చిత్తూరు , తిరుపతి (అలిపిరి) : సార్వత్రిక ఎన్నికలు–2019కి జిల్లా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే 14 నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేశారు. పోలింగ్ సమయంలో ఓటర్లు వడదెబ్బకు గురైనా, ఇతర కారణాలతో ఇబ్బందులు తలెత్తినా తక్షణం వైద్య సేవలందించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల ఏర్పాటుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ విధులకు వైద్యులు, సిబ్బంది జాబితాను ఖరారు చేసింది. అల్లోపతి వైద్యుల స్థానంలో ఆయుష్ వైద్యులకు నియమించింది. అత్యవసర వైద్యం అందించేందుకు మెడికోలు, హౌస్‌సర్జన్ వైద్య విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని పేర్కొనడం విశేషం! ఈనెల 10, 11 తేదీల్లో వైద్యులకు సెలవులు ఉండబోవని వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలో 3,820 పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 11న ఎన్నికలు నిర్వహించనుండటం విదితమే.ఈ కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఏర్పాటు చేయడంలో భాగంగా వైద్యులు, సిబ్బందికి విధులు కేటాయించింది. పారామెడికల్, ఆయుష్, 104 సర్వీస్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, మెడికోలు, హౌస్‌సర్జన్ల సేవలను ఇందుకు వినియోగించుకోనుంది. అయితే అల్లోపతి వైద్యులకు మాత్రం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో విధులు నామమాత్రంగా కేటాయించినట్లు తెలుస్తోంది. అత్యవసర వైద్య సేవలకు దూరంగా ఉంటున్న ఆయుష్ వైద్యులను పోలింగ్ కేంద్రాల ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో విధులను కేటాయించడం విమర్శలకు తావిస్తోంది.
అల్లోపతి వైద్యుల్లో అసంతృప్తి
ఎన్నికల విధులకు ఆయుష్ వైద్యులను నియమించడంపై అల్లోపతి వైద్యుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైద్య విద్యను అభ్యసించే వారిని వినియోగించుకోవడం మినహా అల్లోపతి వైద్యులను ఫస్ట్ ఎయిడ్ సెంటర్లకు దూరం చేశారనే విమర్శలు వస్తున్నాత్తాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తీరుపై వారు పెదవి విరుస్తున్నారు.
మెడికల్ ఆఫీసర్లదే బాధ్యత
పోలింగ్ కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లను సరఫరా చేసే బాధ్యతను ఆయా కేంద్రాల్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ల మెడికల్ ఆఫీసర్లు బాధ్యత వహించాల్సి ఉంది. జిల్లాలోని 121 ఆస్పత్రుల పరిధిలో ఈనెల 10న అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి. మెడికల్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాల ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో మందుల అందుబాటులో ఉన్నాయా, లేవా? అన్నది సరి చూసుకోవాల్సిన ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లకు అవసరమైన మందుల కోసం సెంట్రల్, డిస్టిక్ డ్రగ్ స్టోర్లకు, వైద్య శాఖకు ఇప్పటికే ఇండెంట్ పెట్టారు.
10, 11న వైద్యులకు సెలవు లేదు
ఈనెల 10, 11 తేదీల్లో వైద్యులకు సెలవులను నిరాకరించారు. వైద్యులకు కేటాయించిన కేంద్రాల వద్దకు చేరుకోవడానికి వైద్య శాఖ రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేదు. వైద్యులు, ఇతర సిబ్బంది వారి వారి సొంత ఖర్చులతో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాల్సి ఉంది.
వాళ్లంతా హై క్వాలిఫైడ్ వైద్యులు
ఆయుష్ శాఖ వైద్యులు అత్యవసర వైద్యాన్ని అందించగలరు. వారు హై క్వాలిఫైడ్ డాక్టర్లు. ఇందులో అనుమానం లేదు. ఫస్ట్ ఎయిడ్ కేంద్రాల విధులను అత్యంత జాగ్రత్తగా కేటాయించాం. ప్రజలకు చిన్నపాటి ఇబ్బంది తలెత్తినా వైద్యులు అందుబాటులో ఉంటారు.– డాక్టర్ రామగిడ్డయ్య,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment