అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ఆత్మకూరు రూరల్: జీవితంపై కోటి ఆశలతో అత్తింట అడుగుపెట్టిన ఆ యువతికి ఐదు నెలలకే నూరేళ్లు నిండాయి. తక్కువ ఎత్తులోని కిటికీ గ్రిల్స్‌కు బిగించిన చున్నీకి వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు చెబుతుండగా భర్తే చంపేశాడని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఈ ఘటన ఆత్మకూరు మండలంలోని వాశిలిలో గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు..కలిగిరి మండలం పెదపాడుకు చెందిన మద్దినేని వెంకటేశ్వర్లు, విజయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె లక్ష్మికి(20) ఈ ఏడాది జూన్‌లో వాశిలికి చెందిన సుంకర హనుమంతరావుతో పెంచలకోనలో పెళ్లి చేశారు. అప్పటికే మేనత్త కూతురిని వివాహం చేసుకున్న హనుమంతరావు ఆమెతో విబేధాలు తలెత్తి విడిపోవడంతో లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు.
అయితే అత్తగారింట అడుగుపెట్టినప్పటి నుంచి లక్ష్మికి వేధింపులు మొదలయ్యాయి. హనుమంతరావు తన తల్లిదండ్రులు పెంచలయ్య, సరోజనమ్మతో కలిసి లక్ష్మిని వేధించేవాడు. భార్యతో సఖ్యతగా మెలిగేవాడు కాదు. బంధువుల ఇళ్లకు వెళ్లకుండా ఆంక్షలు పెట్టేవాడు. ఈ విషయాల్ని లక్ష్మి పలుమార్లు తన సోదరి స్వప్నకు ఫోన్‌లో తెలిపి బోరుమంది. స్వప్న విషయాలను తన తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడకు వెళ్లి మాట్లాడదామని సర్దిచెప్పారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి లక్ష్మికి బాగలేదంటూ హనుమంతరావు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు.
వారు గురువారం తెల్లవారుజామున ఇంటికి చేరుకునేసరికి లక్ష్మి తక్కువ ఎత్తులో ఉరికివేలాడుతూ నేలకు ఆనుకుని ఉంది. తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని కన్నీరుమున్నీరయ్యారు. హనుమంతరావే లక్ష్మిని హతమార్చాడాని స్వప్న బోరుమంది. సమాచారం అందుకున్న ఎస్సై జి.వేణుగోపాల్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తహశీల్దార్ బీకే వెంకటేశ్వర్లు పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హనుమంతరావు పరారవగా అతడి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.