
డెహ్రాడూన్: మంచు చరియలు విరిగిపడిన(Uttarakhand avalanche) ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు భారత సైన్యం శనివారం ప్రకటించింది. రెండో రోజు సహాయక చర్యల్లో 17 మందిని రక్షించినట్లు.. మిగిలిన మరో ఐదుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
ఛమోలి జిల్లాలో శుక్రవారం వేకువజామున బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ క్యాంప్ వద్ద భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 55 మంది బీఆర్‌వో కార్మికులు చిక్కుకుపోగా.. భారత సైన్యం(Indian Army) రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. మంచు వర్షంతో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే నిన్న 33 మందిని.. ఇవాళ మరో 17 మందిని భారత సైన్యం రక్షించింది.
వీళ్లలో తీవ్రంగా గాయపడిన వాళ్లను జోషిమఠ్‌లోని ఆస్పత్రులకు హెలికాఫ్టర్‌ల ద్వారా తరలించింది. చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందినట్లు తెలిపింది.
ఇండో-టిబెటన్ సరిహద్దు గ్రామమైన మనాలో.. సైన్యం కదలికల కోసం రోడ్ల నుంచి మంచును తొలగించే పనుల్లో బీఆర్‌వో బృందం తలమునకలైంది. ఈ క్రమంలో.. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంచు కొండలు విరిగిపడ్డాయి. ఎనిమిది కంటైనర్‌లతో పాటు ఒక షెడ్డూలో వాళ్లను మంచు చరియలు కప్పేశాయి.
ఒకవైపు వర్షం.. మరోవైపు అడుగుల మేరలో పేరుకుపోయిన మంచులో మరికొన్ని ఏజెన్సీల సాయంతో సైన్యం సహాయక చర్యలు కొనసాగించింది. వీళ్లలో కొందరు ఉత్తరాఖండ్(Uttarakhand) నుంచి ఉండగా, చాలామంది బీహార్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్ము కశ్మీర్, ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లు ఉన్నారు.
సహాయక చర్యలపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి సమీక్ష జరుపుతున్నారు. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నామని అన్నారాయన.