జేఈఈ అడ్వాన్స్‌డ్.. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో చేరాలని కోరుకునే ంజనీరింగ్ ఔత్సాహిక విద్యార్థులకు
సుపరిచితమైన పరీక్ష. జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం ఇంటర్మీడియెట్
తొలి సంవత్సరం తొలి రోజు నుంచే కృషి చేస్తారనడం నిస్సందేహం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రతిభావంతులు
పోటీపడే ప్రతిష్టాత్మక పరీక్ష ఇది. ఇదే సమయంలో పరీక్ష శైలి నుంచి ప్రవేశాల వరకూ ఎన్నో సందేహాలు కూడా!
జేఈఈ-అడ్వాన్స్‌డ్-2016 తేదీ ఖరారైన నేపథ్యంలో విద్యార్థుల సందేహాలకు నిపుణుల సమాధానాలు..
ప్ర:జేఈఈ అడ్వాన్స్‌డ్-2016 ఎప్పుడు జరగనుంది?
జ:మే 22, 2016న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఐఐటీ కమిటీ నిర్వహిస్తుంది. ఈసారి నిర్వహణ బాధ్యతలను ఐఐటీ-గువహటి చేపట్టనుంది.
ప్ర:జేఈఈ అడ్వాన్స్‌డ్ అర్హత ఏంటి; పరీక్షకు ఎన్నిసార్లు హాజరు కావచ్చు?
జ:కచ్చితంగా ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా పూర్తి చేసిన విద్యార్థులే అర్హులు. 2015, 2016లో 10+2/తత్సమానంలో అన్ని సబ్జెక్టులకు హాజరై ఉండాలి. గరిష్టంగా రెండుసార్లు అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. మొదటి సంవత్సరం చదువుతూ ప్రాక్టీస్ లేదా అనుభవం కోసం పరీక్షకు హాజరయ్యే అవకాశం లేదు.
ప్ర:గరిష్ట వయోపరిమితి ఎంత?
జ:జనరల్, ఓబీసీ-ఎన్‌సీఎల్ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి 1991 అక్టోబర్ 1వ తేదీ తర్వాత పుట్టిన విద్యార్థులే అర్హులు. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులకు సంబంధించి 1986 అక్టోబర్1న జన్మించి ఉండాలి.
ప్ర:జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక ఎలా ఉంటుంది?
జ:అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరు కావాలంటే ముందుగా జేఈఈ-మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. జేఈఈ-మెయిన్‌లో ఉత్తీర్ణులైన రెండు లక్షల మందిని జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. అడ్వాన్స్‌డ్-2015 విషయంలో జేఈఈ-మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించిన 1.5 లక్షల మందిని మాత్రమే అడ్వాన్స్‌డ్‌కు అనుమతించారు. అయితే తాజాగా నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు 2016 నుంచి జేఈఈ-మెయిన్ నుంచి 2 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వనున్నారు!
ప్ర:జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా ప్రవేశాల ప్రక్రియ ఎలా ఉంటుంది?
జ:జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశ ప్రక్రియ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి నిర్దిష్ట అర్హత నిబంధనలు ఉన్నాయి. అవి..
ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సులో 75 శాతం మార్కులు పొందాలి. ఎస్‌సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ విద్యార్థులు 70శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. (లేదా)
బోర్‌డ పరీక్షలో టాప్- 20 పర్సంటైల్‌లో నిలవాలి.
ప్ర:అడ్వాన్స్‌డ్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేసే సీట్లు, ఇన్‌స్టిట్యూట్‌లు ఏవి?
జ:మొత్తం 17 ఐఐటీలు; ఐఎస్‌ఎం-ధన్‌బాద్, ఐఐటీ-బీహెచ్‌యూల్లో ప్రవేశానికి అడ్వాన్స్‌డ్ ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు. వీటిలో బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, బీటెక్+ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు మొత్తం కలిపి 2015లో 10,006 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2016లో మరో రెండు కొత్త ఐఐటీల్లో (గోవా, ఛత్తీస్‌గఢ్) 180 సీట్లు అదనంగా రానున్నాయి.
