లక్కవరపుకోట: మండలంలోని గోల్డ్‌స్టార్ జంక్షన్ నుంచి గేదులవానిపాలెం గ్రామం వెళ్లే రహదారిలో జమ్మాదేవిపేట సమీపంలో గల సరస్వతి లేఆవుట్ వద్ద కళ్లేపల్లి గ్రామానికి చెందిన వెలుగులో బుక్ కీపర్ గోకేడ ఉమామహేశ్వరి(29) అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. గురువారం వెలుగుచూసిన ఈ విషయం తెలుసుకున్న మండల వాసులు ఒక్కసారిగా ఉల్కిపడ్డారు. స్థానికులు, ఎస్సై ముకుందరావు తెలియజేసిన మేరకు వివరాలిలా ఉన్నాయి. సరస్వతి లేఅవుట్ సమీపంలో చిలకావాని చెరువులో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు.
వారిలో ఒక కూలీ సేద తీరేందుకు పక్కనే గల గట్టువద్దకు వచ్చి నిలబడి సమీపంలో మృతదేహాన్ని గుర్తించి తోటి కూలీలకు తెలిపాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి డీఎస్సీ ఆర్.గోవిందరావు, ఎస్సై ముకుందరావులు సిబ్బందితో చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహం ఫొటోను వాట్సాప్ గ్రూప్‌లో సెండ్ చేయుగా కళ్లేపల్లి గ్రామానికి చెందిన గోకేడ ఉమామహేశ్వరిగా కొంతమంది గుర్తించారు. వెంటనే మృతురాలి కుటుంబసభ్యులకు విషయం చేరవేయగా వారు ఘటనా స్థలానికి చేరుకుని ఉమామహేశ్వరిగా గుర్తించారు.
ఇదిలా ఉండగా విజయనగరం జిల్లా కేంద్రంలో వెలుగు ఆధ్వర్యంలో సమావేశం ఉందని ఉమామహేశ్వరి బుధవారం ఉదయం 9 గంటలకే ఇంటి నుంచి బయల్దేరి వెళ్లింది. రాత్రికి ఇంటికి రాకపోవడంతో ఆరా తీయగా ఆమె సమావేశానికి హాజరుకాలేదని అధికారులు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమైన తరువాత ఆమెను ఎక్కడో చంపేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉంటారని పోలీసులు భావించారు. క్లూస్ టీమ్, డాగ్‌స్వాడ్‌లు వచ్ఛి పరిసర ప్రాంతాల్లో పరిశీలించినప్పటికీ ఎటవంటి ఆధారాలు లభించేలేదు. మృతురాలి భర్త నాయుడు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు.
బిక్కుబిక్కుమంటూ ఇద్దరు పిల్లలు
కాగా మృతురాలికి నవనీత్ (13),సాద్విక్ (12) ఇద్దరు మగ పిల్లలు కలరు. మా అమ్మ విజయనగరం మీటింగ్‌కు వెళ్లింది తిరిగి వస్తుందని చెప్పడంతో అక్కడ ఉన్న వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ ఈ తరహా ఘటనలు జరగకపోవడంతో మండలవాసులు భయభ్రాంతులకు లోనయ్యారు. పోలీసులు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు.
విజయనగరం ఫోర్ట్: విద్యుత్ షాక్‌తో ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. నగరంలోని కేఎల్‌పురంలో ఓ ఇంటికి విద్యుత్ సరఫరా వచ్చి పోతుండడంతో యాజమాని పక్క వీధిలో ఉన్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ టెక్కలి అప్పలరాజు (40)ను తీసుకొచ్చాడు. అక్కడ మూడు విద్యుత్ ట్రాన్సఫార్మర్లు ఉండగా ఆపాల్సిన ట్రాన్సఫార్మర్ కాకుండా వేరే ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ సరఫరా నిలిపివేసి విద్యుత్ పోల్ ఎక్కడంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించగా షాక్‌కు గురై కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. వెంటనే గృహ యజమాని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం కేజీహెచ్‌కు తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. విద్యుత్ పోల్ ఎక్కిన ఎలక్ట్రీషియన్ విద్యుత్‌శాఖకు సంబంధించిన వ్యక్తి కాదని ఎస్‌ఈ నాగేశ్వరావు తెలిపారు. అనధికారిగా విద్యుత్ పోల్ ఎక్కితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ సమస్యల నివారణ కోసం 1912 ట్రోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
గుర్తు తెలియని యువకుడు..
గజపతినగరం: గజపతినగరం రైల్వే స్టేషన్ యార్డులో గుర్తు తెలియని యువకుడు(23)మృతి చెందాడు. ఈ ఘటనపై విజయనగరం రైల్వే ఎస్సై వి.రవివర్మ మాట్లాడుతూ అనారోగ్యం వల్ల గానీ, వడదెబ్బ వల్ల గాని మృతి చెంది ఉండవచ్చన్నారు. మృతుడి శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
బొబ్బిలి: గరుగుబిల్లి మండలం నాగూరుకు చెందిన అక్కేన తవిటినాయుడు(53) ఈనెల 9న తెర్లాం మండలం నందబలగ వెళ్లి వస్తుండగా కారాడ వద్ద కోళ్లవ్యాన్ ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యాడు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్టు ఎస్సై చదలవాడ సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment