మంగళంపల్లి పేరిట 10 లక్షల అవార్డు
సాక్షి, విజయవాడ: ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరుతో ఏటా ఆయన జయంతి రోజున ఒక ప్రముఖ సంగీత విద్వాంసుడికి రూ.10 లక్షల నగదు అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలమురళీకృష్ణ 87వ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాక్షేత్రం ఆవరణలో ఏర్పాటు చేసిన బాలమురళీకృష్ణ కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ బాలమురళీకృష్ణ స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో ఆయన పేరిట మ్యూజియం, సంగీత కళాశాల, మెమోరియల్ ట్రస్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బాలమురళీకృష్ణ జన్మించిన ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. గుంటూరు సంగీత కళాశాలకు ‘బాలమురళీకృష్ణ సంగీత కళాశాల’గా నామకరణం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.