ప్ర:కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది?
జ:జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకు ద్వారా ప్రవేశాలు కల్పించే ఐఐటీలు, జేఈఈ మెయిన్ ర్యాంకు ద్వారా అవకాశం లభించే ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి 2015 నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ (జోసా) పేరిట ఉమ్మడి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ విధానం అమల్లోకి తెచ్చారు. అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా నిర్దేశిత వెబ్‌సైట్‌లో తమ బ్రాంచ్, ఇన్‌స్టిట్యూట్‌ల ప్రాథమ్యాలను పేర్కొనాల్సి ఉంటుంది. మొత్తం మూడు రౌండ్లలో సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీటు పొందిన అభ్యర్థులు నిర్దేశిత తేదీలోపు సదరు ఇన్‌స్టిట్యూట్‌లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకపోతే సీటు రద్దవుతుంది.
అడ్వాన్స్‌డ్ పరీక్ష తీరు తెన్నులు?
జ:అడ్వాన్స్‌డ్ పరీక్ష రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) గా ఆబ్జెక్టివ్ విధానంలో మే 22, 2016న ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అయితే మార్కులు, ప్రశ్నల సంఖ్య పరంగా ఏటా మార్పులు జరుగుతుంటాయి. నిర్దిష్ట మార్కింగ్ విధానం లేదు. 2015లో పేపర్-1లో 60 ప్రశ్నలు (మార్కులు 264); పేపర్- 2లో 60 ప్రశ్నలు (మార్కులు 264) అడిగారు. నెగెటివ్ మార్కింగ్ విషయంలోనూ నిర్దిష్ట విధానం ఉండదు. కొన్ని ప్రశ్నలకు 4 మార్కులు; మరికొన్ని ప్రశ్నలకు 1 మార్కు చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ప్ర:సబ్జెక్ట్‌వైజ్‌గా ఏ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది? ప్రిపరేషన్‌లో ఏ అంశాలకు ఎక్కువ సమయం కేటాయిస్తే మంచి మార్కులు పొందొచ్చు?
జ:అడ్వాన్స్‌డ్ పరీక్షలో సబ్జెక్ట్ వారీగా ప్రాధాన్య, అప్రాధాన్య అంశాలనే తేడా ఉండదు. ఒక సబ్జెక్ట్‌లో అన్ని అంశాల్లో నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ పరంగా నిర్దిష్ట చాప్టర్లకు ఎక్కువ సమయం కేటాయించాలనుకునే దృక్పథం సరికాదు.
ప్ర:ప్రిపరేషన్‌పరంగా సబ్జెక్ట్ అంశాల్లో నైపుణ్యం పొందడమెలా?
జ:ప్రతి సబ్జెక్ట్‌లోనూ ఆయా టాపిక్స్‌ను అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో చదవాలి. బేసిక్ కాన్సెప్ట్స్‌పై అవగాహన పెంచుకుంటూ ప్రిపరేషన్ సాగించడం వల్ల పరీక్షలో ప్రశ్నను ఏ తరహాలో అడిగినా సమాధానం ఇచ్చే సామర్థ్యం లభిస్తుంది.
ప్ర:సబ్జెక్ట్ వారీగా ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి?
జ:మ్యాథమెటిక్స్‌లో అల్జీబ్రా, కాలిక్యులస్, 3-డి, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టార్ అల్జీబ్రాల్లో పట్టు సాధించాలి. ఫిజిక్స్‌లో మెకానిక్స్, థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, హీట్ అండ్ వేవ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం టాపిక్స్‌ను ప్రత్యేక శ్రద్ధతో ప్రిపేర్ అవ్వాలి. కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీకి ప్రాధాన్యం ఇవ్వడం మేలు. అదే విధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్, కెమికల్ కెనైటిక్స్, కెమికల్ బాండింగ్ టాపిక్స్‌పై పట్టుసాధించాలి.
