ఎముకలు కొరికే చలిలో ఎటుచూసిన మంచుకొండలతో దేశ రక్షణ కోసం నిలబడి పోరాడుతున్న జవానుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందా? సియాచిన్ ప్రాంతంలో జవానులకు మంచు నుంచి రక్షణ కల్పించే సూట్లు నాణ్యమైనవి కావనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సియాచిన్ లో పనిచేసే ప్రతి ఒక్క జవానుకు అక్కడి వాతావరణానికి తట్టుకోగలిగేలా భారత ప్రభుత్వం ప్రత్యేకంగా తయారుచేయించిన సూట్లను ఇస్తోంది.
ఇందుకోసం శ్రీలంకకు చెందిన కంపెనీ రెయిన్ వేర్ తో 2012లో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్యుమెంట్లలో ఉంది. కానీ, రెయిన్ వేర్ అందించినవి కేవలం -15 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు మాత్రమే తట్టుకోగలిగేవిగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చలికాలంలో సియాచిన్ లో ఉష్ణోగ్రతలు దాదాపు -60 డిగ్రీల వరకూ పడిపోతుంటాయి. నాణ్యత లేని సూట్లను పంపడంపై భారత ప్రభుత్వం ఆ కంపెనీపై ఎటువంటి చర్యలను తీసుకోకపోవడం అనుమానాలను రేకెత్తిస్తోంది.
డాక్యుమెంట్లను బట్టి చూస్తే దాదాపు 28 వేల డాలర్ల మేర ఆ కంపెనీ భారత ప్రభుత్వాన్ని మోసగించినట్లు తెలుస్తోంది. రెయిన్ వేర్ మాజీ ఉద్యోగి ఆగష్టు 24, 2015న రాసిన ఓ లేఖను బట్టి చూస్తే.. భారత ఆర్మీ జవాన్లకు అందించిన సూట్ల మధ్య భాగంలో ఉండే పచ్చని భాగం పెద్ద మొత్తంలో గాలి, నీటి తాకిడులకు తట్టుకోలేవని చెప్పారు. సూట్లలోకి నీరు సులువుగా ప్రవేశిస్తుందని రాశారు.