dead one
-
బిగుస్తున్న ఉచ్చు !
సాక్షి ప్రతినిధి, అనంతపురం : పెనుకొండ ప్రమాదానికి కాంట్రాక్టర్ తప్పిదమే ప్రధాన కారణమని నివేదికలు తేల్చాయి. ప్రమాదంపై ఇప్పటి వరకు 9 విభాగాల నుంచి నివేదికలు సిద్ధమయ్యాయి. దాదాపు అన్ని నివేదిలకలూ కాంట్రాక్టర్ తప్పిదాన్ని సవివరంగా ఎత్తి చూపాయి. కాంట్రాక్టర్‌ను కాపాడేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ అంశంలో కోర్టులు కూడా నేరుగా ప్రశ్నించడంతో ఘటనకు బాధ్యులైన వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెనుకొండ-మడకశిర రోడ్డు మార్గంలో ఈనెల 7న ‘పల్లెవెలుగు’ బస్సు ప్రమాద ఘటనలో 16మంది చనిపోగా, మరో 60మంది గాయపడ్డారు. అందులో 35 మందికి తీవ్ర బిగుస్తున్న ఉచ్చు ! గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో 13 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తే...కాంట్రాక్టర్, ఆర్అండ్బీ, ఆర్టీసీ...వెరసి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో? ప్రజా జీవితాలపై ఎంత చిన్నచూపు ఉందో స్పష్టమవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత నిజానిజాలు ఏంటో తెలుసుకోకుండా రవాణ శాఖ మంత్రి శిద్ధారాఘరావు ‘డ్రైవర్ మద్యం తాగి బస్సు నడపడంతోనే ప్రమాదం జరిగింద’ని తీర్పు ఇవ్వడం, కాంట్రాక్టర్ తప్పిదంపై పల్లెత్తు మాట అనకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దీంతో ప్రజా, హక్కుల సంఘాలు జోక్యం చేసుకున్నాయి. చివరకు కోర్టులు కూడా సుమోటోగా కేసును స్వీకరించి బాధ్యులకు నోటీసులు జారీ చేశాయి. ఇప్పటి వరకూ 9 విచారణ నివేదికలు ప్రమాదం జరిగినప్పటి నుండి ఇప్పటి దాకా ప్రభుత్వానికి, మానహక్కుల కమిషన్‌కు 9 నివేదికలు అందాయి. ఇందులో తొలుత జిల్లా రవాణశాఖ, ఆర్టీసీ, అర్అండ్బీ ప్రభుత్వానికి నివేదికలు పంపాయి. వీటితో పాటు పోలీసులు కూడా నివేదికను పంపారు. ఆపై న్యాయసేవాసదన్ కార్యదర్శి టీ.వీ సుబ్బారావు ఘటనపై విచారణ చేపట్టి మరో నివేదికను సిద్ధం చేశారు. వీటితో పాటు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ, మానవ హక్కుల వేదిక, పౌరహక్కుల సంఘం, కుల నిర్మూలన పోరాట సమితి నేతలు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి ఓ నివేదికను రూపొందించి రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు నివేదించారు. దాదాపు అన్ని నివేదికల్లోనూ ప్రమాదానికి ప్రథమ కారణం కాంట్రాక్టరే అని తేల్చినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో విచారణ ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న వారితో పాటు మావటూరు, నాగలూరు, బండ్లపల్లి, ఇతర గ్రామాల్లోని బాధిత కుటుంబాలను కలిసి ఆయూ సంఘాల వారు వివరాలు సేకరించారు. ప్రమాదంపై సాంకేతిక అంశాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా మంత్రులు తప్పు డ్రైవర్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తేల్చారు. అగ్రిమెంట్లో సూచించిన నిబంధనలను కాంట్రాక్టర్ పాటించలేదని కూడా నివేదిలో పేర్కొన్నారు. ప్రహారీగోడ, రేడియం స్టిక్కర్లు, అప్రోచ్ రోడ్డు, ఉన్న రోడ్డుకు రక్షణగా బండరాళ్లు, బారికేడ్లు ఉంచడంతో పాటు చాలా తప్పిదాలు కాంట్రాక్టర్ చేశాడని పేర్కొన్నారు. పనులు చేస్తోంది జిల్లాకు చెందిన ఓ మంత్రి బంధువులు కావడంతో ఆర్అండ్బీ అధికారులు కూడా నిస్తేజంగా వ్యవహరించారన్నారు. అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదని ఈ తప్పులో వీరి బాధ్యత కూడా తీవ్రమైందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్‌ను తప్పించేందుకే అధికారులపై చర్యలు ఘటనకు బాధ్యులను చేస్తూ ఆర్అండ్బీ ఏఈఈ, డీఈతో పాటు ఆర్టీసీ డీఎంపై సస్పెన్షన్ వేటు వేశారు. వాస్తవానికి ఈ ముగ్గురు నెలకిందట బాధ్యతలు తీసుకున్న అధికారులే. ఒకవేళ ఘటనకు బాధ్యులుగా తేల్చాల్సి వస్తే... ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారులు పనులు చేస్తున్న ప్రదేశాన్ని ఎందుకు సందర్శించలేదు? సందర్శిస్తే ఇప్పుడు కన్పిస్తున్న తప్పులు అప్పుడు ఎందుకు కన్పించలేదు? ఒకవేళ అధికారులను బాధ్యులను చేయాల్సి వస్తే కొత్తగా వచ్చిన వారిపై కాకుండా జిల్లా అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బాధ్యులైన వారిని వదిలి, కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆ ముగ్గురిని బలిచేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో కాంట్రాక్టర్, ఆర్అండ్బీ అధికారుల తప్పే ప్రధానం కాబట్టి, ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి బాధ్యులైన వారు ఎంతపెద్దవారైనా వదలకుండా చర్యలు తీసుకోవాలని నివేదికల్లో సూచించారు. మంత్రి రక్షిస్తారనే ఆశతో.. ఈ ఘటనలో కాంట్రాక్టర్‌తో పాటు ఆర్అండ్బీ ఎస్ఈ, ఈఈలపై వేటు పడే సూచనలు కన్పిస్తున్నాయి. దీంతో వీరంతా ఈ ఘటనకు కింది స్థాయి అధికారులను బాధ్యులను చేసి తాము బయటపడేలా ప్రణాళిక రచించారు. దాన్ని జిల్లాలో ఓ మంత్రి కనుసన్నల్లో పక్కాగా అమలు చేస్తున్నారు. తమను ఎలాగైనా మంత్రి రక్షిస్తారనే ఆశతో ధైర్యంగా ఉన్నారు. పరిహారంపై కూడా విమర్శలు ప్రమాదంలో 16 మంది చనిపోతే అందులో 13 మంది ఇంటర్, డిగ్రీ విద్యార్థులు. భవిష్యత్తులో ఉద్యోగం సంపాదించి, కుటుంబానికి అండగా నిలేచేవారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని కూడా ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఇప్పటికే డిమాండ్ చేశారు. అలాగే ప్రజా సంఘాల నేతలు కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. -
పెళ్లయిన ఏడు నెలలకే..
సైదాపురం: తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి ఆనందంగా ఉండాల్సిన ఆ యువతి పెళ్లయిన ఏడు నెలలకే కానరాని లోకాలకు వెళ్లిపోయింది. అనుమానాస్పద స్థితిలో మైకా మైన్ నీటిగుంతలో విగతజీవిగా తేలింది. అత్తింటి వారే చంపి గుంతలో పడేశారని మృతురాలి తండ్రి బోరున విలపిస్తున్నారు. ఈ ఘటన సైదాపురం మండలం ఊటుకూరు దళితవాడలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు...ఊటుకూరు చెందిన సాతులూరు ధనుంజయ కూలి పనులకెళ్లి జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె సురేఖ(21) అదే గ్రామానికి చెందిన బోయిన చిరంజీవి ప్రేమించుకున్నారు. చిరంజీవితో పెళ్లి కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోయినా సురేఖ తల్లిదండ్రులను ఒప్పించింది. అనంతరం పెద్దల సమక్షంలో ఈ ఏడాది మార్చిలో సైదాపురంలోని సాయిబాబా మందిరంలో పెళ్లి జరిగింది. కొద్దిరోజుల పాటు వీరికాపురం అన్యోన్యంగా సాగింది. కట్నం తేలేదని భర్తతో పాటు నరసయ్య, అత్త వెంకటమ్మ వేధించేవారు. రోజూ ఆమెను చిత్రహింసలు పెట్టేవారు. కట్నం తేకపోతే మరో పెళ్లి చేసుకుంటానని చిరంజీవి బెదిరించే వాడు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు పుట్టింటి దృష్టికి తెచ్చింది. పెళ్లయిన కొత్తలో సమస్యలే సాధారణమేనని, సర్దుకుంటాయని కుమార్తెకు వారు నచ్చజెప్పేవారు. అత్తింట్లో వేధింపులు మాత్రం కొనసాగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే సోమవారం ఆమె సిద్దలయ్యకోనకు వెళ్లి దైవదర్శనం చేసుకుని సంతోషంగా గడిపివచ్చింది. ఇంటికి చేరుకున్న తర్వాత ఏమైందో ఏమో రాత్రి 8 గంటల సమయంలో కాలనీకి సమీపంలోని మైకామైన్ గుంటలో విగతజీవిగా కనిపించింది. ఇది గుర్తించిన చిరంజీవి కుటుంబసభ్యులు గ్రామంలోనే ఉన్న ఆమె తల్లిదండ్రులకు తెలియజేయకుండా నెల్లూరులో ఉన్న తమ బంధువులకు సమాచారం ఇచ్చారు. తర్వాత విషయం తెలుసుకున్న సురేఖ తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. భర్త, అత్తమామలతో పాటు తోడికోడలు బోయిన మమత కలిసి తమ కుమార్తెను ఇంట్లోనే హత్య చేసి గుంతలో పడేశారని తండ్రి ధనుంజయ ఆరోపించారు. వీఆర్వో దీనదయాల్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏఎస్సై సురేంద్రబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం డీఎస్పీ శ్రీనివాస్, సీఐ మధుసూదన్ రావు గ్రామంలో విచారణ చేపట్టారు. -
వరకట్న దాహానికి వివాహిత బలి
మల్లవోలు(మాచవరం): అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారి వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఈ ఘటన మండలంలోని మల్లవోలు గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లవోలు గ్రామానికి చెందిన రామిశెట్టి ఏడుకొండలుకు గురజాల గ్రామానికి చెందిన భార్గవి ఉరఫ్ భ్రమరాంబ(27)తో ఏడేళ్ల కిందట పెళ్లయింది. వీరికి వర్షిణి(5), కీర్తన(1) ఇద్దరు ఆడపిల్లలు. భార్గవి ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంపై భర్త తరచూ గొడవ పడుతుండేవాడు. భార్యను పుట్టింటికి పంపగా పలుమార్లు పెద్దలు సర్దిచెప్పి భర్త వద్ద వదిలివెళ్లారు. దీంతోపాటుగా తరచూ అదనపు కట్నం కావాలని వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం పుట్టింకెళ్లి ద్విచక్రవాహనం కొనేందుకు డబ్బు తెమ్మని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఆమెపై చేయిచేసుకుని, కొద్దిసేపటి తర్వాత పొలానికి వెళ్లాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో కింద పడి ఉన్న భార్యను చూసి పిడుగురాళ్ళ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి తీసుకువచ్చారు. గురువారం ఉదయం అటుగా వెళ్లిన ఇరుగుపొరుగు వారికి విషయం తెలియడంతో గ్రామంలో ఉన్న భార్గవి బంధువులకు చెప్పారు. వారి ద్వారా ఫోన్లో కూతురు చనిపోయిందనే వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు అడపా వెంకటేశ్వర్లు, విజయభారతి, బంధువులు హుటాహుటిన మల్లవోలు గ్రామానికి చేరుకున్నారు. వారు రాగానే భర్త ఏడుకొండలు, అత్త సీతమ్మ, మామ ఆంజనేయులు అందరూ పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ ఆవుల హరిబాబు సంఘటన స్థలానికి చేరుకుని సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్నం వేధింపుల కింద కేసు నమోదు చేశారు. భార్గవి మృతితో ఇద్దరు కుమార్తెలు తల్లి లేని అనాథలుగా మిగిలారు. హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు.. తమ కుమార్తెను భర్త, అత్తమామలే కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. చనిపోయిన తర్వాత నోట్లో పురుగుమందు పోసి ఆత్మహత్యగా నమ్మించజూస్తున్నారని రోదించారు. కనీసం చనిపోయిన సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా పలుమార్లు అదనపు కట్నం కావాలని వేధించేవారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాలకు పంపించామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా భర్త కొట్టిన దెబ్బలకు చనిపోయిందా.. పురుగు మందు తాగి చనిపోయిందా అనే వివరాలు తెలుస్తాయనిఎస్ఐ పేర్కొన్నారు. సంఘటన స్థలానికి తహశీల్దార్ ఎస్వీ శ్రీనివాసులు చేరుకుని పంచనామా స్వీకరించారు. ఆయన వెంట ఆర్ఐ ఓంకార్, వీఆర్వోలు ఉన్నారు.