రూ.30 కోట్ల ఆస్తుల గుర్తింపు.. 300ఎకరాల భూముల డాక్యుమెంట్లు స్వాధీనం
పరారీలో కీలక నిందితుడు ఆర్‌ఆర్ రాజా..
సాక్షి, విశాఖపట్నం/ అల్లిపురం న్యూస్‌లైన్: బొమ్మరిల్లు ఫైనాన్స్, రియల్‌ఎస్టేట్ సంస్థకు చెందిన నలుగురు డెరైక్టర్లు, ఒక మానవవనరుల మేనేజర్‌ను విశాఖపట్నం సెంట్రల్ క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వీరి ద్వారా రూ. 30 కోట్ల విలువచేసే ఆస్తులను గుర్తించారు. వివిధ జిల్లాల్లో 300 ఎకరాల ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు, విశాఖ పీఎం పాలెంలో రూ.కోటి ఖరీదు చేసే పచ్చళ్ల ఫ్యాక్టరీ మిషనరీ, రూ.20 వేల నగదు, పలు బంగారు ఆభరణాలు, ఐదు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. సంస్థకు కొత్తవలస, ఎస్.కోట, డెంకాడ, పలాస, కంచిలి, పాలకొండ, యాదగిరిగుట్ట, కోదాడ ప్రాంతాల్లో 300 ఎకరాల వరకు భూములు ఉన్నట్లు తేల్చారు.
రూ. 100 కోట్ల వరకు వసూలు చేసిన సంస్థ ఇంకా ఖాతాదారులకు రూ.60 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని పోలీసులు గుర్తించారు. కరీంనగర్, మచిలీపట్నం, సామర్లకోట, శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, కాశిబుగ్గ ఒడిశాలోని బరంపురం తదితర ప్రాంతాల్లోనూ శాఖలు ప్రారంభించినప్పటికీ.. అక్కడి ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు అందలేదని పోలీసులు వెల్లడించారు. మోసానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే సంస్థకు ఇటీవలి వరకు చైర్మన్‌గా వ్యవహరించిన ఆర్‌ఆర్ రాజాను అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయన కర్ణాటకలో ఉన్నాడన్న సమాచారం ఉందన్నారు. సంస్థకు చెందిన భూములను అటాచ్ చేసే ఆలోచనలో ఉన్నామని, ఈ దిశగా సంబంధిత సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాస్తామన్నారు.
మోసం ఇలా...
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాయల రాజా(ఆర్‌ఆర్ రాజా), అతని భార్య స్వాతి రాజా, బావమరిది లక్ష్మీనారాయణలు బోర్డు ఆఫ్ డెరైక్టర్లుగా హైదరాబాద్‌లో రాజా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. 2011 ఆగస్టులో బొమ్మరిల్లు పేరుతో విశాఖపట్నం కేంద్రంగా కార్యాలయం ప్రారంభించారు. దీంతోపాటు బొమ్మరిల్లు రియల్ ఎస్టేట్స్, బొమ్మరిల్లు ఫుడ్స్, బొమ్మరిల్లు కన్‌స్ట్రక్షన్స్, బొమ్మరిల్లు ఫిలింస్, బొమ్మరిల్లు ఫైనాన్స్ పేరిట కంపెనీలను ప్రారంభించారు.
అప్పటినుంచి నిబంధనలకు విరుద్ధంగా పలు స్కీముల పేరుతో డిపాజిట్లు సేకరించారు. రోజువారీ, నెలవారీ, ఫిక్స్‌డ్ డిపాజిట్, రియల్ ఎస్టేట్ అవసరాలకోసం మూడు వేల మంది ఏజెంట్ల ద్వారా సుమారు 40వేల మంది నుంచి రూ.100 కోట్ల మేర డిపాజిట్లు సేకరించారు. అయితే కంపెనీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడంతో సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఆర్.ఆర్. రాజా రాజీనామా చేసి అప్పటికే డెరైక్టర్లుగా వ్యవహరిస్తున్న వానపల్లి వెంకటరావు, సావు శ్రీనివాసరావు, కమ్మెల బాపూజీ, గోవిందు యర్రయ్య, మానవవనరుల మేనేజర్ కాపుగుంట సత్యనారాయణలకు అప్పగించి వెళ్లిపోయాడు. దీంతో సంస్థ తీవ్ర కష్టాల్లో పడింది.
టీడీపీలో క్రియాశీలకంగా..
ఆర్‌ఆర్ రాజా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. దీనిని దృష్టిలో పెట్టుకుని గత పంచాయతీ ఎన్నికల్లో కొంత మంది టీడీపీకి చెందిన సర్పంచ్‌ల కోసం రూ.3 కోట్ల వరకు ఆయన ఖర్చు చేశారని తెలిసింది.
‘బొమ్మరిల్లు’ డైరెక్టర్ల అరెస్ట్
Published Tue, Jan 14 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement