mangalampalli
-
మంగళంపల్లి పేరిట 10 లక్షల అవార్డు
సాక్షి, విజయవాడ: ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరుతో ఏటా ఆయన జయంతి రోజున ఒక ప్రముఖ సంగీత విద్వాంసుడికి రూ.10 లక్షల నగదు అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలమురళీకృష్ణ 87వ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాక్షేత్రం ఆవరణలో ఏర్పాటు చేసిన బాలమురళీకృష్ణ కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ బాలమురళీకృష్ణ స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో ఆయన పేరిట మ్యూజియం, సంగీత కళాశాల, మెమోరియల్ ట్రస్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బాలమురళీకృష్ణ జన్మించిన ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. గుంటూరు సంగీత కళాశాలకు ‘బాలమురళీకృష్ణ సంగీత కళాశాల’గా నామకరణం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. -
మంగళంపల్లి అస్థికలు గోదావరిలో నిమజ్జనం
కొవ్వూరు: ఇటీవల మృతి చెందిన ప్రముఖ సంగీత విద్యాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అస్థికలను ఆయన తనయులు సోమవారం గోదావరిలో నిమజ్జనం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం రేవులో బాలమురళి ముగ్గురు తనయులు అభిరామ్, సుధాకర్, వంశీమోహన్ పితృకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అస్థికలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. అంతకు ముందు రాజమహేంద్రవరంలోని కోటిలింగాల రేవులోనూ ఈ కార్యక్రమాలు జరిపించారు. వారివెంట కొవ్వూరు పట్టణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అనుపిండి చక్రధరరావు ఉన్నారు. -
ఇంటివద్ద కూనిరాగాలు కూడా తీసేవారు కాదు
‘సాక్షి’తో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పెద్ద కుమారుడు అభిరామ్ రాజమహేంద్రవరం కల్చరల్ : ‘‘నాన్నగారు కచేరీలకు వెళ్లేటప్పుడు ముందుగా ఎటువంటి ప్రిపరేషన్‌కూ ఇష్టపడేవారు కాదు. ఇంటివద్ద కూనిరాగాలు కూడా తీసేవారు కాదు’’ అని ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పెద్ద కుమారుడు అభిరామ్ అన్నారు. మంగళంపల్లి చితాభస్మాన్ని ఆయన అభిమానుల సందర్శనార్థం కోటిలింగాలరేవు వద్ద ఉంచారు. ఈ సందర్భంగా తమ్ముళ్లు సుధాకర్, వంశీమోహన్, సమీప బంధువులతో నగరానికి వచ్చిన అభిరామ్.. తన తండ్రి, సంగీత సామ్రాజ్య సార్వభౌముడు మంగళంపల్లి జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘మమ్మల్ని ఎప్పుడూ మందలించిన దాఖలాలు లేవు. మాతో ఎంతో సరదాగా, ఆత్మీయంగా ఉండేవారు. బాగా చదువుకోమని మాత్రం చెప్పేవారు. సాధారణంగా గాయకులు శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉంటారు. నాన్నగారు ఇటువంటి నియమాలను ఖాతరు చేసేవారు కాదు. గాయకులు ఏమేం తినకూడదని చెబుతారో అవన్నీ తినేవారు. చాలా సందర్భాల్లో కచేరీకి వెళ్లేముందు ఐస్‌క్రీమ్ తీసుకుని వెళ్లేవారు. బంగాళదుంప వేపుడు, చారు అంటే ఆయనకు ఇష్టం. భారతీయ సంగీత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఆ మహనీయుని స్వగ్రామం శంకరగుప్తంలో ఆయన జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలు చేపడతాం’’ అని అభిరామ్ చెప్పారు. మంగళంపల్లి మనుమడు, వంశీమోహన్ కుమారుడు అయిన బాలమురళి అభి మాట్లాడుతూ, ‘‘నేను ఆ ఇంటిలోనే పుట్టి తాతగారి శిక్షణలోనే పెరిగాను. ఎక్కువ సమయం ఆయనతోనే గడిపే భాగ్యం నాకు దక్కింది’’ అని అన్నారు. ‘‘మంగళంపల్లి బాలమురళీకృష్ణ నాకు బాబాయ్ అవుతారు. అమలాపురం ఎప్పుడు వచ్చినా, ఆయన మా ఇంటిలోనే బస చేసేవారు. శంకరగుప్తంలో బాలమురళి పేరిట ముఖద్వారం కట్టించాను. ఆయన నన్ను పెద్ద కొడుకుగా చూసుకునేవారు’’ అని అమలాపురానికి చెందిన మంగళంపల్లి విజయమోహన మురళీకృష్ణ చెప్పారు. -
కడప గడపలో మురళీగానం
కడప కల్చరల్ : భారత దేశానికి గర్వకారణంగా నిలిచిన గంధర్వ గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళవారం తనువు చాలించారు. తన గంధర్వ గానాన్ని దివిలోని గంధర్వులకు నేర్పేందుకు ఆయన తరలి వెళ్లారని కడప నగరానికి చెందిన పలువురు పెద్దలు, సంగీతజ్ఞులు ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కడప నగరంలో రెండు రోజులు వరుసగా కచేరీలు చేసినపుడు తాము పాల్గొన్న జ్ఞాపకాలను తలచుకుంటున్నారు. మహా గాయకుడు మంగళంపల్లి కడప నగర పర్యటన గురించి పలువురు పెద్దలు చెప్పిన సమాచారం 'సాక్షి' పాఠకుల కోసం.. - మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1982లో కడప నగరంలోని శ్రీరామకృష్ణ హైస్కూలు ఆవరణంలోగల వివేకానంద ఆడిటోరియంలో వరుసగా రెండు రోజులు కచేరీలు చేశారు. అప్పట్లో స్థానిక కవి, రిటైర్డ్ ఎండీఓ ఎన్సీ రామసుబ్బారెడ్డి నాగరాజుపేటలో త్యాగరాజ సంగీత నృత్య కళాశాల నిర్వహించేవారు. జిల్లా వాసులకు మంగళంపల్లి గానమాధుర్యాన్ని రుచి చూపి సంగీతం పట్ల ఎక్కువ మందికి మక్కువ కల్పించాలని రామసుబ్బారెడ్డి మంగళంపల్లిని కడప నగరానికి ఆహ్వానించారు. 1982 జూన్ 22న మంగళంపల్లి కడప నగరానికి వచ్చారు. వివేకానంద ఆడిటోరియంలో ఆహూతులైన ప్రేక్షకుల సమక్షంలో సంగీత కచేరీ చేశారు. తన గానమాధుర్యంతో నగర వాసులను ఓలలాడించారు. దీంతో స్థానిక బ్రాహ్మణ సంఘాలు మరోరోజు కచేరీ చేయాలని ఆయనను ఒత్తిడి చేశారు. అంగీకరించిన బాలమురళి 23వ తేది కూడా కచేరీ చేశారు. ఆడిటోరియం సరిపోక అప్పటికప్పుడు మరికొన్ని కుర్చీలు తెప్పించి ఆడిటోరియం బయట కూడా వేయించారు. కచేరీ రెండు గంటలపాటు కొనసాగింది. - సరస్వతిపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు కచేరీ సమయంలో బాలమురళి పక్కనే కూర్చొని సంగీతాన్ని ఆస్వాదించారు. ఎప్పుడూ ఎవరినీ పొగడని ఆయన వేదికపై బాలమురళి గాత్రాన్ని ఎంతో మెచ్చుకున్నారు. అదే రోజు బాలమురళి స్థానిక కవులు, రచయితలు, నగర ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. - ఆకాశవాణి కడప కేంద్రం అప్పటిస్టేషన్ డైరెక్టర్ పీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళంపల్లి కచేరీని రికార్డు చేసింది. నాటి రెండు రోజుల సభకు ఆకాశవాణికి చెందిన మడిపల్లి దక్షిణామూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సంగీతజ్ఞుల నివాళి.. బాలమురళీకృష్ణ కడపలో చేసిన సంగీత కచేరీలకు హాజరైన సీనియర్ కవి ఎన్సీ రామసుబ్బారెడ్డి, ఆయన సహచరుడు, కవి సుబ్బరాయుడు, ప్రముఖులు డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి బాలమురళి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ గాయకులు వీఎస్ రామానుజచార్యులు, టీవీఎస్ ప్రకాశ్, యలమర్తి మధుసూదన, నేలబొట్ల చంద్రశేఖర్‌రావు, శ్రీవాణి అర్జున్‌లు మంగళంపల్లి మృతితో భారతీయ, శాస్త్రీయ సంగీత మేరువు కూలిపోయినట్లేనని నివాళులర్పించారు. కొండూరు పిచ్చమ్మ, వెంకట్రాజు స్మారక సంస్థ వ్యవస్థాపకులు కొండూరు జనార్దన్‌రాజు, వైవీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి, డాక్టర్ మూలమల్లికార్జునరెడ్డి, అంధుల పాఠశాల ఉపాధ్యాయుడు, కళాకారుడు సాంబశివుడు, బి.కోడూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్, ఇంకా పలువురు సంగీతాభిమానులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
గోదారి తీరం కన్నీటి రాగం
సంగీత సామ్రాజ్య సార్వభౌమ, పద్మవిభూషణ్, ఫ్రెంచ్ శెవాలియర్ అవార్డు గ్రహీత డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ మృతితో సంగీతాభిమానులు శోకసాగరంలో మునిగిపోయారు. గోదారమ్మ ఒడిలో కనులు తెరిచిన బాలమురళి భారతీయ శాస్రీ్తయ సంగీత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సంగీత ప్రపంచ మేరునగ ధీరుడు. తెలుగువారి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. త్యాగరాజ నారాయణదాస సేవా సమితికి స్థలం కేటాయింపునకు ఆయన విశేష కృషి చేశారు. నేటికీ ఆయన గోదావరి గట్టున ఉన్న త్యాగరాజ నారాయణదాస సేవాసమితి నిధికి శాశ్వత సభ్యుడు. 