నిర్వహణ భారం | Management burden | Sakshi
Sakshi News home page

నిర్వహణ భారం

Published Fri, Sep 25 2015 11:52 PM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

Management burden

పంచాయతీలకు నేరుగా ఆర్థిక సంఘం నిధులు
తాగునీటి పథకాల నిర్వహణకు ఇబ్బందులు
జెడ్పీకి జమచేయాలంటున్న అధికారులు
ఇచ్చేది లేదంటున్న సర్పంచ్‌లు

 
జిల్లాలో తాగునీటి పథకాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. గ్రామాల్లోని వీటి బాధ్యత ఇక నుంచి పంచాయతీలదేనంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి నిర్వహణకు రూపాయి కూడా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులపై పెత్తనం చెలాయిస్తోంది. పరోక్షంగా 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ఆంక్షల పట్ల సర్పంచ్‌ల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థలకు జనాభా ప్రాతిపదికన ఏటా ఆర్థిక సంఘం నిధులు వచ్చేవి. ఈ ఏడాది నుంచి పూర్తిగా పంచాయతీలకే కేటాయించడంతో మండల, జిల్లా పరిషత్‌ల పర్యవేక్షణలో ఉన్న పథకాల నిర్వహణ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. రాకరాక పంచాయతీకి రూ.ఐదు లక్షల చొప్పున నిధులొస్తుంటే వాటిని అభివృద్ధి పనులకు కాకుండా నీటి పథకాలకు ఖర్చుచేయమంటే ఎలా అంటూ సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు.
 
విశాఖపట్నం/నక్కపల్లి: జిల్లాలోని 925 పంచాయతీల పరిధిలో 18,485 చేతిపంపులు, 2765 ఎన్‌పీడబ్ల్యూ, పీడబ్ల్యూ, 29సీపీడబ్ల్యూ స్కీమ్‌లున్నాయి. చేతిపంపు నిర్వహణకు రూ.2 వేలు, ఎన్‌పీడబ్ల్యూ, పీడబ్ల్యూ స్కీమ్‌లకు   రూ.లక్షన్నర నుంచి రూ.3లక్షల వరకు, సీపీడబ్ల్యూకు రూ.30లక్షల నుంచి రూ.60లక్షల వరకు ఖర్చవుతుంది. వీటిలో విద్యుత్ బిల్లులే అధికం. సీపీడబ్ల్యూ స్కీమ్‌లను జెడ్పీ, చేతిపంపులను మండల పరిషత్‌లు,ఎన్‌పీ డబ్ల్యూ, పీడబ్ల్యూ స్కీమ్‌లను పంచాయతీలు పర్యవేక్షిస్తుంటాయి. గతేడాది సీపీడబ్ల్యూ స్కీమ్‌ల నిర్వహణకు 13వ ఆర్థిక సంఘం నుంచి రూ.6.29 కోట్లు మంజూరయ్యాయి. అలాగే చేతిపంపులు, ఇతర స్కీమ్‌ల నిర్వహణకు మరో ఐదారు కోట్ల వరకు ఖర్చువుతుంది. వీటిని కేంద్రం ఆర్థిక సంఘం నిధుల నుంచి ఆయా సంస్థలు భరించేవి. నాలుగేళ్ల క్రితం వరకు ఆర్‌డబ్ల్యూఎస్‌కే నేరుగా మెయింటినెన్స్ నిధులు విడుదలయ్యేవి. ఈశాఖ పర్యవేక్షణ లోనే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈ పనులు చేపట్టేవి. నాలుగేళ్ల క్రితం కేంద్రం నిర్ణయంతో నిర్వహణను స్థానిక సంస్థలకే అప్ప గించారు.

పంచాయతీలకే ఆర్థిక సంఘం నిధులు
 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్థిక సంఘ నిధులను నేరుగా పంచాయతీలకే కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. ఎన్‌పీడబ్ల్యూ, పీడబ్ల్యూ స్కీమ్‌ల నిర్వహణకు ఢోకా లేకున్నప్పటికీ చేతిపంపులు, సీపీడబ్ల్యూ స్కీమ్‌ల నిర్వహణను ప్రశ్నార్థకమైంది. ఈ పథకాలన్నీ గ్రామాల కోసమే అయినందున వీటి నిర్వహణ బాధ్యతను పంచాయతీలే చూసుకోవాలని అధికారులు అంటున్నారు. ప్రతీ పంచాయతీ నుంచి  కొంత మొత్తం జిల్లా పరిషత్‌కు డిపాజిట్ చేస్తే అందులో నుంచి వీటి నిర్వహణ చేపట్టవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే చాలా చేతిపంపులు మూలనపడ్డాయి. సీపీడబ్ల్యూ స్కీమ్‌లు పంపులు, ఫిల్టర్ బెడ్స్ పనిచేయక మొరాయిస్తున్నాయి. మరొక పక్క రూ.లక్షల్లో పేరుకుపోయిన విద్యుత్ బిల్లులు భయపెడుతున్నాయి. రోజురోజుకు జటిలమవుతున్న ఈ సమస్య పరిష్కారంపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పథకాల నిర్వహణకు కమిటీ
నీటిపథకాల నిర్వహణకు సర్పంచ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, ఈఈలతో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆర్థిక సంఘం నిధుల్లో కొంత మొత్తాన్ని ఈఈ పేరిట డిపాజిట్ చేస్తారు. జెడ్పీ ఆమోదంతో పనులను చేపట్టాలన్నది ప్రభుత్వ ఆదేశం. ఇప్పటికే సీపీడబ్ల్యూ స్కీములు చాలా చోట్ల మూలకు చేరాయి. ఉదాహరణకు పాయకరావుపేటనియోజకవర్గంలో గొట్టివాడ వరాహానదిలోను, పాయకరావుపేట తాండవనదిలోను సీపిడబ్ల్యుస్కీములు ఏర్పాటు చేసి 130 గ్రామాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సరిగా పని చేయడం లేదు. సగానికిపైగా గ్రామాలకు తాగునీరు అందడం లేదు. జీవో ్రపకారం నీరుసరఫరా కాని గ్రామాలు కూడా జనాభాప్రాతిపదికన ఆర్థిక సంఘనిధులను ఆర్‌డబ్ల్యూఎస్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇదెక్కడి న్యాయమని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘనిధులకు సంబంధించి కేంద్రం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు రాకుండానే రాష్ట్రప్రభుత్వం నిధుల వ్యయంపై జీవో జారీని సర్పంచ్‌లంతా వ్యతిరేకిస్తున్నారు.
 
ఇదెక్కడి న్యాయం
ఇదెక్కడి న్యాయం. పంచాయతీలకు ఒక్కరూపాయి ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చే నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం తగదు. ఇప్పటికే 13వ ఆర్థిక సంఘం  నిధులను విద్యుత్ చార్జీలపేరుతో లాక్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులను పథకాల నిర్వహణ పేరుతో తీసుకోవడం తగదు. బోర్లు, నీటిపథకాల నిర్వాహణ భారాన్ని రాష్ట్రప్రభుత్వమే భరించాలి.
 - నల్లల లక్ష్మీకుమారి, సర్పంచ్, గొడిచర్ల
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement