శోకం మిగిలింది! | Mothers and daughters suicide in Ponduru railway station | Sakshi
Sakshi News home page

శోకం మిగిలింది!

Published Wed, Jul 5 2017 4:08 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

శోకం మిగిలింది!

శోకం మిగిలింది!

రైలు కింద పడి ఇద్దరు బలవన్మరణం
మృతులు వరుసకు తల్లీకొడుకులు
చనిపోతున్నట్లు సమాచారం ఇచ్చి మరీ ఆత్మహత్యకు పాల్పడిన వైనం
పొందూరులో ఘటన.. సంతకవిటి మండలంలో విషాదం


పొందూరు రైల్వే స్టేషన్‌ మరో బలవన్మరణానికి సాక్షీభూతమైంది. పది రోజుల కిందట ఈ స్టేషన్‌కు సమీపంలోనే తల్లీకూతుళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఒకరు చనిపోయారు. తాజాగా  మరో ఇద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగు చూసింది. బూరాడ ధనుంజయరావు(20), బూరాడ సీతాలక్ష్మి(35)లు వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు తీసుకున్నారు. వీరిలో సీతాలక్ష్మి ధనుంజయరావుకు పిన్ని అవుతుంది. ఈ ఘటనకు ముందు ఇరు కుటుంబాల్లో జరిగిన కొన్ని సంఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నా.. పూర్తిస్థాయిలో మాత్రం కారణాలు తెలీలేదు. తల్లి మరణంతో పది, ఐదేళ్ల వయసున్న చిన్నారులు దిక్కులేని వారవ్వడం ఆ గ్రామస్తులను కలిచివేస్తోంది.  

రాజాం/పొందూరు : బంధం బద్దలైంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. పొందూరు రైల్వేస్టేషన్‌ పరిధి వాండ్రంగి గేటు సమీపంలో పట్టాలపై రెండు శవాలు పడిఉన్నట్టు మంగళవారం తెల్లవారు జామున విధుల్లో ఉన్న కీమెన్‌ పొందూరు రైల్వే స్టేషన్‌ మాస్టార్‌కు సమాచారం అందించారు. దీంతో స్టేషన్‌ మాస్టర్‌ రైల్వే పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ దొరికిన ఆధారాల ప్రకారం మృతులు సంతకవిటి మండలం సోమన్నపేట గ్రామానికి చెందిన బూరాడ ధనుంజయరావు (20), బూరాడ సీతాలక్ష్మి (35)గా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు.


 ఒకే కుటుంబానికి చెందిన వారు..
ట్రైన్‌ కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ధనుంజయరావు, సీతాలక్ష్మిలు ఒకే కుటుంబానికి చెందిన వారు. రేగిడి మండలానికి చెందిన సీతాలక్ష్మికి పదకొండేళ్ల క్రితం సంతకవిటి మండలం సోమన్నపేట గ్రామానికి చెందిన బూరాడ ప్రసాదరావుతో వివాహం జరిగింది. వీరికి పిల్లలు సాయితేజ(10), హేమకిరణ్‌ (5) ఉన్నారు. వీరు సంతకవిటిలోని ఓ ప్రైవేటు స్కూళ్లో చదువుతున్నారు. కొన్నాళ్లు ఆటోను నడిపిన ప్రసాద్‌ బతుకుతెరువు కోసం భార్య సీతాలక్ష్మిని తీసుకొని కర్నాటక వెళ్లి బొంతలపని చేసుకుంటూ బతుకుతున్నాడు. తన పిల్లలను సోమన్నపేటలో ఇంటి వద్దే నాన్నమ్మ వద్ద ఉంచి భార్యాభర్తలు వలస కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. మరోవైపు ప్రసాద్‌ సోదరుడు భుజంగరావు కూడా తన భార్య నారాయణమ్మతో తెలంగాణా రాష్ట్రంలో వలస కూలీగా జీవనం సాగిస్తునారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిని సోమన్నపేటలో ఉంచి చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు ధనుంజయరావు ప్రస్తుతం రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

నాలుగు రోజులుగా బయటేః
ధనుంజయరావు నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఉంటాడని బంధువులు అనుకున్నారు. అదే సమయంలో మూడు రోజుల క్రితం నుంచి కర్నాటకలోని ప్రసాదరావు ఇంటి వద్ద తన భార్య సీతాలక్ష్మి కూడా కనిపించలేదు. మరో వైపు ఇంట్లో కొద్దిపాటి బంగారం కూడా కనిపించకపోవడంతో ప్రసాద్‌కు అనుమానం వచ్చి తన సోదరులకు, బంధువులకు సమాచారం చేరవేశాడు. ఈ నెల మూడో తేదీన కర్నాటకలోని పోలీసుస్టేషన్‌లో తన భార్య కనిపించడం లేదంటూ మిస్సింగ్‌ కేసు కూడా నమోదు చేయించాడు.

మెసేజ్‌లు పెట్టి..
పెద్ద కుమారుడు ధనుంజయరావు కనిపించకపోవడంతో భుజంగరావు, భార్య ఆచూకీ లేకపోవడంతో ప్రసాదరావులు వెతుకులాట ప్రారంభించారు. చివరకు మంగళవారం తెల్లవారు జామున ఈ కుటుంబాలకు చెందిన పలువురి సెల్‌ఫోన్‌లకు మేము చనిపోతున్నామని ధనుంజయరావు సెల్‌పోన్‌ నుంచి మెసేజ్‌ వెళ్లినట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ఈ మెసేజ్‌లు చూసి కుటుంబీకులు అప్రమత్తమైనప్పటికీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. ధనుంజయరావు, సీతాలక్ష్మిలు ఆత్మహత్యకు పాల్పడి విఘతజీవులుగా మారారు. కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ఈ నాలుగు రోజులు వీరు ఎక్కడ ఉన్నారు, ఏం జరిగిందనేది అంతుచిక్కడం లేదు.

తల్లి ప్రేమకు దూరమైన చిన్నారులు
సీతాలక్ష్మి మృతితో ఇద్దరు పిల్లలు సాయితేజ, హేమకిరణ్‌  తల్లి ప్రేమకు దూరమయ్యారు. ఇంటిదగ్గర జనం చేరడంతో ఏం జరిగిందో తెలియక బిత్తర చూపులు చూస్తుండడం స్థానికులను కలచివేసింది.  

ముక్కలైన శరీరాలు
రైలు కిందపడి చనిపోయిన ధనుంజయరావు, సీతాలక్ష్మిల మృతదేహాలు ముక్కలైపోయాయి. వీరి శవాలను చూసి భారీగా తరలివచ్చిన సోమన్నపేట గ్రామస్తులు చలించిపోయారు.

పోస్టుమార్టం వాయిదా
ధనుంజయరావు, సీతాలక్ష్మిల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అయితే మంగళవారం పోస్టుమార్టం నిర్వహించలేదు. మృతుల రక్త సంబంధీకులు సుదూర ప్రాంతాల్లో ఉండడంతో వారి వచ్చేవరకూ పోస్టుమార్టం నిర్వహణ కష్టమని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేయడంతో బుధవారానికి వాయిదా వేశారు.

Advertisement
Advertisement