28 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు | advanced jee schedule released | Sakshi
Sakshi News home page

28 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు

Published Thu, Apr 27 2017 7:26 PM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

advanced jee schedule released

హైదరాబాద్‌: దేశంలోని ఐఐటీల్లో 2017-18 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గురువారం జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రక్రియను మద్రాస్‌ ఐఐటీ చేపట్టింది. మే 21న ఈ పరీక్ష జరుగనుంది. జేఈఈ మెయిన్‌ పరీక్షలకు దాదాపు 11 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే. అందులో అర్హత సాధించిన వారిలో టాప్‌ 2.2 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తారు.

మే 2 వరకు దరఖాస్తులు..
ఏప్రిల్‌ 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మే 2వ తేదీ వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని మద్రాస్‌ ఐఐటీ వెల్లడించింది. రిజిస్ట్రేషన్, సీట్లు, ఫీజు తదితర వివరాలను సంబంధిత ఇన్ఫర్మేషన్‌ బ్రోచర్‌లో పొందవచ్చని పేర్కొంది. 2015 జేఈఈ మెయిన్‌లో టాప్‌ 1.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమతించగా.. 2016లో టాప్‌ 2 లక్షల మందికి అవకాశమిచ్చామని తెలిపింది. సీట్లు మిగిలిపోకుండా ఉండేందుకు ఈసారి టాప్‌ 2.2 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తామని వివరించింది. రిజర్వేషన్‌ కేటగిరీల వారీగా చూస్తే... అడ్వాన్స్‌డ్‌కు ఓపెన్‌ కేటగిరీలో 1,11,100 మంది (50.5 శాతం), ఓబీసీలో 59,400 మంది (27 శాతం), ఎస్సీల్లో 33 వేల మంది (15 శాతం), ఎస్టీల్లో 16,500 మందిని (7.5 శాతం) అనుమతిస్తామని వివరించింది.

ఇవీ మరిన్ని అర్హత వివరాలు
– విద్యార్థులు 1992 అక్టోబరు 1న లేదా ఆ తరువాత జన్మించిన వారు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. అంటే 1987 అక్టోబరు 1న, లేదా ఆ తరువాత జన్మించిన వారు అర్హులే.
– జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఒక అభ్యర్థి మూడుసార్లు హాజరు కావచ్చు. అయితే వరుసగా రెండుసార్లు మాత్రమే హాజరు కావచ్చు. 2016 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరైన వారు ఈ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయవచ్చు.
– ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు 2016 రాసిన వారు, 2017లో రాయబోయే వారు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరుకావచ్చు. 2014–15 విద్యా సంవత్సరానికి సంబంధించి 2015 జూన్‌ తరువాత ఫలితాలు వచ్చిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయవచ్చు.
– ఇప్పటికే ఐఐటీల్లో చేరిన వారు, గతంలో ఐఐటీల్లో సీట్లు పొంది, కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేసి, సీటును రద్దు చేసుకున్న వారు ఈ పరీక్ష రాసేందుకు అనర్హులు.
– అయితే 2016జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సీటు లభించాక సీటు యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి, సీటును యాక్సెప్ట్‌ చేయని వారు (జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌లో భాగంగా రిపోర్టింగ్‌ కేంద్రాల్లో ఎక్కడా రిపోర్టు చేయని వారు) ఈ పరీక్ష రాసేందుకు అర్హులే.
– ఏదేని ఐఐటీల్లో 2016లో మొదటిసారిగా ప్రిపరేటరీ కోర్సులో చేరిన వారు 2017 జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరుకావచ్చు.

ఇదీ పూర్తిస్థాయి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూలు..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్‌: 28–4–2017(ఉదయం 10 గంటల నుంచి) 2–5–2017 (సాయంత్రం 5 గంటలవరకు)
ఆలస్య రుసుముతో: 2–5–2017 నుంచి 4–5–2017  (2వ తేదీ సాయంత్రం 5 గంటల తరువాత నుంచి 4వ తేదీ సాయంత్రం 5 గంటలవ వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం)
హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌: 10–5–2017 నుంచి 21–5–2017
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష: 21–5–2017:  (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు–2 పరీక్ష ఉంటుంది).
ఆన్‌లైన్‌లో ఓఎంఆర్‌ జవాబు పత్రాల ప్రదర్శన. వాటిపై అభ్యర్థుల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ: 31–5–2017 ఉదయం 10 గంటల నుంచి 3–6–2017 సాయంత్రం 5 గంటల వరకు
జవాబుల కీలు: 4–6–2017: ఉదయం 10 గంటలకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
జవాబుల కీలపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరణ:4–6–2017 నుంచి 6–6–2017 వరకు
అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వెల్లడి: 11–6–2017 ఉదయం 10 గంటలకు
ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టుకు (ఏఏటీ) ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: 11–6–2017 ఉదయం నుంచి 12–6–2017 సాయంత్రం వరకు
ఏఏటీ పరీక్ష:14–6–2017: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
ఏఏటీ ఫలితాలు విడుదల: 18–6–2017
ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో సంయుక్త ప్రవేశాలు: 19–6–2017 నుంచి 18–7–2017
=============
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అనుమతించే విద్యార్థుల వివరాలు...
కేటగిరీ                                      అభ్యర్థుల సంఖ్య
ఓపెన్‌                                              1,07,767
ఓపెన్‌ – వికలాంగులు                            3,333
ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌                       57,618
ఓబీసీ–ఎన్‌సీఎల్‌–వికలాంగులు              1,782
ఎస్సీ                                                  32,010
ఎస్సీ–వికలాంగులు                                   990
ఎస్టీ                                                     16,005
ఎస్టీ–వికలాంగులు                                     495
----------------------------------------------------
మొత్తం                                              2,20,000

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement