బిగుస్తున్న ఉచ్చు ! | Bigustunna trap! | Sakshi
Sakshi News home page

బిగుస్తున్న ఉచ్చు !

Published Thu, Jan 22 2015 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

బిగుస్తున్న ఉచ్చు !

బిగుస్తున్న ఉచ్చు !

సాక్షి ప్రతినిధి, అనంతపురం : పెనుకొండ ప్రమాదానికి కాంట్రాక్టర్ తప్పిదమే ప్రధాన కారణమని నివేదికలు తేల్చాయి. ప్రమాదంపై ఇప్పటి వరకు 9 విభాగాల నుంచి నివేదికలు సిద్ధమయ్యాయి. దాదాపు అన్ని నివేదిలకలూ కాంట్రాక్టర్ తప్పిదాన్ని సవివరంగా ఎత్తి చూపాయి. కాంట్రాక్టర్‌ను కాపాడేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి.

ఈ అంశంలో కోర్టులు కూడా నేరుగా ప్రశ్నించడంతో ఘటనకు బాధ్యులైన వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెనుకొండ-మడకశిర రోడ్డు మార్గంలో ఈనెల 7న ‘పల్లెవెలుగు’ బస్సు ప్రమాద ఘటనలో 16మంది చనిపోగా, మరో 60మంది గాయపడ్డారు. అందులో 35 మందికి తీవ్ర బిగుస్తున్న ఉచ్చు ! గాయాలయ్యాయి.

చనిపోయిన వారిలో 13 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తే...కాంట్రాక్టర్, ఆర్‌అండ్‌బీ, ఆర్టీసీ...వెరసి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో? ప్రజా జీవితాలపై ఎంత చిన్నచూపు ఉందో స్పష్టమవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత నిజానిజాలు ఏంటో తెలుసుకోకుండా రవాణ శాఖ మంత్రి శిద్ధారాఘరావు ‘డ్రైవర్ మద్యం తాగి బస్సు నడపడంతోనే ప్రమాదం జరిగింద’ని తీర్పు ఇవ్వడం, కాంట్రాక్టర్ తప్పిదంపై పల్లెత్తు మాట అనకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దీంతో ప్రజా, హక్కుల సంఘాలు జోక్యం చేసుకున్నాయి. చివరకు కోర్టులు కూడా సుమోటోగా కేసును స్వీకరించి బాధ్యులకు నోటీసులు జారీ చేశాయి.
 
ఇప్పటి వరకూ 9 విచారణ నివేదికలు
 ప్రమాదం జరిగినప్పటి నుండి ఇప్పటి దాకా ప్రభుత్వానికి, మానహక్కుల కమిషన్‌కు 9 నివేదికలు అందాయి. ఇందులో తొలుత జిల్లా రవాణశాఖ, ఆర్టీసీ, అర్‌అండ్‌బీ ప్రభుత్వానికి నివేదికలు పంపాయి. వీటితో పాటు పోలీసులు కూడా నివేదికను పంపారు. ఆపై న్యాయసేవాసదన్ కార్యదర్శి టీ.వీ సుబ్బారావు ఘటనపై విచారణ చేపట్టి మరో నివేదికను సిద్ధం చేశారు.

వీటితో పాటు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ, మానవ హక్కుల వేదిక, పౌరహక్కుల సంఘం, కుల నిర్మూలన పోరాట సమితి నేతలు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి ఓ నివేదికను రూపొందించి రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు నివేదించారు. దాదాపు అన్ని నివేదికల్లోనూ ప్రమాదానికి ప్రథమ కారణం కాంట్రాక్టరే అని తేల్చినట్లు తెలుస్తోంది.
 
క్షేత్రస్థాయిలో విచారణ
ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న వారితో పాటు మావటూరు, నాగలూరు, బండ్లపల్లి, ఇతర గ్రామాల్లోని బాధిత కుటుంబాలను కలిసి ఆయూ సంఘాల వారు వివరాలు సేకరించారు. ప్రమాదంపై సాంకేతిక అంశాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా మంత్రులు తప్పు డ్రైవర్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తేల్చారు. అగ్రిమెంట్‌లో సూచించిన నిబంధనలను కాంట్రాక్టర్ పాటించలేదని కూడా నివేదిలో పేర్కొన్నారు.

ప్రహారీగోడ, రేడియం స్టిక్కర్లు, అప్రోచ్ రోడ్డు, ఉన్న రోడ్డుకు రక్షణగా బండరాళ్లు, బారికేడ్లు ఉంచడంతో పాటు చాలా తప్పిదాలు కాంట్రాక్టర్ చేశాడని పేర్కొన్నారు. పనులు చేస్తోంది జిల్లాకు చెందిన ఓ మంత్రి బంధువులు కావడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా నిస్తేజంగా వ్యవహరించారన్నారు. అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదని ఈ తప్పులో వీరి బాధ్యత కూడా తీవ్రమైందని పేర్కొన్నారు.

కాంట్రాక్టర్‌ను తప్పించేందుకే అధికారులపై చర్యలు
ఘటనకు బాధ్యులను చేస్తూ ఆర్‌అండ్‌బీ ఏఈఈ, డీఈతో పాటు ఆర్టీసీ డీఎంపై సస్పెన్షన్ వేటు వేశారు. వాస్తవానికి ఈ ముగ్గురు నెలకిందట బాధ్యతలు తీసుకున్న అధికారులే. ఒకవేళ ఘటనకు బాధ్యులుగా తేల్చాల్సి వస్తే... ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారులు పనులు చేస్తున్న ప్రదేశాన్ని ఎందుకు సందర్శించలేదు? సందర్శిస్తే ఇప్పుడు కన్పిస్తున్న తప్పులు అప్పుడు ఎందుకు కన్పించలేదు? ఒకవేళ అధికారులను బాధ్యులను చేయాల్సి వస్తే కొత్తగా వచ్చిన వారిపై కాకుండా జిల్లా అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

బాధ్యులైన  వారిని వదిలి, కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆ ముగ్గురిని బలిచేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో కాంట్రాక్టర్, ఆర్‌అండ్‌బీ అధికారుల తప్పే ప్రధానం కాబట్టి, ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి బాధ్యులైన వారు ఎంతపెద్దవారైనా వదలకుండా చర్యలు తీసుకోవాలని నివేదికల్లో సూచించారు.
 
మంత్రి రక్షిస్తారనే ఆశతో..
ఈ ఘటనలో కాంట్రాక్టర్‌తో పాటు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, ఈఈలపై వేటు పడే సూచనలు కన్పిస్తున్నాయి. దీంతో వీరంతా ఈ ఘటనకు కింది స్థాయి అధికారులను బాధ్యులను చేసి తాము బయటపడేలా ప్రణాళిక రచించారు. దాన్ని జిల్లాలో ఓ మంత్రి కనుసన్నల్లో పక్కాగా అమలు చేస్తున్నారు. తమను ఎలాగైనా మంత్రి రక్షిస్తారనే ఆశతో ధైర్యంగా ఉన్నారు.
 
పరిహారంపై కూడా విమర్శలు
ప్రమాదంలో 16 మంది చనిపోతే అందులో 13 మంది ఇంటర్, డిగ్రీ విద్యార్థులు. భవిష్యత్తులో ఉద్యోగం సంపాదించి, కుటుంబానికి అండగా నిలేచేవారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని కూడా ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఇప్పటికే డిమాండ్ చేశారు. అలాగే ప్రజా సంఘాల నేతలు కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement