అంతులేని నిర్లక్ష్యం | Endless ignored | Sakshi
Sakshi News home page

అంతులేని నిర్లక్ష్యం

Published Sat, Jan 10 2015 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

అంతులేని నిర్లక్ష్యం

అంతులేని నిర్లక్ష్యం

సాక్షిప్రతినిధి, అనంతపురం : కర్ణుడిచావుకు సవాలక్ష కారణాలన్నట్లు, పెనుకొండ రోడ్డు ప్రమాదానికి కూడా బోలెడు కారణాలు కన్పిస్తున్నాయి. అయితే అన్నిటికీ మూల కారణం మాత్రం ప్రభుత్వ నిర్లిప్తత అనేది స్పష్టమవుతోంది. అర్ అండ్‌బీ శాఖ నిర్లిప్తత, కాంట్రాక్టు దక్కించుకున్న నిర్మాణ సంస్థ  నిర్లక్ష్యం..ఆర్టీసీ బాధ్యతారహిత్యం వెరసి ఘోర ప్రమాదం సంభవించింది. అయితే ప్రభుత్వం.. బస్సు డ్రైవర్‌తో పాటు అధికారులను మాత్రమే బాధ్యులను చేసింది. నెల కిందట విధుల్లో చేరిన ఆర్టీసీ డీఎం, ఆర్ అండ్‌బీ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం.. కాంట్రాక్టర్  నిర్లక్ష్యంపై కన్నెత్తి చూడ కపోవడం గమనార్హం.
 
టెండర్ ఒక సంస్థది.. పనులు చేస్తోంది మరో సంస్థ
పెనుకొండ-మడకశిర రోడ్డులో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. ఆర్టీసీ బస్సులు, కార్లు, ఆటోలతో పాటు కర్ణాటక నుంచి భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పెనుకొండ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ‘షీఫ్-పారం’ అనే ప్రాంతంలో ఘాట్‌రోడ్డు ఉంది. ఈ ఘాట్‌రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని గ్రహించిన గత ప్రభుత్వం కొత్త రోడ్డుకు అనుమతి ఇచ్చింది.

ఈ క్రమంలో 2014 మే 1న ద్వారాకమయి కన్‌స్ట్రక్షన్స్ 10 కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకుంది. అగ్రిమెంట్ ప్రకారం 2015 మే1 నాటికి పనులను పూర్తి చేయాలి. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నిర్మాణ సంస్థ మారిపోయింది. ద్వారాకామయి నుంచి ఎస్‌కేఎస్(శ్రీకృష్ణదేవరాయ కన్‌స్ట్రక్షన్స్)పనులను సబ్‌లీజుకు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

బలవంతంగా ఈ పనులను లాక్కున్నారనే ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. ఈ నిర్మాణ సంస్థ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత బంధువుకు చెందిన ఎల్.నారాయణ చౌదరికి చెందినది. ఇప్పటి వరకూ కేవలం 25 శాతం పనులను మాత్రమే పూర్తి చేశారు. దీనికి 2.5 కోట్ల రూపాయల బిల్లులు కూడా కాంట్రాక్టర్‌కు అందాయి.
 
ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యం ఇదిగో..
 రోడ్డు నిర్మాణ పనులు గతేడాది మేలో మొదలయ్యాయి. రోడ్డు నిర్మాణం కోసం ఘాట్‌ను దాదాపు 150 అడుగుల లోతుకు తవ్వారు. రోడ్డుపై నుంచి భారీ లోయను తలపించేలా ఉంటుంది. అప్రోచ్ రోడ్డు నిర్మించలేదు. లోయపక్కనే ఉన్న రోడ్డుపై వాహనాలు తిరిగేందుకు అనుమతించారు. కనీసం రోడ్డు పక్కన రక్షణ కోసం బండ రాళ్లు కూడా ఏర్పాటు చేయలేదు. 800 మీటర్ల పొడవున్న ఈ ఘాట్ రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. బోర్డులు ఏర్పాటు చేసేలా కాంట్రాక్టర్‌పై ఏ రోజు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఆర్‌అండ్‌బీ అధికారులు చేసినట్లు కన్పించలేదు.
 
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
  రోడ్డు నిర్మాణం చేపట్టిన వెంటనే అప్రోచ్ రోడ్డు నిర్మించాలి.
  రోడ్డుకు ఇరువైపులా ‘రోడ్డు నిర్మాణంలో ఉంది. జాగ్రత్తగా వెళ్లండి’అని రేడియం స్టిక్కర్‌తో కూడా బోర్డులు ఏర్పాటు చేయాలి. దారి మధ్యలో కూడా ప్రతి పదిమీటర్లకు ఒక బోర్డు ఏర్పాటు చేయాలి.
  రోడ్డుకు కుడివైపు తవ్వకం చేపట్టడంతో ఏర్పడిన భారీ లోయ ద్వారా ప్రమాదం జరగకుండా ప్రహరి గోడ నిర్మించాలి. కనీసం పెద్ద బండరాళ్లయినా పెట్టాలి.
  ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తే వెళ్లలేని పరిస్థితి. ఈ క్రమంలో ఒకేసారి రెండు వాహనాలు వెళ్లే విస్తీర్ణంలో రోడ్డు ఉండాలి.
  రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా నిర్మాణంలో ఉన్న రోడ్డు ప్రాంతంలో లైటింగ్ ఏర్పాటు చేయాలి.
  తవ్విన ప్రాంతం మొత్తం లూజ్ సాయిల్. ఇక్కడ బండరాయి పెట్టినా మట్టిపెళ్లలు కూలిపోయి కిందకు పడుతున్నాయి. ఇలాంటి రోడ్డుపై మోటార్ వాహనాలను అనుమతించకూడదు.
 
అక్కడ ఉన్న పరిస్థితి ఇదీ..
ఈ నిబంధనలన్నిటినీ కాంట్రాక్టర్ పట్టించుకోలేదు. తమ పనులకు అవసరం ఉన్నంత వరకూ రోడ్డును తవ్వేశారు. వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పూర్తిగా విస్మరించారు. ఒక వాహనం ముందు వెళుతుంటే పూర్తిగా దుమ్ములేచి వెనుక వాహనానికి దారి కూడా కన్పించని పరిస్థితి. ఈ క్రమంలోనే బుధవారం మడకశిర నుంచి వస్తున్న బస్సు ఆటోను దాటబోయి లోయలో పడింది. ప్రహారీ గోడ ఉన్నా సూచీ బోర్డులు, బారీకేడ్లు, కనీసం బండరాళ్లు అడ్డుపెట్టినా ఈ ప్రమాదం సంభవించి 15 మంది ప్రాణాలు గాల్లో కలిసేవి కాదు.
 
కాంట్రాక్టర్ ఊసెత్తని మంత్రులు
మంత్రులు శిద్ధారాఘవరావు, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతలు ప్రమాద కారణాలను పరిగణలోకి తీసుకోకుండా పూర్తి తప్పును డ్రైవర్‌పైకి నెట్టేసేలా మాట్లాడుతున్నారు. డ్రైవర్ మద్యం సేవించారని, అందుకే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఉదయం 6.30 గంటలకు డ్యూటీలో ఉన్న డ్రైవర్, అందులోనూ ఆర్టీసీ డ్రై =వర్ మద్యం సేవించే అవకాశం ఉందా? అనేది మంత్రులు ఆలోచించాల్సిన ప్రశ్న. పైగా వాహనాన్ని వే గంగా నడుపుతున్నారని కూడా అన్నారు. అయితే ఘాట్‌రోడ్డుకు ముందు తారురోడ్డుపై వాహనాన్ని వేగంగా నడిపారని, ఘాట్‌లో పూర్తిగా గుంతల రోడ్డు అని నెమ్మదిగానే వచ్చారని ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణీకులు చెబుతున్నారు.
 
ముందు చూపు కరువు
కొత్తరోడ్డు నిర్మించే సమయంలో ఎన్ని కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం చేపడుతున్నారో.. ఆమేరకు అప్రోచ్ రోడ్డును ముందుగా నిర్మించి ఆపై నిర్మాణ పనులకు ఉపక్రమించాలి. నేషనల్‌హైవే రోడ్ల నిర్మాణం ఈ ప్రాతిపదికనే జరుగుతుంది. అయితే ఆర్‌అండ్‌బీ మాత్రం ఇక్కడ అప్రోచ్‌రోడ్డుకు అనుమతి ఇవ్వలేదు. 800 మీటర్ల మేర అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి 70 లక్షల రూపాయల ఖర్చవుతుంది. అప్రోచ్ రోడ్డును నిర్మించి ఉంటే ప్రమాదం సంభవించేది కాదు.

రోడ్డు సేప్టీని ఏ మాత్రం పట్టించుకోని ఆర్టీసీ
రోడ్డు భద్రతా వారోత్సవాల పేరుతో హడావుడి చేస్తున్న ఆర్టీసీ ఏ రోడ్డు ప్రయాణానికి ప్రమాదకరం అనేది కూడా గ్రహించలేదు. ‘ఈరోడ్డు ప్రయాణానికి యోగ్యంగా లేదు? ప్రమాదం జరిగితే భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. ఈ రోడ్డుపై మేమే వెళ్లలేం’ అని ఆర్టీసీ అధికారులు ఈ రోడ్డుపై బస్సులను తిరగకుండా ఆపలేకపోయారు. ఇదేదారిలో పక్కనే పావుగడ రోడ్డు ద్వారా పెనుకొండ చేరుకోవచ్చు.

మహా అయితే 7కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. ఈపని కూడా చేయలేకపోయారు. పైగా ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఓవర్‌లోడుతో అదేదారిలో బస్సులను నడుపుతున్నారు. ఇలా మూడు శాఖలు కలిసి చేసిన నిర్లక్ష్యానికి 15 నిండుప్రాణాలు గాల్లోకలిశాయి. మరో 17 మందికి చేతులు, కాళ్లు, వెన్నుపూస విరిగి మృత్యువుతో పోరాడుతున్నారు.
 
తప్పు చేయని ఇంజనీర్‌పై చర్యలా?
పెనుకొండ:  బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఏమాత్రమూ తప్పు లేని ఇంజనీర్‌పై చర్యలు తీసుకోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.  ఘాట్ రోడ్డు పని ప్రారంభించినప్పటి నుంచి వేరే ఇంజనీర్ పర్యవేక్షణలో జరుగుతూ వచ్చింది. అయితే.. 25 రోజుల కిందట వచ్చిన ఇంజనీర్ నాగరాజును  సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి జేఈ నాగరాజుకు గతంలో ఉన్న ఇంజనీర్ ఇప్పటికీ బాధ్యతలు అప్పగించలేదు. ఎం.బుక్కు నమోదులో గానీ, ఇతర వ్యవహారాల్లో గానీ ఆయన జోక్యం ఏ మాత్రమూ లేదు. కేవలం పెనుకొండ జేఈ అన్న ఒకే ఒక్క కారణంగా సస్పెండ్  చేయడం ఏ మేరకు సబబని ఆ శాఖలోని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement