- విద్యార్థుల్లో కనీస పరిజ్ఞానం పెంపొందించాలి
- ఉపాధ్యాయులపై డీఈఓ ఆగ్రహం
- పాఠశాలల ఆకస్మిక తనిఖీ
- ఇద్దరికి షోకాజ్ నోటీసులు
నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : విద్యార్థులకు కనీస సామర్ధ్యాన్ని పెంపొందించని ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన పట్టణంలోని జిల్లాపరిషత్ మెయిన్‌స్కూల్, తురకబడి హైస్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(తురకబడి)లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులను పలు సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలు అడిగారు. హాజరుసంఖ్య తక్కువగా ఉండడం, పలు సబ్జెక్టుల్లో విద్యార్థులకు కనీస పరిజ్ఞానం లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు.
అన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు విద్యార్థులకు బేసిక్‌నాలెడ్జ్ లేకపోతే ఎలా అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. గణితం, తెలుగు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఎంఈవో దివాకర్‌ను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 100 రోజుల కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయడానికి మోనటరింగ్ కమిటీలను ఏర్పాటుచేశామన్నారు.
0వ తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడానికి వీలుగా ప్రణాళిక రూపొందించవలసిన బాధ్యత ఆయా హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులపై ఉందన్నారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలోపం కారణంగానే విద్యార్థుల్లో కనీస సామర్ధ్యం కొరవడిందన్నారు. వచ్చే నెల 27 నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.