కట్న దాహానికి వివాహిత బలి
బషీరాబాద్, న్యూస్‌లైన్:
కట్న దాహం ఓ వివాహితను బలితీసుకుంది. అత్తింటి వేధింపులు భరించలేని మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువులు ఆమె భర్తను వెంటాడి దాడి చేశారు. ఈ సంఘటన ఆదివారం బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ లకా్ష్మరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఈర్లపల్లి చిన్న ముత్యప్ప తొమ్మిదేళ్ల క్రితం యాలాల మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన గొట్లపల్లి బిచ్చప్ప, నర్సమ్మ దంపతుల కూతురు లక్ష్మి(30)ని వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు నవనీత(6), కొడుకు మునీంద్రా (4) ఉన్నారు. దంపతులు స్థానికంగా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదనపు కట్నం తీసుకురావాలని లక్ష్మిని కొంతకాలంగా భర్త చిన్నముత్యప్పతో పాటు ఆడపడచులు వెంకటమ్మ, భీమమ్మలు వేధించసాగారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను తాండూరులోని ప్రభుత్వం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో లక్ష్మి మధ్యాహ్నం మృతిచెందింది.
పరుగెత్తించి.. దేహశుద్ధి..
పురుగుమందు తాగిన లక్ష్మి మృతిచెందిందనే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు తాండూరు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. వారిని గమనించిన చిన్నముత్యప్ప పరుగులు తీశాడు. అతడిని వెంబడించిన దాదాపు కిలోమీటర్ దూరంలో సాయిపూర్ ప్రాంతంలో పట్టుకున్నారు. కొట్టుకుంటూ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే చిన్నముత్యప్ప సోదరి భీమమ్మ కూడా అక్కడికి చేరుకుంది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన లక్ష్మి బంధువులు ఇద్దరిని కలిపి చితకబాదారు. ఆస్పత్రికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న తాండూరు పోలీసులు అక్కడికి చేరుకొని చిన్నముత్యప్పతో పాటు భీమమ్మను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. మృతురాలి సోదరుడు మొగులప్ప ఫిర్యాదు మేరకు బషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.