తోటపల్లిగూడూరు: అన్నదాతకు కనీస మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. నిర్దేశిత నాణ్యతా ప్రమాణాల పేరుతో ప్రభుత్వం బిగించిన నిబంధనాల ఉచ్చులో రైతన్నలు విలవిల లాడిపోతున్నారు. విసిగిపోయిన అన్నదాతలు కల్లాల్లోనే ధాన్యాన్ని తక్కువ ధరకే దళారులకు అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది. రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం జిల్లాలో 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అధికారులు ప్రస్తుతానికి 109 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి ప్రభుత్వ గిట్టుబాటు ధర పొందాలంటూ అధికారులు జిల్లా రైతాంగానికి ఉచిత సలహాలు, పత్రికా ప్రకటనలు ఇచ్చారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,400, పుట్టి(850కేజీలు)కి రూ.11,900, సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కురూ.1,360, పుట్టికి రూ.11,560గా ప్రభుత్వం మద్దతుధర ప్రకటించింది. ఈ మద్దతు ధరను పొందాలంటే ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండాలంటూ అధికారులు పెట్టిన నిబంధనలు రైతులకు తలనొప్పిగా మారాయి.
నిబంధనలు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ 17 శాతం లోపు ఉండాలని, దుమ్ము, ధూళి, మట్టి, రాళ్లు, చెత్త, తాలు 1 శాతానికి మించకూడదని, దెబ్బతిన్న, రంగుమారిన, చెడిపోయిన, మొలకెత్తిన, పురుగులు పట్టిన ధాన్యం 5 శాతంలోపు ఉండాలని షరతులు విధించారు. అలాగే పరిపక్వానికి రాని, కుచించుకుపోయిన, వంకరపోయిన ధాన్యం 3 శాతానికి మించరాదని, కల్తీ, కేళి ఇతర తక్కువ రకాల ధాన్యం 6 శాతంలోపు ఉండాలని నిబంధన.
సాధారణంగా శాంపిల్స్ ప్రక్రియలో ఆయా ప్రమాణాల్లో తేడా ఉంటే ఆ మేరకు ధర తగ్గించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. ఈ ప్రమాణాలు పాటించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే రైతులకు మిగిలేది ఏమీ ఉండదు. ఇలా నిబంధనల చట్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పోల్చుకుంటే దళారులకు అమ్మడం మేలనీ రైతులు భావిస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో దళారుల చెప్పిన ధరకే రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం దళారులు పుట్టికి రూ.10,500కు మించి కొనుగోలు చేయడం లేదు.
15 రోజుల్లో 834 పుట్లే కొనుగోలు!
ప్రస్తుత సీజన్ రబీలో జిల్లావ్యాప్తంగా 10 నుంచి 12 లక్షల పుట్ల ధాన్యం వస్తుందని ఓ అంచనా. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా 150 కొనుగోలుకేంద్రాల ద్వారా 1,21,990 మెట్రిక్ టన్నుల(1,43,528 పుట్లు) ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం వరికోతలు ప్రారంభమైన పదిహేనురోజుల్లో రెండు లక్షల పుట్లకుపైగా బయటకు వచ్చింది. కాగా ఇప్పటివరకు 109 కేంద్రాలను ప్రారంభించిన అధికారులు ప్రస్తుతానికి నేరుగా కొనుగోలు చేసిన ధాన్యం 834 పుట్లు(709 మెట్రిక్ టన్నులు మాత్రమే.
మిల్లర్ల ద్వారా మరో 12,523 మెట్రిక్ టన్నుల(14,732 పుట్లు)ను కొనుగోలు చేశారు. ప్రారంభించిన 109 కొనుగోలు కేంద్రాల్లో 90 శాతం కేంద్రాల్లో ఇప్పటికీ గింజ కూడా చేరని పరిస్థితి. బయటకు వచ్చిన రెండ లక్షల పుట్లలో అధికారులు కొనుగోలు కేంద్రాల ద్వారా 834 పుట్లను కొనుగోలు చేశారంటే ప్రభుత్వ నిబంధనలు ఏ మేరకు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అధికారులు లేనిపోని సాకులు చూపుతూ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని స్థానిక రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. అడ్డమైన నిబంధనలు రైతు మెడకు చుట్టిన ప్రభుత్వం పునరాలోచించి వాటిని సడలిస్తేనే కొనుగోలు కేంద్రాలు ధాన్యపురాసులతో కళకళలాడుతాయి.
ధాన్యం కొనుగోలుకు ని‘బంధనాలు’
Published Mon, Mar 16 2015 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM
Advertisement
Advertisement