ఇంటివద్ద కూనిరాగాలు కూడా తీసేవారు కాదు
ఇంటివద్ద కూనిరాగాలు కూడా తీసేవారు కాదు
Published Mon, Nov 28 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
‘సాక్షి’తో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పెద్ద కుమారుడు అభిరామ్
రాజమహేంద్రవరం కల్చరల్ : ‘‘నాన్నగారు కచేరీలకు వెళ్లేటప్పుడు ముందుగా ఎటువంటి ప్రిపరేషన్‌కూ ఇష్టపడేవారు కాదు. ఇంటివద్ద కూనిరాగాలు కూడా తీసేవారు కాదు’’ అని ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పెద్ద కుమారుడు అభిరామ్ అన్నారు. మంగళంపల్లి చితాభస్మాన్ని ఆయన అభిమానుల సందర్శనార్థం కోటిలింగాలరేవు వద్ద ఉంచారు. ఈ సందర్భంగా తమ్ముళ్లు సుధాకర్, వంశీమోహన్, సమీప బంధువులతో నగరానికి వచ్చిన అభిరామ్.. తన తండ్రి, సంగీత సామ్రాజ్య సార్వభౌముడు మంగళంపల్లి జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘మమ్మల్ని ఎప్పుడూ మందలించిన దాఖలాలు లేవు. మాతో ఎంతో సరదాగా, ఆత్మీయంగా ఉండేవారు. బాగా చదువుకోమని మాత్రం చెప్పేవారు. సాధారణంగా గాయకులు శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉంటారు. నాన్నగారు ఇటువంటి నియమాలను ఖాతరు చేసేవారు కాదు. గాయకులు ఏమేం తినకూడదని చెబుతారో అవన్నీ తినేవారు. చాలా సందర్భాల్లో కచేరీకి వెళ్లేముందు ఐస్‌క్రీమ్ తీసుకుని వెళ్లేవారు. బంగాళదుంప వేపుడు, చారు అంటే ఆయనకు ఇష్టం. భారతీయ సంగీత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఆ మహనీయుని స్వగ్రామం శంకరగుప్తంలో ఆయన జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలు చేపడతాం’’ అని అభిరామ్ చెప్పారు. మంగళంపల్లి మనుమడు, వంశీమోహన్ కుమారుడు అయిన బాలమురళి అభి మాట్లాడుతూ, ‘‘నేను ఆ ఇంటిలోనే పుట్టి తాతగారి శిక్షణలోనే పెరిగాను. ఎక్కువ సమయం ఆయనతోనే గడిపే భాగ్యం నాకు దక్కింది’’ అని అన్నారు. ‘‘మంగళంపల్లి బాలమురళీకృష్ణ నాకు బాబాయ్ అవుతారు. అమలాపురం ఎప్పుడు వచ్చినా, ఆయన మా ఇంటిలోనే బస చేసేవారు. శంకరగుప్తంలో బాలమురళి పేరిట ముఖద్వారం కట్టించాను. ఆయన నన్ను పెద్ద కొడుకుగా చూసుకునేవారు’’ అని అమలాపురానికి చెందిన మంగళంపల్లి విజయమోహన మురళీకృష్ణ చెప్పారు.
Advertisement