2003 పుష్కరాలలో ఆయన నగరానికి వచ్చి, అనేక సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2012లో శారదానగర్‌లోని ఒక పార్కుకు నగర పాలక సంస్థ ఆయన పేరుపెట్టింది. ఆ కార్యక్రమానికి ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయినా, నాటి మునిసిపల్ కమిషనర్‌కు ఫోను ద్వారా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. – రాజమహేంద్రవరం కల్చరల్ సంగీత సభ ఏర్పాటు రాజమహేంద్రవరానికి చెందిన బాలమురళి వీరాభిమాని సాగి శ్రీరామచంద్రమూర్తి 1995లో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరిట సంగీత సభను నెలకొల్పారు. ఏటా ఆయన పుట్టిన రోజున సంగీత సభలు నిర్వహించడం, సంగీత కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన పుట్టిన రోజున గోదావరి గట్టున ఉన్న ఉమామార్కండేయేశ్వరస్వామి ఆలయంలో బాలమురళి పేరిట పూజలు చేసి, ప్రసాదాన్ని ఆయనకు పంపేవారు. ఆయన మరణ వార్తవిని నగర ,ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. ఏటా ఆయన పుట్టినరోజు నిర్వహిస్తున్నా డాక్టర్ బాలమురళీకృష్ణ సభ ఆధ్వర్యంలో 1995 నుంచి ఎందరో పెద్దల సహకారంతో క్రమం తప్పకుండా ఏటా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నాను. నా మనుమడికి ఆయన పేరే పెట్టుకున్నాను. ఇక్కడ నిర్వహించే ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి వస్తానని చెప్పారు. ఆ మంచి రోజు రాకుండానే ఆయన కన్నుమూయడం బాధాకరం. – సాగి శ్రీరామచంద్రమూర్తి, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత సభ వ్యవస్థాపక కార్యదర్శి, రాజమహేంద్రవరం తొలి సంగీత కచేరీ కాకినాడలోనే.. కాకినాడ కల్చరల్ : ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాల మురళీకృష్ణకు కాకినాడ నగరంతో మంచి అనుబంధం ఉంది. బాలమురళి ఈ జిల్లాకు చెందిన వారే కావడంతో ఆయన తొలి సంగీత కచేరీ సూర్యకళా మందిర్‌లోనే నిర్వహించారు. అభ్యుదయ ఫౌండేషన్ 5 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సూర్యకళా మందిర్‌లో 2013 జనవరి 13న నిర్వహించిన అభ్యుదయ సంప్రదాయ సాంస్కృతిక వైభవం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంగీత కచేరీ నిర్వహించి సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధులను చేశారు. సూర్యకళా మందిరం శతాబ్ది వేడుకలను పురస్కరించుకొని 2004 అక్టోబర్‌లో భవనాన్ని ఆధునికీకరించారు. ఈ భవనాన్ని బాలమురళీకృష్ణ ప్రారంభించారు. కాకినాడలోని సంగీత విద్వాంసులు మునిగంటి వెంకట్రావు, డాక్టర్ ఇ.వి.కృష్ణమాచార్యులు, పెద్దాడ సూర్యకుమారిలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. రాజమహేంద్రవరంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తా కొత్తపేట : ప్రముఖ సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు, నేపథ్య గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతి తీరని లోటని ప్రముఖ శిల్పి, ఉభయ గోదావరి జిల్లాల సంగీత, వాయిద్య, నృత్య కళాకారుల సంఘం గౌరవాధ్యక్షుడు డి.రాజ్‌కుమార్ వుడయార్ నివాళులర్పించారు. మంగళంపల్లి మృతి చెందారన్న వార్త తెలిసి రాజ్‌కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. వివిధ సందర్భాల్లో బాలమురళీకృష్ణతో మంచి పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి తాను రూపొందించిన పలు విగ్రహాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆవిష్కరించినప్పుడు ఆయన తనకు ఫోన్ చేసి అభినందించేవారన్నారు. రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులోని తన వుడయార్ ఫై¯న్ ఆర్ట్స్ గ్యాలరీ వద్ద మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరుతో ఉన్న పార్కులో ఆయన జయంతి సందర్భంగా వచ్చే ఏడాది జూలై 6న మంగళంపల్లి విగ్రహాన్ని నెలకొల్పుతానని రాజ్‌కుమార్ తెలిపారు. – ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్‌వుడయార్