‘ఆంధ్రా’ దిక్సూచి | andhra diksuchi of youth unemployment | Sakshi
Sakshi News home page

‘ఆంధ్రా’ దిక్సూచి

Published Wed, Nov 12 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

‘ఆంధ్రా’ దిక్సూచి

‘ఆంధ్రా’ దిక్సూచి

రాష్ర్టంలో బ్యాంకింగ్ వ్యవస్థకు పునాదులు వేయడమే కాకుండా ఆ రంగంలో దిగ్గజంగా ఎదిగిన సంస్థ ఆంధ్రాబ్యాంకు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన గ్రామీణాభివృద్ధి సంస్థ నిరుద్యోగ యువతకు దిక్సూచిలా నిలుస్తోంది. భవితకు భరోసానిస్తోంది. వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు చూపిస్తోంది. నవంబర్ 14 గురువారం సంస్థ రజతోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం...
 
* ఆంధ్రాబ్యాంకు గ్రామీణాభివద్ధి సంస్థ
* నిరుద్యోగ యువత ఉపాధికి బాటలు
* వివిధ కోర్సుల్లో తర్ఫీదు
* ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు

ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : జిల్లాలోని గ్రామీణుల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు నందించాలని  ఆంధ్రాబ్యాంకు తలంచింది. దీనికోసం 1989 నవంబర్ 14న పండింట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా గ్రామీణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. దీనిని రాజమండ్రిలోని ఆల్కాట్‌తోటలో ప్రారంభించింది. మారుతున్న కాలానుగుణంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక కార్యా చరణ ప్రారంభించి నిరుద్యోగ యువత, మహిళలకు  వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణనిచ్చి ఉపాధికి బాటలు వేస్తోంది.  శిక్షణా కాలంలో వసతి, భోజన సదుపాయం అందిస్తోంది.
 
42,222 మందికి శిక్షణ
ఇప్పటివరకు ఈ సంస్థ 42,222 మందికి వివిధ కోర్సుల్లో శిక్షణనిచ్చింది. వీరిలో 35,378 మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. మరో పదిమందికి పని కల్పించే స్థాయికి చేరా రు. ఇప్పటివరకు 1292 శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది.
 
ఆదరణ ఉన్న కోర్సుల్లోనే శిక్షణ
మార్కెట్‌లో ఆదరణ ఉన్న కోర్సులను మాత్రమే ఎంపిక చేసి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రత్యేకత. డీటీపీ, ఫొటోషాప్, టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గంవర్క్, ఫ్యాషన్ డిజైనింగ్, గిఫ్ట్ ఆర్టికల్స్, కొబ్బరిపీచు ఉత్పత్తుల తయారీ, కంప్యూటర్ డేటా ఎంట్రీ, హార్డ్‌వేర్, సెల్‌ఫోన్ రిపేరింగ్, ఫొటోగ్రఫీ-వీడియో మిక్సింగ్, కార్‌డ్రైవింగ్, హౌస్‌వైరింగ్, కొవ్వుత్తులు, సేంద్రియ ఎరువుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, నర్సరీ వంటి కోర్సులతోపాటు ప్రధానమంత్రి ఉపాధి కల్పనలో భాగంగానూ పలు కోర్సులకు శిక్షణ ఇస్తోంది.
 
రైతులకూ అవగాహన
వ్యవసాయానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను కూడా  సంస్థ నిర్వహిస్తోంది. ఉద్యానవనాల అభివృద్ధి, పశుసంరక్షణ, చేపల పరిశ్రమపై అవగాహన సదస్సులు చేపడుతోంది. రైతులకు నిత్యం సమాచారం ఇచ్చేందుకు వర్క్‌షాపులు, సెమినార్‌లు నిర్వహిస్తోంది. సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు 15,30,45రోజులపాటు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చింది.
 
కృషికి పురస్కారాలు
సంస్థ ఉత్తమ సేవలకు ఎన్నో పురస్కారాలు వరించాయి.  కేంద్రగ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ విశిష్ట పురస్కారాలను 2011-12, 2012-13 సంవత్సరాల్లో అందుకుంది. ఇక్కడ శిక్షణ పొందిన కొత్తపేట వాసి దర్నాల సత్తిబాబు ప్రత్యేక ప్రతిభావంతుల విభాగంలో  2012-13లో కేంద్రగ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఉత్తమ వ్యవస్థాపకునిగా పురస్కారం అందుకున్నారు.
 
అల్పాదాయవర్గాలకు అవకాశం
మా సంస్థలో శిక్షణకు తెల్లరేషన్ కార్డు కలిగి అల్పాదాయ వర్గాలకు చెందిన వారు అర్హులు. వయస్సు 18నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి. శిక్షణార్థులకు భవితపై పూర్తి భరోసా కల్పిస్తాం. మహిళలకు మహిళా వార్డెన్లు, మహిళా టీచర్లను నియమిస్తున్నాం. వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నాం. శిక్షణ అనంతరం ఉచిత స్టడీమెటీరియల్, పుస్తకాలు ఇస్తున్నాం. అర్హులకు వారివారి ప్రాంతాల్లో బ్యాంకులు రుణాలు కూడా మంజూరు చేస్తున్నాయి.
 - కె.పి.ఆర్.ఎస్.విఠల్, డెరైక్టర్,ఆంధ్రాబ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ
 
బ్యూటీషియన్‌గా ఉపాధి  పొందుతున్నా
ఆంధ్రాబ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందా. ప్రస్తుతం బ్యూటీపార్లర్ నెలకొల్పా. ఇదే శిక్షణ సంస్థలో మా అక్క దుర్గ కూడా శిక్షణ తీసుకుని బ్యూటీపార్లర్ స్థాపించి బ్యాంకు రుణం కూడా పొందారు. బ్యూటీపార్లర్ నిర్వహణతో కుటుంబానికి ఆసరాగా ఉండగలుగుతున్నా.
 - ఎం.సూర్యకళ, సూర్య బ్యూటీపార్లర్, సీతానగరం
 
ఎన్నో నేర్చుకున్నా
వైకల్యంతో బాధపడుతున్న నాకు ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియ దు. ఆంధ్రాబ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని ఎంబ్రాయిడరీ, టైలరింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, శారీ పెయింటింగ్ కోర్సులు నేర్చుకున్నా. దీని ద్వారా ఇంటి వద్దనే శారీలకు ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ వేస్తూ నెలకు రూ.రెండువేల ఆదాయాన్ని సంపాదిస్తున్నా.
 - ఆకుల భూలక్ష్మి, చినకొండేపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement