‘స్థానిక’ నిధులు దారి తప్పుతున్నాయి! | irregularities in local funds | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ నిధులు దారి తప్పుతున్నాయి!

Published Thu, Feb 13 2014 11:46 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

irregularities in local funds

సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల నిర్వహణలో లెక్కలు గాడితప్పుతున్నాయి. అవసరానికి మించి వృధా ఖర్చులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రభుత్వ ఆడిట్ నివేదికలో వెల్లడైంది. జిల్లా పరిషత్ మొదలు మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనూ పలు అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు తేలింది. 2010-11సంవత్సరంలో స్థానిక సంస్థల ఆర్థిక నిర్వహణపై శాసనసభకు ‘ఆడిట్’ విభాగం నివేదిక ను సమర్పించింది.

 ఈ నివేదికలో జిల్లాలో మొత్తంగా రూ.80.34 కోట్ల ఖర్చుకు సంబంధించి 12,020 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దారితప్పిన నిధులను ఆయా బాధ్యులనుంచి రికవరీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాసనసభకు సమర్పించిన నివేదికలో జిల్లాకు సంబంధించి పలు అంశాలపై ఆడిట్ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసిన వాటిలో ప్రధానమైనవి...
     జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న కార్యాలయ భవనాలకు సంబంధించిన అద్దె వసూలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని, రూ. 4.97 లక్షలు బకాయిలు రాబట్టాల్సి ఉందని స్పష్టం చేశారు.

 2000-05 మధ్య కాలంలో 11వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన రూ. 20.68 కోట్లను జెడ్పీ అధికారులు ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో భద్రపర్చారు. ఇది చట్టవిరుద్ధం. ఇలా చేయడంతో వచ్చే వడ్డీ మొత్తాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. వీటిని సర్పంచ్‌ల శిక్షణ నిమిత్తం ఖర్చు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఈ కారణంగా 11వ ఆర్థిక సంఘం నిధుల వినియోగ ఉద్దేశాలు, ప్రయోజనాలు దెబ్బతిన్నట్లు ఆడిటింగ్ సంస్థ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

 షాబాద్ మండలం సర్ధార్‌నగర్ పంచాయతీలో ఎలాంటి నియామక పత్రాలు లేకుండా పార్ట్‌టైం కార్మికులను నియమించి రూ.2.21 లక్షలు జీతాలు చెల్లించారు.

పలు మండల పరిషత్ పరిధిలో కాంట్రాక్టు పనులకు సంబంధించి చట్టబద్ధ చెల్లింపులను పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు పూర్తి నిధులు చెల్లించారు. దీంతో రూ.53.97లక్షలు సర్కారు ఖజానాకు చిల్లుపడింది.

 ఙ్ట్చఛగ్రామ పంచాయతీలు జిల్లా గ్రంథాలయ సెస్సు చెల్లించాల్సి ఉండగా.. శంకర్‌పల్లి, శంషాబాద్ పంచాయతీలు ఎగవేతకు పాల్పడడంతో రూ. 4.22 లక్షల నష్టం వాటిల్లింది.

 ఇబ్రహీంపట్నం మండల పరిషత్‌కు కేటాయించిన 12,13వ ఆర్థిక సంఘం నిధులనుంచి రికార్డులే లేకుండా ఖర్చు చేయడంపై ఆడిటింగ్ విభాగం మండిపడింది. దీంతో ఖర్చు చేసిన మొత్తాన్ని దుర్వినియోగమైనట్లు భావిస్తూ.. రికవరీ చేయాలని సూచించింది.

 జెడ్పీలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఇంధనం పేరిట రూ. 25,997 ఖర్చు చేశారు. అదేవిధంగా మరమత్తుల పేరిట రూ.93,060 అదనంగా ఖర్చు చేశారు.

దొమ్మర పోచంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఒకే పనిని రెండుసార్లు చేయడంతో రూ.60,558 దుర్వినియోగ మైనట్లు గుర్తించారు. శంషాబాద్ పంచాయతీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా రూ.1.64 లక్షలు ప్రజారోగ్య విభాగం పేరిట అధికంగా ఖర్చు చేశారు. కొంపల్లి, దూలపల్లి, బాచుపల్లి, రావిర్యాల గ్రామ పంచాయతీలు అనవసర ప్రకటనలతో రూ.9.99 లక్షలు ఖర్చు చేయడంపై అభ్యంతరం వ్యక్తమైంది. బాచుపల్లి గ్రామ పంచాయతీ నిధులను దారిమళ్లించి రూ.37 వేలను డీపీఓ కారు కిరాయిగా చెల్లించడాన్ని,  అదేవిధంగా రచ్చబండ పేరిట మరో 90వేలు ఖర్చు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు.
వికారాబాద్ మున్పిపాలిటీ పరిధిలో పారిశుధ్య చర్యల్లో భాగంగా చెత్త సేకరణ, ఎరువు తయారీపై అధికారులు దృష్టి సారించకపోవడంపై నివేదికలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.

 ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డు ఖజానా నిల్వలకు సంబంధించి నగదు పుస్తకం, ఖజానా పుస్తకాల్లో రూ.5.92 లక్షల వ్యత్యాసాన్ని గుర్తించారు. తాండూరు వ్యసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పింఛన్లు, కాపలాదారుల వేతనాల్లో నిర్దేశించిన మొత్తంకంటే అధికంగా రూ.1.57 లక్షలు ఖర్చు చేశారు. అదేవిధంగా నార్సింగి మార్కెట్ పరిధిలో 2.52 లక్షలు నిబంధనలకు విరుద్ధంగా పింఛన్ల రూపంలో ఖర్చు చేశారు. రుణ రికవ రీల్లో నిర్లక్ష్యం వహించడంతో తాండూరు ఏఎంసీకి రూ.28లక్షల నష్టం వాటిల్లిందని ఆడిట్ విభాగం పసిగట్టింది. ఇబ్రహీంపట్నం, తాండూరు మార్కెట్ కమిటీలకు సంబంధించి ట్రెజరీ పుస్తకాల్లో రూ. 2.93 లక్షల తేడాను గుర్తించింది.

Advertisement
Advertisement