శనగ విత్తనాల ధర ఖరారు
క్వింటా రేటు రూ.3800
కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్‌లో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయనున్న శనగ విత్తనాల ధరను ప్రభుత్వం ఎట్టకేలకు ఖరారు చేసింది. మార్కెట్‌లో శనగ ధర రూ.2 వేలు మించని పరిస్థితి. మంచి ధర వస్తుందనే ఆశతో గోదాముల్లో నిల్వ చేసుకున్న రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో గగ్గోలు పెడుతున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం సబ్సిడీ శనగ విత్తనాలకు అధిక ధర ఖరారు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. క్వింటా శనగ ధర రూ.3800గా నిర్ణయించి.. 33.33 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ లెక్కన రైతులు రూ.2,533.50 చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో రైతుకు 50 కిలోల వరకు(రెండు ప్యాకెట్లు) పంపిణీ చేయనున్నారు. 25 కిలోల ప్యాకెట్‌కు రూ.633.50 చెల్లించాలని
నిర్ణయించారు. సబ్సిడీ పోను రైతులు చెల్లించాల్సిన ధర కంటే తక్కువకే మార్కెట్‌లో శనగలు లభిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయం దళారులకే వరం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబ్సిడీపై పంపిణీ చేసేందుకు జిల్లాకు 60770 క్వింటాళ్ల శనగ మంజూరైంది. ఇందులో ఏపీ సీడ్స్ 25,770 క్వింటాళ్లు, మార్క్‌ఫెడ్ 15 వేలు, ఆయిల్‌ఫెడ్ 20 వేల క్వింటాళ్లు సరఫరా చేసేలా ప్రభుత్వం ఆదేశించింది.
జిల్లా వ్యవసాయాధికారులు సాగు విస్తీర్ణాన్ని బట్టి సబ్ డివిజన్‌లకు విత్తనాలను కేటాయించారు. కర్నూలు సబ్ డివిజన్‌కు 8200 క్వింటాళ్లు, డోన్‌కు 800, నందికొట్కూరుకు 6000, కోవెలకుంట్లకు 6500, ఎమ్మిగనూరుకు 4100, ఆదోనికి 1150, నంద్యాలకు 5000, ఆళ్లగడ్డకు 5200, ఆలూరుకు 7500, పత్తికొండకు 6320 క్వింటాళ్ల ప్రకారం కేటాయించారు.