రైతుల పేరుతో కుచ్చుటోపీ..
అనంతపురం : రైతులమని నమ్మించి ఓ అపార్ట్ మెంట్ వారికి కుచ్చుటోపీ పెట్టారు. రైతులమని నమ్మబలికి కనీసం భోజనం తయారు చేసేందుకు వీలుకాని అత్యంత నాసికరమైన బియ్యాన్ని అంటగట్టారు. రెండు రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్తి వివరాలు.. స్థానిక జీసస్ నగర్‌లోని కేసీఎన్‌ఎస్ అపార్ట్‌మెంట్‌లోకి మూడు రోజుల కిందట మధ్యాహ్నం సమయంలో ఆరుగురు వ్యక్తులు వచ్చారు. ‘అమ్మా...మాది రేకులకుంట గ్రామం. ఆరేడుసార్లు బోర్లు వేశాం. నీరు పడలేదు. ప్రస్తుతం పని చేస్తున్న బోరూ రిపేరుకి వచ్చింది. రిపేరు చేయించేందుకు చిల్లిగవ్వ లేదు. బయట మార్కెట్‌లో ఎంత ధర ఉందో తెలీదు. మాకు లాభం వద్దు. డబ్బుతో అవసరం ఉంది. 50 కేజీల ప్యాకెట్ రూ. 1500కు ఇస్తాం. ఓసారి బియ్యం చూడండి’ అంటూ నమ్మబలికారు. జువెలరీ షాపు అనీఫ్, హరి, సుజాత, సైఫుల్లా తదితర కుటుంబాల సభ్యులు అపార్ట్‌మెంట్ కిందకు వెళ్లి బియ్యాన్ని పరిశీలించారు.
చూడటానికి బాగుండటంతో రైతుల పరిస్థితి అర్థం చేసుకుని, ఒక్కొక్కరు 50 కేజీల ప్యాకెట్లు 6-7 తీసుకున్నారు. అపార్ట్‌మెంట్ బయట ఉంచిన బొలోరో వాహనంలో తెచ్చిన బియ్యాన్ని ప్లాట్లలో దించేశారు. ఈ ఒక్క అపార్ట్‌మెంట్‌లోనే సుమారు రూ. 20 వేలు పైగా వ్యాపారం చేసుకున్నారు. తమవద్ద శనగ విత్తనాలు, మిరపకాయలు కూడా ఉన్నాయని అవసరమైతే ఫోన్ చేయాలంటూ ఓ నంబరు కూడా ఇచ్చి వెళ్లారు. అయితే శుక్రవారం అనీఫ్ ఇంట్లో భోజనం చేసేందుకని బియ్యం సంచిని తెరవగా అసలు విషయం బయటపడింది. చాలా అధ్వానంగా ఉన్నాయి. తర్వాత అందరి ఇళ్లలోకి వెళ్లి బియ్యం పాకెట్లను పరిశీలిస్తే ఈ నాసికరమైన బియ్యం ప్యాకెట్లే దర్శనమిచ్చాయి. రైతుల పేరుతో కుచ్చుటోపీ పెట్టారని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ మోసపోవద్దని బాధితులు కోరారు. ఇదిలాఉండగా నాసిరకం బియ్యం అంటగట్టిన వారి ఫొటోలు ఆపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.