సైదాపురం: తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి ఆనందంగా ఉండాల్సిన ఆ యువతి పెళ్లయిన ఏడు నెలలకే కానరాని లోకాలకు వెళ్లిపోయింది. అనుమానాస్పద స్థితిలో మైకా మైన్ నీటిగుంతలో విగతజీవిగా తేలింది. అత్తింటి వారే చంపి గుంతలో పడేశారని మృతురాలి తండ్రి బోరున విలపిస్తున్నారు. ఈ ఘటన సైదాపురం మండలం ఊటుకూరు దళితవాడలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు...ఊటుకూరు చెందిన సాతులూరు ధనుంజయ కూలి పనులకెళ్లి జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె సురేఖ(21) అదే గ్రామానికి చెందిన బోయిన చిరంజీవి ప్రేమించుకున్నారు. చిరంజీవితో పెళ్లి కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోయినా సురేఖ తల్లిదండ్రులను ఒప్పించింది. అనంతరం పెద్దల సమక్షంలో ఈ ఏడాది మార్చిలో సైదాపురంలోని సాయిబాబా మందిరంలో పెళ్లి జరిగింది. కొద్దిరోజుల పాటు వీరికాపురం అన్యోన్యంగా సాగింది.
కట్నం తేలేదని భర్తతో పాటు నరసయ్య, అత్త వెంకటమ్మ వేధించేవారు. రోజూ ఆమెను చిత్రహింసలు పెట్టేవారు. కట్నం తేకపోతే మరో పెళ్లి చేసుకుంటానని చిరంజీవి బెదిరించే వాడు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు పుట్టింటి దృష్టికి తెచ్చింది. పెళ్లయిన కొత్తలో సమస్యలే సాధారణమేనని, సర్దుకుంటాయని కుమార్తెకు వారు నచ్చజెప్పేవారు. అత్తింట్లో వేధింపులు మాత్రం కొనసాగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే సోమవారం ఆమె సిద్దలయ్యకోనకు వెళ్లి దైవదర్శనం చేసుకుని సంతోషంగా గడిపివచ్చింది.
ఇంటికి చేరుకున్న తర్వాత ఏమైందో ఏమో రాత్రి 8 గంటల సమయంలో కాలనీకి సమీపంలోని మైకామైన్ గుంటలో విగతజీవిగా కనిపించింది. ఇది గుర్తించిన చిరంజీవి కుటుంబసభ్యులు గ్రామంలోనే ఉన్న ఆమె తల్లిదండ్రులకు తెలియజేయకుండా నెల్లూరులో ఉన్న తమ బంధువులకు సమాచారం ఇచ్చారు. తర్వాత విషయం తెలుసుకున్న సురేఖ తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. భర్త, అత్తమామలతో పాటు తోడికోడలు బోయిన మమత కలిసి తమ కుమార్తెను ఇంట్లోనే హత్య చేసి గుంతలో పడేశారని తండ్రి ధనుంజయ ఆరోపించారు.
వీఆర్వో దీనదయాల్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏఎస్సై సురేంద్రబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం డీఎస్పీ శ్రీనివాస్, సీఐ మధుసూదన్ రావు గ్రామంలో విచారణ చేపట్టారు.
పెళ్లయిన ఏడు నెలలకే..
Published Wed, Nov 12 2014 2:03 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement