HEAT CLIMATE
-
నిప్పుల కుంపటిలా తెలంగాణ
-
భద్రం.. ఈసారి ఎండలు దంచుడే దంచుడు
సాక్షి, హైదరాబాద్: ఈ వేసవిలో ఉష్ణ తీవ్రత అప్పుడే మొదలుకాగా మున్ముందు వడగాడ్పులు సైతం ప్రతాపాన్ని చూపనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్, మేలలో వడగాడ్పులు తీవ్ర స్థాయి నుంచి అతితీవ్ర స్థాయిలో వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఎండలు సాధారణం కంటే ఒక డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదు కావొచ్చని తెలిపింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించింది. మొదటి వారంలోనే 40 డిగ్రీలకు చేరువగా... సాధారణంగా మార్చిలో వేసవి ప్రారంభమైనప్ప టికీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. ఈ సారి సూర్యప్రతాపం మార్చి తొలి వారంలోనే మొదలైంది. గతేడాది మార్చి నెల మొదటి వారంలో 35.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా ఈసారి ఇప్పటికే భద్రాచలంలో 39.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. మరో 4-5 రోజులపాటు ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఒక ట్రెండు డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతాయని, మార్చి మూడో వారం నుంచి ఉష్ణోగ్రతల్లో తేడా కనిపిస్తుందని వాతావరణ శాఖ వివరించింది. ఏప్రిల్, మేలలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వడగాడ్పుల నుంచి అతి తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారి నాగరత్న ‘సాక్షి’కి వివరించారు. రాష్ట్రం లోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో ఆది, సోమవారాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ బులెటిన్లో తెలిపింది. -
భగ్గుమంటున్న భానుడు!
శ్రీకాకుళం, ఆమదాలవలస: వేసవి ప్రారంభానికి ముందే భానుడు భగ్గుమంటున్నాడు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. దీంతో ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉంటుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితికి కారణాలపై ఆమదాలవలస కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథం ‘సాక్షి’తో బుధవారం మాట్లాడుతూ.. మేఘాలతోపాటు పవనాలు లేకపోవడమేనని వివరించారు. మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయన్నారు. 19న 32 డిగ్రీలు, 20న 33, బుధవారం 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించారు. రాత్రి వేళల్లో 14 నుంచి 16 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. పగటిపూట కంటే రాత్రి వేళ ఉష్టోగ్రతల్లో సగం కంటే ఎక్కువ వ్యత్యాసం ఉందన్నారు. దీనికి మేఘాల్లేకపోవడంతో పాటు పవనాలు వీయకపోవడం కూడా కారణంగా విశ్లేషించారు. ఇలాంటి పరిస్థితిలో పగటి పూట ఎండలు ఎక్కువగా ఉంటాయని, రాత్రి పూట చలి కూడా ఉంటుందన్నారు. మేఘాలు, పవనాలు లేని కారణంగా పొగమంచు కూడా కురుస్తోందని, దీంతో మామిడి, జీడిమామిడిలతోపాటు పలు పంటలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. పొగ నుంచి పంటలకు సోకుతున్న తెగుళ్లను రక్షించుకోవడానికి యాజమాన్య పద్ధతుల్లో తగిన మందులను వినియోగించాలని రైతులకు సూచించారు. కాగా వాతావరణంలో మార్పుల కారణంగా పొడి వాతావరణం తేమగా ఉంటుందని.. ఉదయం 6 గంటల సమయంలో 87 శాతం ఉన్నటువంటి తేమ సాయంత్రానికి 23 శాతానికి చేరుకుంటోందన్నారు. అతి నీలలోహిత కిరణాలు తాలూకా ప్రభావం అతిఎక్కువుగా 12 పాయింట్ల వరకు ఉంటోందని, వాస్తవంగా 6 నుంచి 7 పాయింట్ల వరకు ఉండాలన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేకపోవడంతో ఎండ తీవ్రత ఎక్కువుగా ఉంటుందన్నారు. ఇలాంటి ఎండలో తిరిగే వారికి చర్మవ్యాధులు, మంచులో తిరిగే వారికి వివిధ రకాల వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇదే వాతావరణం మరికొద్ది రోజులు కొనసాగుతోందన్నారు. -
ఏమిటీ ‘శిక్ష’ణ!
ఉండి : జిల్లాలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ తరగతులు తమకు శిక్షగా మారాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి జిల్లాలో మండలాల వారీగా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు తమ పాలిట శాపంగా మారాయంటూ వాపోతున్నారు. తరగతులు ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కావడం వరకు బాగానే ఉన్నా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇళ్లకు వెళ్ళాలంటే ప్రాణం పోయేలా ఉంటోందంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నందున ఈ శిక్షణ తరగతులను వాయిదా వేయాలని కోరినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని రావద్దని చెబుతున్న వైద్యుల సలహాలను, కలెక్టర్ ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. బెంబేలెత్తుతున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల్లో చాలా మంది బీపీ, సుగర్, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారు. తీవ్రమైన ఎండల్లో సుమారు 20 కి.మీ ప్రయాణించి శిక్షణ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఉండి మండలంలోని ఉండి జెడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం తొలిరోజునే ఉప్పులూరు మెయిన్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సరసా సత్యనారాయణ వడదెబ్బకు ప్రాణాపాయ స్థితికి చేరారు. వెంటనే దగ్గరలోని మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో శిక్షణ తరగతిలోనే కళ్ళుతిరిగిపడిపోయారు. దాంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. శిక్షణా కార్యక్రమం ముగిసిన అనంతరం ఇళ్లకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసే ముందు వాతావరణాన్ని కూడా అంచనా వేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇవీ శిక్షణ మండలాలు ఉండి, ద్వారకాతిరుమల, కామవరపుకోట, వీరవాసరం, మోగల్తూరు, నిడదవోలు, తాళ్లపూడి, పెనుమంట్ర, పోలవరం, ఇరగవరం, పెనుగొండ, ఛాగల్లు మండలాల్లో సుమారు మండలానికి 100 నుంచి 150 మంది ఉపాధ్యాయులు ఈ శిక్షణ శిబిరాలకు హాజరవుతున్నారు. వచ్చే నెలకు మార్చాలి మండుటెండల్లో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం దారుణం. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని వడగాల్పుల్లో ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి ప్రాణాల మీదకు తెస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి వచ్చే నెలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తే మంచిది. - గాదిరాజు రంగరాజు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, చెరుకువాడ.