ప్ర:రివిజన్ టిప్స్ ఏవి?
జ:ముఖ్యమైన అంశాలను, సూత్రాలను ఒక నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ వేగంగా పూర్తి చేసుకోవచ్చు. ఈక్వేషన్స్, టేబుల్స్, డయాగ్రమ్స్, పాయింటర్స్ వంటి పద్ధతుల్లో షార్ట్ నోట్స్ రూపొందించుకుంటే రివిజన్ వేగంగా, సులభంగా ఉంటుంది.
ప్ర:కనీస అర్హత మార్కుల వివరాలు తెలపండి?
జ:జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల జాబితాలో నిలవాలంటే నిబంధనల ప్రకారం అభ్యర్థులు పొందాల్సిన కనీస మార్కుల శాతాన్ని ఐఐటీ గువహటి ప్రకటించింది. వివరాలు.
ర్యాంకు జాబితా కనీస మార్కుల శాతం
సబ్జెక్ట్ మొత్తం
కామన్ మెరిట్ లిస్ట్ 10 35
ఓబీసీ 9 31.5
ఎస్‌సీ 5 17.5
ఎస్‌టీ 5 17.5
ప్ర:ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉద్దేశం ఏమిటి?
జ:ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్, రూర్కీల్లో అందుబాటులో ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు పొందిన విద్యార్థులకు మాత్రమే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రాసేందుకు అర్హత. అందులో మెరిట్ ఆధారంగా ఖరగ్‌పూర్, రూర్కీల్లో బీఆర్క్‌లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకుంటే అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాక ఆన్‌లైన్ విధానంలో ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్ష మూడు గంటల వ్యవధిలో ఉంటుంది. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్, జామెట్రికల్ డ్రాయింగ్, 3-డి పర్సెప్షన్, ఇమాజినేషన్ అండ్ ఈస్థటిక్ సెన్సిటివిటీ, ఆర్కిటెక్చరల్ అవేర్‌నెస్ అంశాల్లో పరీక్ష ఉంటుంది.
ప్ర:సీట్ల కేటాయింపులో రిజర్వేషన్ల విధానం ఎలా ఉంటుంది?
జ:ఓబీసీ నాన్-క్రీమీలేయర్ వర్గాలకు 27 శాతం; ఎస్‌సీలకు 15 శాతం; ఎస్టీలకు 7.5 శాతం సీట్లు ప్రతి కోర్సులో కేటాయిస్తారు. మిగతా సీట్లను జనరల్ కేటగిరీలో భర్తీ చేస్తారు. అదే విధంగా ప్రతి కేటగిరీకి కేటాయించిన రిజర్వేషన్ శాతంలో మూడు శాతం సీట్లను ఆ కేటగిరీలోని వికలాంగులకు కేటాయిస్తారు. ఓబీసీ-నాన్ క్రీమీలేయర్ కోటాలో సీట్లు మిగిలితే వాటిని జనరల్ కేటగిరీకి బదిలీ చేస్తారు. ఎస్‌సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో మాత్రం మిగులు సీట్లను ఆ వర్గాలకు చెందిన విద్యార్థులకే కేటాయిస్తారు.
ప్ర:ఐఐటీల్లో ఫీజులు ఎలా ఉంటాయి?
జ:అన్ని ఐఐటీల్లో ట్యూషన్ ఫీజు మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఏడాదికి రూ. 90 వేలు చెల్లించాలి. లైబ్రరీ ఫీజు, లేబొరేటరీ ఫీజు, కాషన్ డిపాజిట్ వంటి ఫీజులకు సంబంధించిన మొత్తాలు ప్రతి ఐఐటీకి వేర్వేరుగా ఉంటాయి. ఫీజులను సెమిస్టర్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజుతో కలిపి ఏడాదికి దాదాపు రూ.1.25 లక్షల నుంచి రూ. 1.30 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ విద్యార్థులకు హాస్టల్ ఫీజు నుంచి పూర్తి రాయితీ. ట్యూషన్ ఫీజులను 2.5 లక్షలకు పెంచాలని ఐఐటీ నిపుణుల కమిటీ చేసిన సిఫార్సును ప్రభుత్వం ప్రస్తుతం వాయిదా వేసింది.
ప్ర:రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఎంత ఉంటుంది?
జ:ప్రస్తుతం అమలవుతున్న విధానాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ట్యూషన్‌ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు లభిస్తుంది. అదే విధంగా కుటుంబ వార్షికాదాయం రూ. 4.5 లక్షల్లోపు ఉన్న అన్ని కేటగిరీల విద్యార్థులకు వంద శాతం మినహాయింపు లభిస్తుంది.
ప్ర:ఐఐటీ సీట్లలో స్థానిక కోటా రిజర్వేషన్లు ఏమైనా ఉంటాయా?
జ:ఐఐటీల్లో హోంస్టేట్ కోటా విధానం అమల్లో లేదు. జాతీయ స్థాయిలో పొందిన మెరిట్ ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో మాత్రం 50 శాతం సీట్లను హోంస్టేట్ కోటా కింద సదరు ఇన్‌స్టిట్యూట్ ఉన్న రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ విద్యార్థులకు నిట్-వరంగల్‌లో, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నిట్-తాడేపల్లిగూడెంలో 50 శాతం సీట్ల చొప్పున లభిస్తాయి.
జేఈఈ అడ్వాన్స్‌డ్-2016 సమాచారం,
ముఖ్య తేదీలు
జేఈఈ మెయిన్-2016లో మొదటి రెండు లక్షల మందిలో ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్:
ఏప్రిల్ 29, 2016 నుంచి మే 4, 2016 వరకు
హాల్ టికెట్ డౌన్‌లోడ్:
మే 11, 2016 నుంచి మే 22, 2016 వరకు
పరీక్ష తేదీ: మే 22, 2016 (పేపర్-1 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు; పేపర్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు)
ఫలితాల వెల్లడి: జూన్ 12, 2016
ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రిజిస్ట్రేషన్:జూన్ 12, 13
సీట్ల కేటాయింపు:
జూన్ 20, 2016 నుంచి జూలై 19, 2016 వరకు
వివరాలకు వెబ్‌సైట్: http://www.jeeadv.ac.in
వ్యూహం పకడ్బందీగా ఉండాలి
జాతీయ స్థాయిలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి ఒకే ఎంట్రన్స్ నిర్వహించాలనే అంశంపై చర్చ జరిగినా 2016 ప్రవేశాలకు సంబంధించి గత విధానమే అమలు కానుంది. కాబట్టి విద్యార్థులు కూడా తమ వ్యూహాలకు పదును పెట్టాలి. మెయిన్ నుంచి అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసే విద్యార్థుల సంఖ్యను 1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచడం హర్షణీయం. ఇదే క్రమంలో పోటీ కూడా పెరుగుతుందనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. అడ్వాన్స్‌డ్‌లో 55 నుంచి 60 శాతం మార్కులు పొందే విధంగా కృషి చేస్తే ఐఐటీల్లో సీటు సొంతం చేసుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. గతంలో 45 నుంచి 50 శాతం మధ్యలో మార్కులకు సీటు వచ్చిన సందర్భాలున్నా ఇప్పుడు అడ్వాన్స్‌డ్‌కు రెండు లక్షల మందిని ఎంపిక చేసే విధానం కారణంగా పోటీ పెరుగుతుంది. అభ్యర్థులు కాన్సెప్ట్యువల్ క్లారిటీ, అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగిస్తే విజయం సొంతం చేసుకోవచ్చు.
- ఆంటోని, జేఈఈ కోర్స్ డెరైక్టర్,
టైమ్ ఇన్‌స్టిట్యూట్
జేఈఈ అడ్వాన్‌సడ్ సందేహాలు-సమాధానాలు
Published Wed, Nov 18 2015 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM
Advertisement
Advertisement