వరకట్న దాహానికి వివాహిత బలి
మల్లవోలు(మాచవరం):
అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారి వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఈ ఘటన మండలంలోని మల్లవోలు గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లవోలు గ్రామానికి చెందిన రామిశెట్టి ఏడుకొండలుకు గురజాల గ్రామానికి చెందిన భార్గవి ఉరఫ్ భ్రమరాంబ(27)తో ఏడేళ్ల కిందట పెళ్లయింది. వీరికి వర్షిణి(5), కీర్తన(1) ఇద్దరు ఆడపిల్లలు. భార్గవి ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంపై భర్త తరచూ గొడవ పడుతుండేవాడు.
భార్యను పుట్టింటికి పంపగా పలుమార్లు పెద్దలు సర్దిచెప్పి భర్త వద్ద వదిలివెళ్లారు. దీంతోపాటుగా తరచూ అదనపు కట్నం కావాలని వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం పుట్టింకెళ్లి ద్విచక్రవాహనం కొనేందుకు డబ్బు తెమ్మని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఆమెపై చేయిచేసుకుని, కొద్దిసేపటి తర్వాత పొలానికి వెళ్లాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో కింద పడి ఉన్న భార్యను చూసి పిడుగురాళ్ళ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి తీసుకువచ్చారు. గురువారం ఉదయం అటుగా వెళ్లిన ఇరుగుపొరుగు వారికి విషయం తెలియడంతో గ్రామంలో ఉన్న భార్గవి బంధువులకు చెప్పారు. వారి ద్వారా ఫోన్‌లో కూతురు చనిపోయిందనే వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు అడపా వెంకటేశ్వర్లు, విజయభారతి, బంధువులు హుటాహుటిన మల్లవోలు గ్రామానికి చేరుకున్నారు. వారు రాగానే భర్త ఏడుకొండలు, అత్త సీతమ్మ, మామ ఆంజనేయులు అందరూ పరారయ్యారు.
సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ ఆవుల హరిబాబు సంఘటన స్థలానికి చేరుకుని సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్నం వేధింపుల కింద కేసు నమోదు చేశారు. భార్గవి మృతితో ఇద్దరు కుమార్తెలు తల్లి లేని అనాథలుగా మిగిలారు.
హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు..
తమ కుమార్తెను భర్త, అత్తమామలే కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. చనిపోయిన తర్వాత నోట్లో పురుగుమందు పోసి ఆత్మహత్యగా నమ్మించజూస్తున్నారని రోదించారు. కనీసం చనిపోయిన సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా పలుమార్లు అదనపు కట్నం కావాలని వేధించేవారన్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాలకు పంపించామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా భర్త కొట్టిన దెబ్బలకు చనిపోయిందా.. పురుగు మందు తాగి చనిపోయిందా అనే వివరాలు తెలుస్తాయనిఎస్‌ఐ పేర్కొన్నారు. సంఘటన స్థలానికి తహశీల్దార్ ఎస్‌వీ శ్రీనివాసులు చేరుకుని పంచనామా స్వీకరించారు. ఆయన వెంట ఆర్‌ఐ ఓంకార్, వీఆర్వోలు ఉన్నారు.