శ్రీకాకుళం, ఆమదాలవలస: వేసవి ప్రారంభానికి ముందే భానుడు భగ్గుమంటున్నాడు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. దీంతో ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉంటుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితికి కారణాలపై ఆమదాలవలస కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథం ‘సాక్షి’తో బుధవారం మాట్లాడుతూ.. మేఘాలతోపాటు పవనాలు లేకపోవడమేనని వివరించారు. మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయన్నారు. 19న 32 డిగ్రీలు, 20న 33, బుధవారం 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించారు. రాత్రి వేళల్లో 14 నుంచి 16 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు.
పగటిపూట కంటే రాత్రి వేళ ఉష్టోగ్రతల్లో సగం కంటే ఎక్కువ వ్యత్యాసం ఉందన్నారు. దీనికి మేఘాల్లేకపోవడంతో పాటు పవనాలు వీయకపోవడం కూడా కారణంగా విశ్లేషించారు. ఇలాంటి పరిస్థితిలో పగటి పూట ఎండలు ఎక్కువగా ఉంటాయని, రాత్రి పూట చలి కూడా ఉంటుందన్నారు. మేఘాలు, పవనాలు లేని కారణంగా పొగమంచు కూడా కురుస్తోందని, దీంతో మామిడి, జీడిమామిడిలతోపాటు పలు పంటలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. పొగ నుంచి పంటలకు సోకుతున్న తెగుళ్లను రక్షించుకోవడానికి యాజమాన్య పద్ధతుల్లో తగిన మందులను వినియోగించాలని రైతులకు సూచించారు.
కాగా వాతావరణంలో మార్పుల కారణంగా పొడి వాతావరణం తేమగా ఉంటుందని.. ఉదయం 6 గంటల సమయంలో 87 శాతం ఉన్నటువంటి తేమ సాయంత్రానికి 23 శాతానికి చేరుకుంటోందన్నారు. అతి నీలలోహిత కిరణాలు తాలూకా ప్రభావం అతిఎక్కువుగా 12 పాయింట్ల వరకు ఉంటోందని, వాస్తవంగా 6 నుంచి 7 పాయింట్ల వరకు ఉండాలన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేకపోవడంతో ఎండ తీవ్రత ఎక్కువుగా ఉంటుందన్నారు. ఇలాంటి ఎండలో తిరిగే వారికి చర్మవ్యాధులు, మంచులో తిరిగే వారికి వివిధ రకాల వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇదే వాతావరణం మరికొద్ది రోజులు కొనసాగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment