
బడుల్లో బడా గోల్‌మాల్
- ఆధార్ అనుసంధానంతో అక్రమాల గుట్టురట్టు
- 10.67 లక్షల మంది విద్యార్థులపై తేలని లెక్కలు
- మధ్యాహ్న భోజనం, యూనిఫారం పథకాల్లో భారీగా నిధుల స్వాహా
- ఇతర పథకాల్లోనూ ఏటా కోట్లాది రూపాయల దుర్వినియోగం
సాక్షి, హైదరాబాద్:
అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే అక్రమాలకు పాల్పడుతున్నారు. చిన్నపిల్లలకు పెట్టే మధ్యాహ్నభోజనం, వారికిచ్చే దుస్తులు, పాఠ్యపుస్తకాలు, ఆడపిల్లలకు ప్రత్యేకించి కేటాయించే నిధులను మింగేస్తున్నారు. ఇలా ఏటా కోట్లాది రూపాయలు పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల పాఠశాలల విద్యార్థులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను చేపట్టడంతో అక్రమాల బాగోతాలు వెలుగులోకొస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటినుంచి పదోతరగతి విద్యార్థులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను 2013లో ప్రారంభించగా.. ఇప్పటికి 95 శాతం పూర్తయింది. ఆధార్ అనుసంధానం తరువాత ఆ గణాంకాలు, పథకాల వ్యయాన్ని బేరీజు వేయగా దిగ్భ్రాంతికి గురయ్యే నిజాలు వెలుగులోకొస్తున్నాయి. మధ్యాహ్నభోజన పథకం కింద మంజూరవుతున్న రూ.35 కోట్లు, యూనిఫారం కింద వస్తున్న రూ.15 కోట్లు దుర్వినియోగమవుతున్నట్లు అంచనా. ఇక పాఠ్యపుస్తకాలు, పాఠశాలలకిచ్చే ఇతర నిధులూ పక్కదారి పడుతున్నట్లు గుర్తించారు.
తేలని లెక్కలు..
ఆధార్ అనుసంధానం రెండేళ్లుగా కొనసాగుతోంది. యూని ఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(యూడీఐఎస్‌ఈ) సర్వే ప్రకారం 2014-15 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో ఒకటి నుంచి 10వ వరకు 72,10,086 మంది విద్యార్థులున్నారు. వీరిలో ఆధార్ అనుసంధానం చేసినవారు 61,42,895 మంది ఉన్నారు. లెక్కలు తేలని విద్యార్థులసంఖ్య 10,67,191. వీరిలో 6,11,857 మంది ప్రైవేటు, 4,55,334 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో.. అవగాహనలేమి కారణంగా లేదా ఆధార్‌కార్డులు తీసుకోనందున అనుసంధానం చేయనివా రు లక్ష మందిదాకా ఉండొచ్చని అంచనా. తక్కిన 3.55 లక్షల మందికిపైగా విద్యార్థులు బోగస్‌వేనని అనుమానిస్తున్నారు.
అక్రమాలు ఎలా జరిగాయంటే..
కొన్ని ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థుల పేర్లను ప్రభుత్వ పాఠశాలల రికార్డుల్లోనూ నమోదు చేస్తున్నారు. స్థానికతకోసం కొందరు.. తమ పిల్లల పేర్లను గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేయిస్తున్నారు. ఇక డ్రాపవుట్ల సంఖ్యను ఎక్కువగా చూపితే ప్రభుత్వ ఒత్తిడి తమపై పడుతుందని భావిస్తూ వారిపేర్లను టీచర్లు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కిస్తున్నారు. పైవేటు స్కూళ్లకెళ్లి చదువుకునేవారి పేర్లను తొలగించకుండా రికార్డుల్లో కొనసాగిస్తున్నారు. నిష్పత్తి ప్రకారం విద్యార్థులు లేకపోతే తమ పోస్టులకు ఎసరు వస్తుందనేది టీచర్ల భయం. ఇలా లక్షల్లో బోగస్ పేర్లు రికార్డుల్లో కొనసాగుతున్నాయి. దీనివల్ల రూ.కోట్లాది సొమ్ము దుర్వినియోగమవుతోంది.
పథకాల్లో గోల్‌మాల్
మధ్యాహ్న భోజనం కింద రోజుకు ఒక్కో విద్యార్థికి ప్రాథమిక పాఠశాలల్లో రూ.4, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రూ.6 చొప్పున ఖర్చు చేస్తున్నారు. రికార్డుల్లో 3.55 లక్షలమందికిపైగా బోగస్ విద్యార్థులున్నట్లు లెక్కలు తేలుతుండడంతో ఏటా ఈ పథకంకింద రూ.35 కోట్లు పక్కదారి పడుతున్నట్లు అంచనా. ఇక యూనిఫారం పేరిట ఏటా ఒక్కో విద్యార్థికిచ్చే రెండు జతల దుస్తులకోసం ప్రభుత్వం రూ.400 చొప్పున వెచ్చిస్తోంది. దీంట్లో రూ.15 కోట్లకుపైగా దుర్వినియోగమవుతోంది. మరోవైపు ఉచిత పాఠ్యపుస్తకాలు, తదితర పథకాల్లోనూ నిధులు పక్కదారి పడుతున్నాయి. ఆధార్ అనుసంధానం ప్రక్రియను ప్రత్యేక పాఠశాలలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎన్‌సీఎల్‌పీ స్కూళ్లు, మదర్సాలు, వర్క్‌సైట్ స్కూళ్లకూ విస్తరిస్తే బోగస్ లెక్కలు మరిన్ని వెలుగులోకి వస్తాయంటున్నారు.
2015 ఏప్రిల్ 19 నాటికి ఆధార్ అనుసంధాన స్థితి
జిల్లా విద్యార్థులు ఆధార్ సీడింగ్ అంతరం
శ్రీకాకుళం 4,00,008 3,60,112 39,896
విజయనగరం 3,41,122 3,05,110 36,012
విశాఖపట్నం 6,45,088 5,12,294 1,32,794
తూ.గోదావరి 7,60,909 6,67,795 93,114
ప.గోదావరి 5,50,496 4,92,211 58,285
కృష్ణా 6,00,671 4,90,872 1,09,799
గుంటూరు 6,76,536 5,63,745 1,12,791
ప్రకాశం 5,10,511 4,11,786 98,725
నెల్లూరు 4,14,585 3,59,237 55,348
వైఎస్సార్ 4,47,349 3,75,157 72,192
కర్నూలు 6,70,120 5,31,939 1,38,181
అనంతపురం 5,94,015 5,28,834 65,181
చిత్తూరు 5,98,676 5,43,803 54,873
మొత్తం 72,100,86 61,42,895 10,67,191