారు.
భారత్ సొంతంగా అభివృద్ధి చేస్తున్న జీపీఎస్ తరహా నావిగేషన్ వ్యవస్థను వచ్చే ఏడాది పరీక్షిస్తామని, 200-300 రిసీవర్లను తయారు చేసి వ్యవస్థ పనితీరును పరిశీలిస్తామని ప్రసాద్ తెలిపారు. ఈ వ్యవస్థకు మొత్తం 7 ఉపగ్రహాలు అవసరం కాగా... ఇప్పటికే నాలుగింటిని ప్రయోగించామని, మరో రెండింటిని ప్రయోగించిన తరువాత ఈ పరీక్షలు చేపడతామన్నారు.